యువ -2024 ! వీళ్లే పవర్ ఛేంజర్స్

By KTV Telugu On 11 April, 2024
image

KTV TELUGU :-

మనది యువ భారతం.  కొత్త ఓటర్లు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నారు.   కొత్త తరానికి మరో ప్రత్యేకత ఉంది.  వారంతా డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న వారు. పెద్దనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉండేవారే.  అందుకే… వారి ఓటు ఇప్పుడు కీలకం కానుంది.  వారు ఎవరి వైపు మొగ్గితే వారికే విజయావకాశాలు ఉంటాయి.  వారి ఆలోచనల్ని ప్రభావితం చేయడానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చేయని ప్రయత్నాలే లేవు.  మరి కొత్త జనరేషన్ ఓటు ఎవరికి ?

భారత దేశ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ఘట్టం 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం. అప్పటికి వారికి మంచి చెడ్డలు తెలుసుకునే తెలివి తేటలు వస్తాయని భావించి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ ఓటు హక్కు కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ప్రతి ఐదేళ్లకోసారి ఓటర్లు .. యువ ఓటర్లు భారీగా జత అవుతున్నారు. ఈ సారి ఓటర్ జాబితాలో చేరిన ఓటర్లకు ప్రత్యేకత ఉంది.  ఇంటర్నెట్, డిజిలైజేషన్ అనేది జీవితాల్లోకి వేగంగా రావటం ప్రారంభమైన తర్వాత పుట్టిన తొలి తరం ఇది. అంటే వీళ్లు పెరిగిందంతా టెక్ ప్రపంచంలో. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి ఎన్నో వేల సోషల్ మీడియా యాప్స్ మధ్యలో ఈ తరం పెరుగుతూ వచ్చింది.  ఈ జనరేషన్ చేతిలోనే ఈ సారి ఓటింగ్ ఆధారపడి ఉంది.

మనదేశంలో ఉన్న 140 కోట్లకు పైగా జనాభాలో 65శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లే. మన జనాభాలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు 50 శాతం. ప్రపంచంలోనే ప్రస్తుతం యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఇండియా టుడే బంబుల్ అనే డేటింగ్ యాప్ తో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ సర్వే చేసింది. దాంట్లో 46 శాతం యువతీ యువకులు తము డేటింగ్ చేయబోయే అమ్మాయి లేదా అబ్బాయి ఏ పొలిటికల్ ఐడియాలజీతోనే ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. 15శాతం యువతీయువకులు ఓటు వేయం అనే వాళ్లను డేటింగ్ చేయటానికి కూడా ఇష్టపడటం లేదని తేలింది. అంటే రాజకీయాలు ఆ స్థాయిలో కొత్త జనరేషన్ కి ప్రియారిటీగా మారాయి. 2019లో ఓటు వేసిన ఫస్ట్ టైమ్ ఓటర్ల లో కోటి 50లక్షల మంది 18-19 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్లున్నారు. కానీ ఈసారి అంటే 2024లో కోటి 80లక్షల మంది 18-19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఓటర్లున్నారు.

మరి వీళ్లను ఓటు అడగాలంటే ఎలా.. ఏకైక మార్గం సోషల్ మీడియానే.  కొత్తతరం పొలిటికల్ అప్ డేట్స్‌ని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా తెలుసుకుంటున్నారు. 26శాతం మంది యూట్యూబ్, 17శాతం మంది ట్విట్టర్ నుంచి, 12 శాతం మంది ఫేస్ బుక్ నుంచి పొలిటికల్ అప్డేట్స్ పొందుతున్నారు. అందుకే పొలిటికల్ పార్టీలు కూడా స్ట్రాటజీలు మార్చాయి. డిజిటల్ క్యాంపెయిన్స్ ను అగ్రెసివ్ గా చేస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించటం, వాళ్లను సన్మానించటం, కలవటం మాట్లాడటం లాంటివి చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీసెంట్ గా ఏర్పాటు చేసిన మీటింగ్ కానీ రాహుల్ గాంధీ యూత్ ఓటర్లతో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాలు..తెలంగాణ, ఆంధ్రాల్లో సోషల్ మీడియా స్టార్లతో చేయిస్తున్న క్యాంపెయిన్లు ఇవన్నీ అందులో భాగమే.

నెహ్రూ ప్రధానిగా పోటీ చేసినప్పుడు 47 శాతం యువతే కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ టైమ్ లో విధించిన ఎమర్జెన్సీ యూత్ కి చాలా కోపం తెప్పించింది. 28శాతం మంది మాత్రమే కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. మళ్లీ 90ల్లో రాజీవ్ గాంధీ వైపు యూత్ మళ్లారు. కొత్త మిలీనియం ఆరంభంలో బీజేపీ వైపు నిలబడింది యూత్ ఓటర్లే. 2014లో బీజేపీకి పడిన ఓట్లలో 34శాతం యువ ఓటర్లు వేసినవే. 2019లో అది 41శాతానికి పెరిగింది. 2014 అండ్ 2019లో కాంగ్రెస్ తరపున నిలబడిన యూత్ ఓటర్లు 19శాతం మాత్రమే.  యూత్ ఓటర్లు తమకు కావాల్సిన నాయకుడిని గెలిపించుకుంటున్నారు. ఈ సారి పదేళ్ల పాలనపై బీజేపీ వికసిత్ భారత్ అని ప్రచారం చేసుకుంటోంది. కానీ దేశం నాశనమైపోయిందని కాంగ్రెస్ అంటోంది. ఎవరి మాటల్ని ఎక్కువ నమ్ముతారో వారికే ఓట్లేస్తారు కొత్తతరం.  వారు ఎవరికి ఓట్లేస్తే వారికే విజయం. అందుకే వారు పవర్ ఛేంజర్స్ .

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి