ఎన్నికలకు సరిగ్గా నెల ముందు సంచలన సంఘటన జరిగింది.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. అసలు ఈ దాడి ఏమిటి. ఎలా జరిగింది. విపక్షాలు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి…లాంటి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. కాకపోతే అనుమానాలకు అంత తొందరేందుకు, నిజానిజాలు తెలిసే వరకు ఆగలేరా అన్నది కూడా పెద్ద ప్రశ్నే అవుతుంది…
సీఎం జగన్ పై హత్యాయత్నం..సంఘటన జరిగిన వెంటనే జగన్ పార్టీ తొట్టతొలి రియాక్షన్. విజయవాడ నగరంలో శనివారం సాయంత్రం జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడి జరిగిందని వారి వాదన. జగన్ కు దెబ్బ తగిలిన మాట వాస్తవం. ఎడమ కంటిపైన నుదుటి మీద దెబ్బ తగిలి.. రక్తం కారిన మాట కూడా నిజం. రాయి వచ్చి ఆయనకు, ఆయన పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు గాయమైంది. బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎంపై దాడికి సంబంధించి పార్టీలు తలోమాట మాట్లాడుతున్నాయి. అదీ చంద్రబాబు చేయించారని వైసీపీ వాళ్లు బహిరంగంగానే ఆరోపిస్తుంటే.. అసలు ఈ మొత్తం సంఘటనలో పలు అనుమానాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఇద్దరూ రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదనుకోండి….
సీఎం జగన్‌పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్‌నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాట్ బాల్‌ను వినియోగించారని అంటున్నారు. విచారణ చేయకుండా, దర్యాప్తు జరగకుండా ఇలాంటి మాటలు మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుందనేందుకు సందేహించకూడదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్‌సీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేయడం కూడా తప్పే అవుతుంది. ఇక తెలుగుదేశం సోషల్ మీడియా తన వంతుగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సీఎం రోడ్ షో సందర్భంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై సందేశాలను వండి వార్చింది. ఖచితంగా జగన్ నుదుటికే రాయి ఎలా తగిలిందని ప్రశ్నిస్తోంది. వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా రాసేసింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ ఏమి చేస్తోందని మరో ప్రశ్న వేశారు. రాయి తగిలిన ఘటన జరిగిన తర్వాత కూడా బస్ దగ్గర జనాన్ని ఎందుకు క్లియర్ చేయలేదని, అదీ పోలీసుల వైఫల్యమే అవుతుందని కూడా ఆరోపణలు చేసింది. దెబ్బ తగిలిన సీఎం వెంటనే ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని, వెంటనే వెళ్లాలి కదా అని మరో ప్రశ్న సంధించారు. స్వల్పగాయమేనని ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెప్పినప్పటికీ హత్యాయత్నం లాంటి పెద్ద పదాలు ఎందుకు వాడుతున్నారంటే మీడియా వర్సెస్ మీడియా వార్ కు తెరతీశారు…
జగన్ పై దాడి ఎందుకు జరిగిందీ..ఎలా జరిగిందని నిజానిజాలు తెలిసేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఈ లోపు అనుకూల వ్యతిరేక కథనాలకు కొదవ మాత్రం ఉండదు. ఇప్పటికే కోడికత్తి టూ పాయింట్ ఓ అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం ఉదరగొడుతోంది. వాళ్లు ఎందుకంత తొందరపడుతున్నారో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…