మైండ్ గేమ్ ..!

By KTV Telugu On 19 April, 2024
image

KTV TELUGU :-

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హాట్  హాట్ గా మారాయి.. ఎవరికి వారు ఆరోపణాస్త్రాలు సంధిస్తుంటే.. ఏది నిజమో ఏది నిజం కాదో అర్థం కాక సగటు ఓటర్లు  తలపట్టుకు కూర్చుంటున్నారు. ప్రతీ పార్టీ మిగతా రెండు పార్టీలు మిలాఖత్ అయిపోయాయని ఆరోపిస్తుంటే.. ఏది నిజమో తెలియడం లేదని ఓటర్లు అంటున్నారు. తాజాగా చేసిన ఆరోపణల్లో కూడా ఏదో  మతలబు ఉందనిపించక మానదు. ఎందుకంటే కేటీఆర్, రేవంత్ చేసిన వ్యాఖ్యలు మామూలువి కాదు కదా….

మీరిద్దరూ దొంగలు..మేము మాత్రమే మంచి వాళ్లం..ఇదీ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్.అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అధికారం మారిన తర్వాత ఆరోపణల పర్వం మరింతగా పెరిగింది. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడులే  నాలుగు రోజులేగా అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఎప్పుడో ఒక సారి ఆరోపించడం కాకుండా.. దాన్ని ఒక ట్రెండీ టాపిగ్గా కొనసాగిస్తూనే ఉన్నారు. కేసీఆర్ అడపాతడపా చేసే కామెంట్స్, కేటీఆర్ రోజువారీ చేసే వ్యాఖ్యలు ఈ దిశగానే ఉంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ అదే ధోరణిలో కొత్త మాట అనేశారు. లోక్ సభ ఎన్నికలు ఇలా ముగిసిపోవడం ..సీఎం రేవంత్  రెడ్డి అలా జంపు జిలానీ అయిపోవడం జరిగిపోతుందని కేటీఆర్ కళ్లకు కట్టినట్లు జోస్యం చెప్పేశారు. పైగా  రేవంత్ రెడ్డి వెంట ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు జతకట్టి బీజేపీ ఆఫీసుకు వెళ్లిపోతారట. ఈ మాట అప్పుడప్పుడూ అంటున్నప్పటికీ .. .రేవంత్ బీజేపీలో చేరిపోతారని, పాతిక మందిని తీసుకెళ్తారని అనడం మాత్రం మొదటిసారే కావచ్చు. దీనికి రేవంత్ ఇస్తున్న కౌంటర్ కూడా గట్టిగానే ఉంది. కేసీఆర్ కు పుత్రికా వాత్సల్యం ఎక్కువై పోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. కవిత బెయిల్ కోసం ఆయన బీజేపీ దగ్గర సుపారీ తీసుకున్నారని. దాని ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో వీక్ కేండెట్లను నిలబెట్టి కమలం పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని రేవంత్ కొత్త థియరీ తెరమీదకు తెచ్చారు..

లోక్ సభ ఎన్నికల తర్వాత సంచలనాలు మాత్రం ఖాయమట. ఈ మాట అన్నదెవరో  కాదు. సాక్షాత్తు బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ మాట అనేశారు. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్నది ఆయన ఇస్తున్న సందేశం కూడా కావచ్చు. మరి నిజంగా ఏమైనా జరుగుతుందా అంటే మాత్రం అవును అని చెప్పలేము. ఎందుకంటే ఇదో రాజకీయ క్రీడ.

ఒకరి మీద ఒకరు పైచేయిగా ఉండాలి. ప్రతిదాడి చేసేందుకు అవకాశం లేకుండా గట్టిగా కొట్టాలి. జనం నమ్మకపోయినా పార్టీల వాళ్లు చెప్పేది నిజమే కావచ్చన్న అనుమానం వారిలో మొలకెత్తించాలి. రేవంత్ రెడ్డి ఎలాగూ పార్టీలు మారారు కాబట్టి ఇంకా సారి ఫిరాయింపు సాధ్యమేనన్న ఫీలింగు సగటు ఓటర్లలో కల్పించారు. పైగా వేరే వాళ్లు చెబుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అలాంటి వాడేనన్న  ఆలోచన కాంగ్రెస్ పార్టీలోని ప్రత్యర్థులకు కూడా కలిగించాలి. కాంగ్రెస్ పార్టీలో  గ్రూపు తగాదాలు పెంచేందుకు కూడా ఈ స్టేట్ మెంట్ ఉపయోగపడాలి. ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి కూడా రెండాకులు ఏమీ తక్కువ తినలేదు కదా. ఆయన కూడా ఏనుగు  కుంభస్థలాన్ని కొట్టేందుకే ప్రయత్నిస్తారు. గురి చూసి  కొడితే బాణం బీఆర్ఎస్ మార్గంలో జనం గుండెల్లో గుచ్చుకోవాలి. అప్పుడే వాళ్లు ఆ స్టేట్ మెంటును విశ్వసిస్తారు. ఇదంతా నిజం కాకపోవచ్చన్న అనుమానం కూడా జనంలో రాకూడదు. అదే మరి మైండ్ గేమ్ అంటే..

రేవంత్ బీజేపీకి వెళ్లడం అంత ఈజీ కాదు.  గతంలో లాగ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మారడం లేదు. రేవంత్ పట్ల రాుహుల్ గాంధీకి పూర్తి విశ్వాసమూ ఉంది. అలాగే కేసీఆర్ ఫ్యామిలీ పట్ల ప్రధాని మోదీకి గానీ, బీజేపీకి గానీ ఎలాంటి సాప్ట్ కార్నర్ లేదు. ఐనా సరే రాజకీయాల్లో గాసిప్స్, మైండ్ గేమ్స్ కి ఓటర్లు పడిపోతారు. ఆ సంగతి తెలుసు కాబట్టే పార్టీలు ఏదైనా మాట్లాడేస్తున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి