తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తాము 15 సీట్లు కచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.12 స్థానాల వరకు తమ విజయం ఖాయమని బిజెపి అంటోంది. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని బి.ఆర్.ఎస్. చెబుతోంది. రెండు జాతీయ పార్టీలను నమ్మద్దని గులాబీ నేతలు హెచ్చరిస్తున్నారు. బి.ఆర్.ఎస్.-బిజెపిల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ సంచలన ఆరోపణ చేస్తోంది. మరో వైపు బి.ఆర్.ఎస్.-కాంగ్రెస్ లే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కమలనాథులు అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను విడుదల చేయించుకోడానికి బి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కేసీయార్ బిజెపితో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారన్నది కాంగ్రస్ ఆరోపణ. కనీసం అయిదు చోట్ల బిజెపిని గెలిపించేందుకు బి.ఆర్.ఎస్. బలహీన అభ్యర్ధులను రంగలోకి దింపుతోందని కాంగ్రెస్ అంటోంది. ఆ అయిదు నియోజక వర్గాల్లోనూ గులాబీ శ్రేణులు పరోక్షంగా బిజెపి అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలన్నది ఒప్పందంలో భాగమని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. బిజెపి-బి.ఆర్.ఎస్. అభ్యర్ధులను ఓడించి హస్తం పార్టీకి అండగా ఉండాలని కాంగ్రెస్ పిలుపు నిస్తోంది.
మల్కాజగిరి, చేవెళ్ల,భువనగిరి, మహబూబ్ నగర్ ,జహీరా బాద్ లోక్ సభ నియోజక వర్గాల్లో బి.ఆర్.ఎస్. కు బలం ఉంది. అయితే ఈ నియోజక వర్గాల్లో బిజెపి అభ్యర్ధులను గెలిపించడానికి బి.ఆర్.ఎస్. నాయకత్వం ఒప్పుకుందని కాంగ్రెస్ అంటోంది. దీనికి అనుగుణంగానే ఈ అయిదు నియోజక వర్గాల్లోనూ బి.ఆర్.ఎస్. పార్టీ తరపున బలమైన అభ్యర్ధులకు టికెట్ ఇవ్వకుండా కచ్చితంగా ఓడిపోతారనుకున్నవారికే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారన్నది కాంగ్రెస్ వాదన.
అయితే కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతోంది బిజెపి. అవినీతి పరులతో ఒప్పందాలు చేసుకునే అలవాటు బిజెపికి లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చీకటి ఒప్పందాలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని ప్రతీ ఒక్కరికీ తెలుసునంటున్నారు కమలం పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల కోసమే బి.ఆర్.ఎస్. బలహీన అభ్యర్ధులను బరిలోకి దించుతోందన్నది బిజెపి వాదన. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలే బి.ఆర్.ఎస్. తో డీల్ కుదుర్చుకున్నారని బిజెపి దుయ్యబడుతోంది.
కాంగ్రెస్, బిజెపిలు రెండింటినీ నమ్మద్దని బి.ఆర్.ఎస్. నేతలు అంటున్నారు. రెండు జాతీయ పార్టీలూ ప్రజలను మోసం చేసే పార్టీలే అని వారు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణాని రెండు పార్టీలూ మోసం చేశాయని ఫైర్ అయ్యారు. తెలంగాణా రైతుల వడ్లు కొనకుండా బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్, బిజెపి నాయకత్వాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని బి.ఆర్.ఎస్. అంటోంది. ఈ పార్టీల మాయలో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు గులాబీ నేతలు.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో క్లీన్ స్వీప్ చేసి రెండు జాతీయ పార్టీలకే షాకిస్తామంటున్నారు బి.ఆర్.ఎస్. నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తాము అమలు చేయలేని గ్యారంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని.. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుని హస్తం పార్టీకి ఓటు వేసినందుకు పశ్చాత్తాప పడుతున్నారని బి.ఆర్.ఎస్. అంటోంది. లోక్ సభ ఎన్నికల్లో నాలుగుకోట్ల మంది తెలంగాణా ప్రజలు బి.ఆర్.ఎస్. కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూడు పార్టీలూ ప్రజలను అయోమాయనికి గురి చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…