దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా మారింది. వివేకా హంతకులను జగన్ మోహన్ రెడ్డి కాపాడుకొస్తున్నారని వివేకా కూతురు సునీతతో పాటు జగన్ సోదరి షర్మిల కూడా ఆరోపిస్తున్నారు. ఇద్దరూ కూడా అవినాష్ రెడ్డినే నిందితుడని అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడి ట్రాప్ లో పడి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
వై.ఎస్. వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఈ హత్య జగన్ మోహన్ రెడ్డి పనే అని విమర్శించారు. ఓ దశలో హైకోర్టు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావన తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది కూడా. ఆ ఎన్నికల్లో వివేకా హత్య కేసు ప్రభావం ఎక్కడా లేదు. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఘన విజయాన్ని సాధించి టిడిపిని 23 స్థానాలకు పరిమితం చేసింది.ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడు అవినాష్ రెడ్డే అంటూ టిడిపి ఆరోపిస్తూ వస్తోంది. ఈ హత్యకేసు దర్యాప్తులో సిబిఐ అధికారుల పాత్రపైనా విమర్శలు వెల్లువెత్తాయి.
కొద్ది నెలల క్రితమే వివేకా కూతురు సునీత తన తండ్రి హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించారు. సిబిఐ కి ఇచ్చిన వాంగ్మూలంలోనూ అదే చెప్పారు. అయితే వివేకా హత్య జరిగిన రోజున ఘటనా స్థలిలో దొరికిన లేఖను సునీత భర్త నర్రెడ్డి బయట పెట్టకుండా దాచి ఉంచాలని వివేకా పిఎని ఆదేశించడం అనుమానాలకు దారి తీసింది. ఈ సమయంలోనే వివేకాకు రెండో భార్య ఉన్నారని ఆమె తనయుడికి వివేకా ఆస్తి రాస్తారన్న ఆక్రోశంతోనే సునీత భర్త ఈ హత్యకు పురమాయించి ఉండచ్చని మరో వాదన వెలుగులోకి వచ్చింది. అయితే దేనికీ ఆధారాలు లేవు.
ఇక కొద్ది వారాలుగా వివేకా హత్య కేసు బరిలోకి వై.ఎస్. షర్మిల కూడా దూకారు. ఆమె కాంగ్రెస్ చీఫ్ కాగానే వివేకా హత్య కేసు పై తన అన్న జగన్ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె సునీతకు మద్దతు కూడా తెలిపారు. సునీత, షర్మిలను చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారని వైసీపీ అనుమానిస్తోంది. టిడిపి చేసిన ఆరోపణలనే సునీత, షర్మిల వినిపిస్తున్నారన్నది వారి వాదన. ఈ క్రమంలోనే ఎన్నికల నగారా మోగాక వివేకా కేసుపై సునీత షర్మిల దూకుడు పెంచారు.పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో సునీత అవినాష్ రెడ్డే అంతా చేశారని..ఆయన్ను జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు. ఆ ఇద్దరూ పదవుల్లో ఉండగా తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం జరగదన్నారు సునీత.
సునీత సవాల్ విసరడంతో ఆ మర్నాడే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివేకా చివరి రోజుల్లో సునీత చాలా వేధించారని ఆరోపించారు. వివేకా చెక్ పవర్ రద్దు చేసి ఆయన చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసి ఆయన్ను నరకయాతన పెట్టారని సునీతపై విమర్శ చేశారు. వివేకా హత్య చేసింది తానే అని ఒప్పుకున్న దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని అవినాష్ ఆరోపించారు. దస్తగిరి బెయిల్ కోసం ప్రయత్నిస్తే సునీత దాన్ని అడ్డుకోకపోవడం విడ్డూరం అయితే అవినాష్ కు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయాలని ఇదే సునీత పట్టుబట్టడం కూడా చర్చకు దారితీస్తోంది.ఇక వై.ఎస్.ఆర్. సోదరి విమల అయితే షర్మిల, సునీతలను సున్నితంగా మందలించారు. తన మేనల్లుడు అవినాష్ రెడ్డి నిర్దోషన్నారామె. శత్రువుల ట్రాప్ లో పడి కుటుంబ పరువు తీయద్దని ఆమె ఇద్దరికీ హితబోధ చేశారు. మే 13న జరగనున్న ఎన్నికలపై వివేకా కేసు ప్రభావం ఉంటుందా? ఉంటే ఎవరికి నష్టం చేకూరుస్తుంది? అన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…