రెండు మూడు రోజులలో టీవీలలో కూర్చుని మొత్తం చెబుతానని కేసీఆర్ ప్రకటనలు చేసి..రోజులుగా గడిచిపోతున్నాయి. టీవీలు రెడీ అయ్యాయి కానీ ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. ఒకటి కాదు.. రెండు అత్యంత కీలక విషయాల్లో కేసీఆర్ నుంచి ఈ తరహా ప్రకటనలు వచ్చాయి. అందులో మొదటిది కాళేశ్వరం. రెండోది ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ మాట్లాడితే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకూ చూపించడానికి టీవీలు రెడీ అయిపోయాయి. కానీ కేసీఆరే నోరు తెరవలేకపోతున్నారు. చివరికి కవిత అరెస్టుపైనా ఆయన మట్లాడలేకపోతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీలలో కూర్చుని తానే అసలు విషయాలు చెబుతానని కేసీఆర్ నల్లగొండలో ప్రకటించారు. ఇది ప్రకటించి దాదాపుగా నెల కావొస్తుంది.కానీ మర్చిపోయారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా తాను రెండు రోజుల్లో చెబుతానన్నారు. మళ్లీఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అటు కాళేశ్వరం గురించి కానీ.. ఇటు ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ ఆయన మాట్లాడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కేసీఆర్ మాట్లాడితే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకూ చూపించడానికి టీవీలు రెడీ అయిపోయాయి. వీటిపైనే కాదు.. కేసీఆర్ ఇంకా అనేక కీలక విషయాలపై స్పందించడం లేదు. కూతురు కవిత అరెస్టుపై ఇంతవరకు స్పందించలేదు. కవిత అరెస్టయి సోమవారానికి నెలరోజులైంది. అరెస్టయిన దగ్గర నుండి కవిత ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉన్నారు. తన కూతురు అరెస్టు అక్రమమని కాని సక్రమమని కాని కేసీయార్ ఇంతవరకు మాట్లాడకపోవటమే చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒకపుడు కేంద్రప్రభుత్వానికి లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా ఆకాశమే హద్దుగా కేసీయార్ రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూతురును ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ, సీబీఐలు అరెస్టులు చేసినా సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్. ట్యాపింగ్ అంశంపై విచారిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే సుమారు పదిమంది పోలీసు అధికారులను అరెస్టుచేశారు. వీరంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధుల ఫోన్లను తాము టార్గెట్ చేసి వారి ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేసింది పూసగుచ్చినట్లు చెప్పినట్లు వార్తలు, కథనాలు వస్తున్నాయి.
లీకులద్వారా అందుతున్న అరెస్టయిన పోలీసు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని పెద్దతలకాయ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ జరిగింది. ఇదే విషయమై మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు, కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులంతా ట్యాపింగ్ కు బాధ్యులుగా కేసీయార్, కేటీయార్, హరీష్ రావులపైనే ఆరోపణలు చేస్తున్నారు. వ్యతిరేకులంతా ట్యాపింగ్ అంశంలో కేసీయార్ పై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ పర్యటనలో కేసీయార్ ట్యాపింగ్ విషయమై అన్నీ వివరాలు చెబుతానన్నారు. ట్యాపింగ్ జరిగిందా లేదా ? ట్యాపింగ్ లో ఎవరిని అరెస్టుచేయాలనే విషయాన్ని కూడా మూడు నాలుగు రోజుల్లో చెబుతానని చెప్పారు. ఈ మాటచెప్పి పదిరోజులు అవుతున్నా ఇంతవరు నోరిప్పలేదు. ట్యాపింగ్ అంశమైనా, కవిత అరెస్టుపైనా కేసీయార్ ఎందుకని నోరిప్పటంలేదు ? కూతురిని చూడటానికి కేసీయార్ ఢిల్లీకి కూడా వెళ్ళలేదు.
తన హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కు బాధ్యత వహించాల్సింది కేసీయారే అని అందరికీ తెలుసు. పైగా తమ హయాంలో ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కేటీయారే అంగీకరించారు. కొడుకు ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన తర్వాత ట్యాపింగ్ జరగలేదని కేసీయార్ అనేందుకు లేదు. ట్యాపింగ్ తో తనకు సంబంధంలేదని తప్పించుకునేందుకూ లేదు. ఏ రకంగా చూసినా తేనెతుట్టెను కదలించినట్లే అవుతుందని కేసీయార్ భావించినట్లున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం.. ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా సమర్థించుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అవినీతి చేస్తే బిడ్డనైనా క్షమించనని అసెంబ్లీలో ఆయనచేసిన ప్రకటన కవిత విషయంలో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే స్పందించేందుకు కేసీఆర్ వెనుకాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…