సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతోంది. ఎలాంటి అథంటికేషన్ లేకుండా ఫేక్ న్యూస్ ప్రచారానికి ఇది ఆయుధంగా మారింది. సోషల్ మీడియా రూపం మారిపోతోంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యాలు.. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియో పోస్టులతో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. ఇప్పుడు ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఫలితంగా ఎవరు ఎక్కువ ఫేక్ చేస్తే వాళ్లదే రాజకీయం అన్నట్లుగా మారిపోయింది.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్ అదుపు తప్పుతోంది. ఎదుటి వారి మాటలు, ప్రచారాలు, తప్పొప్పులను పట్టేసి వాటికి మసాలాలు జోడించి కొందరు యూట్యూబర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. గొరంతల్ని కొండంతలుగా చిత్రీకరిస్తూ… ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై ఏహ్యభావం, తమ వారిపై సానుకూల దక్పథం కలిగేలా సినిమా దశ్యాలను, ఫొటోలను జోడించి ఊదర గొడుతున్నారు. ఇందు కోసం పార్టీలతో పాటు అభ్యర్థులు సైతం వార్ రూంలను తెరుస్తున్నారు. పలుకుబడి ఉన్న యూ ట్యూబర్లు, గ్రూప్ అడ్మిన్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీరు వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని ఒప్పందాలేమీ పెట్టుకోవడం లేదు. ఫేక్ న్యూస్ విస్తృతంగా ప్రచారం చేసేందుకు వెనుకాడటం లేదు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ స్థాయిలోనే కాకుండా, అభ్యర్థులు సైతం వార్ రూంలను తెరుస్తున్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారానికి వీలులేని బూతులు, వివాదాస్పద వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో యథేచ్ఛగా పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా లెక్కలేన్ని ఫేక్ పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ తెలుగు మీడియా చానల్ లో సర్వే వచ్చిందని వీడియో వైరల్ అయింది. అది డీప్ ఫేక్ వీడియోగా తేల్చి ఆ చానల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ సంస్థలకు ఉన్న విశ్వసనీయతను ఇలా రాజకీయ పార్టీల సానుభూతిపరులు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదు. తెలంగాణలో ఏర్పడ్డ కరువుపై ఆన్‌లైన్ సాక్షిగా రచ్చ జరుగుతోంది. కాలం తెచ్చిన కరువని కాంగ్రెస్ అంటుంటే, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆర్‌ఎస్ ఏకి పారేస్తోంది. పంటల సాగు, నీటి ఎద్దడి, కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యలు, ఎండిపోయిన జలాశయాలు, వర్షాభావం తదితర సమాచారం, చిత్రాలు, వీడియోలను పోస్టు చేసి ప్రత్యర్థులకు ఊపిరిసలపకుండా చేస్తున్నారు.
టీడీపీ, వైసీపీ , కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రచారం పీక్ స్టేజికి చేరుకుంది. మాటల తూటాలు, విమర్శల బాణాలు, బూతుపురాణాలు జోరందుకుం టున్నాయి. గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రచారం తీరు తారస్థాయికి చేరినా.. వ్యాఖ్యల తీవ్రత ఇప్పటిలా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కోర్టు కేసులు, అరెస్ట్‌లకు సంబంధించి పలు చిత్రాలు, వ్యాఖ్యలను కొన్ని పార్టీల నాయకులు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఫలితంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం క్షేత్రస్థాయిలో కంటే సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా యుద్ద రంగాన్ని తలపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ ,ఇన్‌స్ట్రాగ్రామ్,టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి స్పందన ఎక్కు వగా ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు వాటిపై ఆధార పడుతున్నారు.
సోషల్ మీడియా అనేది సమాచార వ్యాప్తికి అత్యంత సులభమైన, తక్కువ ఖర్చు మాధ్యమం. అయితే ఇదే అది పెద్ద సవాలుగా మారింది. ఫేక్ న్యూస్ పై దేశం, సమాజం మొత్తం సీరియస్‌గా ఆలోచించాలి. ఫేక్ న్యూస్ కోసం ప్రత్యేక అకౌంట్లను, వెబ్ సైట్లను సృష్టిస్తున్నారు. అనేక పత్రికలు కూడా ఫేక్ న్యూస్ వార్తలను ప్రచురిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు కూడా అసలు నిజలేంటో అంచనా వేసులేకపోతున్నారు. తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న వార్తను.. నమ్మి సంతృప్తి పడుతున్నారు. కానీ వారికి అసలు నిజం తెలియడం లేదు. తెలిసిన నమ్మలేనంతగా రాజకీయ పార్టీలు ఆ విషయానికి మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయి. వీటిని నియంత్రించే విషయంలో ఈసీ సహా వ్యవస్థలన్నీ విఫలమవుతున్నాయి. ఫలితంగా ఎన్నికలపై సోషల్ మీడియా ఫేక్ ప్రభావం ఎక్కువగా పడుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…