రాజకీయాలంటే అవినీతేనా, అందిన కాడికి దండుకోవడమేనా. బీఆర్ఎస్ పార్టీ అంటే తినుడేనా… చనిపోయిన వ్యక్తులపై కూడా ఇంతటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి. వాళ్లు అంతగా దోచుకున్నారా. ఇప్పుడు జనం వారిపై పడి కొట్టే పరిస్థితి తెచ్చుకున్నారా. మరి ఈ అవినీతికి పరిష్కారమేంటి. దివంగత సాయన్న కుటుంబాన్ని కాపాడేదెవ్వరూ….
సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సేవలందించారు. తొలుత టీడీపీలో తర్వాత బీఆర్ఎస్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె లాస్య నందితకు కేసీఆర్ టికెటిచ్చారు. బీఆర్ఎస్ తరపున ఆమె పోటీ చేసి గెలవడంతో ఇక రాజకీయ వారసురాలు వచ్చిందని అందరూ సంతోషించారు. ఇటీవలే ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. దానితో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న చర్చ జరిగిన తర్వాత లాస్య నందిత సోదరి నివేదితకు టికెట్ ఖాయమైంది. ఇంకేముంది బీఆర్ఎస్ టికెట్ సాయన్న ఫ్యామిలీ నుంచి బయటకు పోలేదని సంతోషిస్తున్న తరుణంలోనే కొత్త సమస్య వచ్చి పడింది. సాయన్న కుటుంబంపై కంటోన్మెంట్ పేదలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మా డబ్బులు మాకివ్వాలని డిమాండ్ చేస్తూ నివేదిత ఇంటికి ముట్టడించారు.
బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూము ఇళ్ల స్కాం భారీగానే జరిగింది. ఇళ్లు ఇప్పిస్తామని ఎమ్మెల్యేలు, వారి అనుచరులు జనం దగ్గర డబ్బులు దండుకున్నారు. ఇళ్లు రాకపోవడంతో జనం తిరగబడ్డారు. కొందరు ఏదో కొంత వెనక్కి ఇచ్చి తప్పుకుంటే కొందరు మాత్రం అడ్డంగా బుక్కయిపోయి ఇప్పుడు ఊపురాడక ఇబ్బంది పడుతున్నారు. జనం తీవ్ర ఆగ్రహానికి లోనైన వారిలో సాయన్న కుటుంబం కూడా ఉంది.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, ఆయన కుమార్తె లాస్య నందిత, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత నియోజకవర్గంలోని ప్రజల నుంచి కోటి 46 లక్షల రూపాయలు వసూలుచేసినట్లు ఆరోపణలున్నాయి. నియోజకవరలోని 30 మంది దగ్గర 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని ఆరోపించారు. ఇండ్ల కోసం ఒత్తిడి చేయగా గతేడాది 12 లక్షలు తిరిగి ఇచ్చారు. మిగతా 1.34 కోట్లు ఇవ్వాలని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు. వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నివేదిత ఇంటి ముందు బాధితులు ధర్నా చేశారు. సాయన్న కుటుంబం అవినీతి చేసిందనేందుకు ఆడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని నందితను డిమాండ్ చేస్తున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తాను ఇచ్చిన ఐదు లక్షలకు తోడు మూడు లక్షల వడ్డీ కలిపి మొత్తం ఎనిమిది లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తుండగా వడ్డీ ఎలా ఇస్తామని ఆమె ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఆ ఆడియో దివంగత లాస్య నందితదేనని తేలింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రమేయం కూడా స్కాంలో ఉందని వార్తలు వస్తున్నాయి. దానితో ఆమె పోటీ చేసినా గెలుస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి…
అప్పట్లో కేసీఆర్ మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు చాలా తేడా ఉండేది. ఉన్నత స్థాయి అవినీతి ఒక వంతు అయితే, ఎమ్మెల్యేల అవినీతి మరో వంతుగా ఉండేది. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇలా అన్ని అంశాల్లో అవినీతి జరుగుతూనే ఉండేది. జనం మొత్తుకున్న అధికార పార్టీ వాళ్లు పట్టించుకోకుండా వసూళ్ల దందా కొనసాగించేవారు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత లెక్కలతో సహా మొత్తం బయటకు వస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతుందో లేదో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…