భారత రాష్ట్ర సమితి అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ పేరును మారుస్తూ తీర్మానం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణా రాష్ట్ర సమితి గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రజలు అయోమయానికి గురయ్యారని..అందుకే పార్టీ ఓటమి పాలు కావలసి వచ్చిందని పార్టీలోని వ్యూహకర్తలు అనుమానిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం 23 ఏళ్ల క్రితం ఏప్రిల్ 27న తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీయార్. ఏళ్ల తరబడి తెలంగాణా ఉద్యమాన్ని ముందుండి నడిపించారాయన. ప్రాణాలకు సైతం తెగించి ఆయన చేసిన ఉద్యమానికి కేంద్రంలోని యూపీయే ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.2014 ఎన్నికల ముందు తెలంగాణా రాష్ట్ర బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కేసీయార్ కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.
నాలుగేళ్ల తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అఖండ విజయాన్ని సాధించి రెండు జాతీయ పార్టీలనూ చావు దెబ్బ తీసింది. వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీయార్. తెలంగాణాలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీయార్ దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ శక్తి ఉండాల్సిన అవసరం ఉందని భావించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి తెలంగాణాలో సాధించిన ప్రగతిని దేశ వ్యాప్తంగా అమలు చేయించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేశారు కూడా.
కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఒక కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకం చేయాలని భావించారు. జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలన్న లక్ష్యంతోనే పార్టీ పేరును మార్చారు. తెలంగాణా రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బి.ఆర్.ఎస్. పేరుతోనే ఇటీవలి ఎన్నికల్లో బరిలో దిగారు. రక రకాల కారణాల వల్ల బి.ఆర్.ఎస్. అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బి.ఆర్.ఎస్. ను బలహీన పర్చేందుకు పావులు కదుపుతోంది.
బి.ఆర్.ఎస్. కు చెందిన కీలక నేతలను కాంగ్రెస్ ఆకర్షించి పార్టీలో చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలిచి తీరాలని రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..అధికారం కోల్పోవడానికి తోడు నేతలు పార్టీని వీడుతుండడంతో బి.ఆర్.ఎస్. శ్రేణులు డీలా పడే అవకాశాలున్నాయని కేసీయార్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి పార్టీలోని ప్రతీ ఒక్కరూ పార్టీ బలోపేతానికి పునరంకితం అయ్యేలా దిశానిర్దేశనం చేయాలని కేసీయార్ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సిఎం అవ్వాలని కేసీయార్ కలలు కన్నారు. నిజానికి తొమ్మిదేళ్లుగా తాను అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసిన నేపథ్యంలో తన హ్యాట్రిక్ విజయం ఖాయమనే ఆయన అంచనా వేసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమికి బహుశా టి.ఆర్.ఎస్. పేరును బి.ఆర్.ఎస్. గా మార్చడం కూడా ఒక కారణం అయ్యి ఉండచ్చని పార్టీ సీనియర్లు కేసీయార్ కు చెప్పినట్లు సమాచారం. తెలంగాణా ప్రజల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అన్న పేరు సెంటిమెంటల్ గా బాగా నచ్చిందని..దాన్ని మార్చడంతో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యారని వారు భావిస్తున్నారు.తెలంగాణా అంటే టిఆర్.ఎస్…టి.ఆర్.ఎస్. అంటేనే తెలంగాణా అని భావించే తెలంగాణా ప్రజలు బి.ఆర్.ఎస్. పేరును ఓన్ చేసుకోలేదని తేలడంతోనే తిరిగి పార్టీ పేరు మారుస్తారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…