Katchateevu Issue – కచ్చతీవు కాదు కక్ష దీవి

By KTV Telugu On 12 April, 2024
image

KTV TELUGU :-

ఎన్నికలంటేనే రాజకీయం. ఎన్నికలొస్తే చాలు దేన్నయినా రాజకీయం చేయచ్చు. ఇసుక నుండి తైలాన్ని పిండినట్లు దీవుల నుంచి భావోద్వేగాలు పిండేయచ్చు. ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోంది.తమిళనాడు సమీపంలోని కచ్చతీవు దీవిని అమాంతం తెరపైకి తెచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దీవిని తమిళనాడు జాలర్ల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చేసిందని మోదీ మండిపడుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా తగ్గడం లేదు. పదేళ్లుగా అధికారంలో ఉన్నది మీరే కదా..మరి ఆ కచ్చతీవు దీవిని శ్రీలంక నుండి ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పండి అంటూ  హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ఎన్నికలు వస్తే కచ్చతీవు అమాంతం వార్తల్లోకి ఎక్కేస్తుంది.

భారత్-శ్రీలంకల మధ్య..తమిళనాడుకు సమీపంలో ఉన్న చిన్న దీవే కచ్చతీవు.తమిళ నాడులోని రామేశ్వరానికి…శ్రీలంక లోని జాఫ్నాకీ మధ్యలో ఉంది ఇది.తమిళనాడుకు పది మైళ్ల దూరంలో   ఇది కొలువు తీరింది.అపారమైన మత్స్య సంపదకు  మారు పేరు ఇది.

వేల సంవత్సరాలుగా కచ్చతీవుల్లో చేపలు పట్టి పొట్టపోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది. అప్పటి నుండి తమిళ మత్స్య కారులకు కష్టాలు మొదలయ్యాయి.దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక  తమ నావికాదళాలను ఇక్కడ మోహరించింది.అందుకు కారణాలూ ఉన్నాయి ఒకప్పుడు ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులకూ ఇది షెల్టర్ గా ఉండేది. అందుకే ఇటు వైపు  నావికాదళాలను మోహరించి ..ఇటు వైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది.

తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారీలో కచ్చతీవులు భాగమేనని రెవిన్యూ రికార్డులు చెబుతున్నాయి.రామనాథ పురానికి చెందిన రాజు  సేతుపతి  పాలనలోనూ.. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ..స్వాతంత్ర్యం వచ్చాక  స్వతంత్ర భారత  పాలనలోనూ కూడా కచ్చతీవులు తమిళనాడు ఆధీనంలోనే  ఉన్నాయి.1605 లో రామనాథ పురాన్ని ఏలిన సేతుపతి రాజు  హయాంలో 69 గ్రామాలు..ఏడు దీవులను  పాలించాడు. వాటిలో కచ్చతీవులు కూడా ఉన్నాయి.శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు  స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే 1974 లో ఇందిరా గాంధీ  తమ నోటికాడి ఆహారాన్ని తన్నేసి ..శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా  ఇందిరాగాంధీ ప్రభుత్వం..తమిళనాడులోని కరుణానిథి ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

దశాబ్ధాలుగా కచ్చతీవులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు మత్స్యకారులు విజ్ఞప్తులు చేస్తూనే వస్తున్నారు.2016 ఎన్నికల్లోనూ కచ్చతీవు ను వాడుకున్నాయి రాజకీయ పార్టీలు. ఆ ఎన్నికల్లో తమని గెలిపిస్తే కచ్చతీవును స్వాధీనం చేసుకుంటామని కరుణానిధి హామీ ఇచ్చారు. అయితే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేసినా ఆయన పట్టించుకోలేదని అన్నాడిఎంకే మండి పడుతోంది. డిఎంకే నేతలు మాత్రం కేంద్రం  శ్రీలంకకు ఇస్తోన్న సంగతి తమకి చెప్పలేదని దబాయిస్తున్నారు. తాజాగా  లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకు వచ్చారు. కాంగ్రెస్ దుర్మార్గం..అనాలోచిత నిర్ణయాలే తమిళనాడు గంగపుత్రులకు శాపం అయ్యిందన్నారాయన.

2013 లో రాజ్యసభలో కచ్చతీవుల గురించిన చర్చ లో  తమిళనాడుకు చెందిన అన్నా డిఎంకే..డిఎంకే లతో పాటు  సిపిఐ  సీనియర్ నేత  రాజా కూడా కచ్చతీవుల విషయంలో తమిళనాడు జాలర్లకు న్యాయం జరగాల్సిందేనని పట్టుబట్టారు.వారితో పాటు నాటి ప్రతిపక్ష ఎంపీగా  వెంకయ్యనాయుడు కూడా కచ్చతీవులు తమిళనాడుకు చెందినవే అన్న విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని..తమిళ జాలర్లకు న్యాయం చేసేలా యూపీయే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది తర్వాత బిజెపియే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ కచ్చతీవులను స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించకుండా ఇపుడు ఎన్నికల సమయంలో హడావిడి చేయడంలో అర్ధం లేదంటున్నారు కాంగ్రెస్, డిఎంకే నేతలు.

ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా.. నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే కూటమే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా కచ్చతీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది ఇంచుమించు జరిగే పని కాదంటున్నారు  రాజ్యాంగ నిపుణులు. ఎన్నికల్లో ఆవేశకావేశాలు ఎగదోయడానికి తప్ప కచ్చతీవుల అంశంపై  ఎవరేం మాట్లాడినా నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు వారు. తమిళనాడు మత్స్యకారులు మాత్రం తమ జీవితాలతో రాజకీయాలు ఆడొద్దంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి