కడియం ఫ్యామిలీకి ఎదురుగాలి..?

By KTV Telugu On 17 April, 2024
image

KTV TELUGU :-

పార్టీలు మారిన వారికి కొన్ని విధాలుగా  తిప్పలు తప్పడం లేదు. కొత్తవారు పార్టీలో ఇమిడిపోయే పరిస్తితి లేదు .పాత వాళ్లు వారికి సహకరించడం లేదు. కక్కలేక, మింగలేక కొనసాగాల్సి వస్తోంది. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఎవరేం దెబ్బకొడతారోనని భయపడాల్సి వస్తోంది ఎంపీ ఎన్నికల్లో పుట్టి ముంచుతారన్న ఆందోళన కూడా కొత్త వారిని వెంటాడుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబం ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది.

కడియం శ్రీహరి రాజకీయాలకు కొత్తేమీ కాదు. టీడీపీ, బీఆర్ఎస్లో చక్రం  తిప్పిన నాయకుడాయన. ఒకప్పుడు కేసీఆర్ చల్లని చూపు ఆయనపై ప్రసరించడంతో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా పార్టీలో కడియానికి ఇచ్చిన మర్యాద మాత్రం తగ్గలేదు. ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ సీటు కూడా ఇచ్చారు. ఐనా కడియం వర్తమాన  రాజకీయాలు, కుమార్తె భవిష్యత్తు గురించి ఆలోచించారు. కుమార్తెకు బీఆర్ఎస్ బీ ఫార్మ్  తీసుకోకుండా జంప్ జిలానీ అనేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని తెగ సంబరపడిపోయారు. కాంగ్రెస్ కూడా  కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో కడియం ఆనందానికి అవధులు లేవు. కట్ చేసి చూస్తే ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. కడియం  శ్రీహరికి, పాత కాంగ్రెస్ నేతలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కడియం కుమార్తె కావ్య కోసం పనిచేయలేమని మెజార్టీ లీడర్లు మొండికేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్లందరికీ టికెట్లు ఇవ్వడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారట. ఆ మాట  నేరుగా అధిష్టానం వద్ద ప్రస్తావించకుండా చాప కింద నీరులా రాజకీయాలు చేస్తున్నారు. కడియం  కావ్య ప్రచారంలో కూడా సీనియర్లు పెద్దగా కనిపించడం లేదు. వారిని  బుజ్జగించేందుకు శ్రీహరి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనతో టచ్ లోకి వచ్చేందుకు వాళ్లు ఇష్టపడటం లేదు.  దానితో ప్రచారం ఊపందుకునే కొద్దీ పరిస్తితి ఎలా ఉంటుందోనని శ్రీహరి టెన్షన్ పడిపోతున్నారు…

కడియానికి కష్టపడాలని ఉన్నా ఆయనకు సహకారం  అందడం లేదు. కొందరు ఎంపీ అభ్యర్థులైతే పోటీని లైట్ తీసుకున్నారు. ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  దానితో అధిష్టానం వారిపై సీరియస్ అయినట్లు సమాచారం…

కొందరు అభ్యర్థులు ఇప్పటికి ప్రచారం మొదలు పెట్టలేదు. క్షేత్ర స్థాయిలో లీడర్లతో సమన్వయం చేసుకునేందుకు రివ్యూలు నిర్వహించలేదు. ఎందుకు టికెట్ ఇచ్చారు? అనే తీరుగా ఇంకొందరు ఉన్నారు.ఈ విషయాలను గుర్తించిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ అధిష్టానాన్ని అలర్ట్ చేశారు. దీనితో రంగంలోకి దిగిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ అభ్యర్థులు, ఎన్నికల ఇన్‌చార్జులతో కలిపి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు మార్చుకోవాలని అభ్యర్థులకు సీరియస్‌గా క్లాస్ తీసుకున్నట్లు  తెలుస్తున్నది.పనితీరు సరిగాలేదని ఫిర్యాదులు వచ్చిన అభ్యర్థులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. ఒక్కొక్కరికి ఐదారు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇందులో కొందరు మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్, వరంగల్ ఎంపీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు అభ్యర్థులు ప్రచారం చేయట్లేదని విమర్శలు వస్తున్నాయి. దానం నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ సమన్వయం కమిటీ సమావేశాలకు వెళ్లలేదని తెలుస్తున్నది. మల్కాజిగిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి నాన్‌లోకల్ కావడం పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనితో లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆమెకు సహకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది.జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ ఇంతవరకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ సమన్వయం సమావేశాలు నిర్వహించలేదని విమర్శలు వస్తున్నాయి.

దారికి రాని పార్టీ నేతలు, అభ్యర్థులకు సంబంధించిన రిపోర్టును కాంగ్రెస్ అధిష్టానం  ఢిల్లీ తెప్పించుకుంది. దాని ఆధారంగానే కేసీ వేణుగోపాల్  హైదరాబాద్ వచ్చి మరీ నలుగురైదుగురు అభ్యర్థులను, వారి నియోజకవర్గాలకు కేటాయించిన నేతలను హెచ్చరించి వెళ్లారు. మరి వాళ్లు దారికి వస్తారో లేదో చూడాలి. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కదా…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి