మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పొత్తు అనివార్యతలు తెలుసుకోకుండా ఆయన ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత మండిపడ్డారు. ఎంత బుజ్జగించినా దారికి రావడం లేదని ఆగ్రహం చెందారని సమాచారం.
టీడీపీ, జనసేన పొత్తు కొన్ని చోట్ల టీడీపీకి తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను తప్పనిసరి పరిస్థితులలో వదులుకోవాల్సిన నేపథ్యంలో పార్టీలో ఉండి అవకాశం కోల్పోయిన నేతలను బుజ్జగించలేక టీడీపీ అధిష్టానం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ స్థానాన్ని 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఈ సారి పట్టుబట్టి పొత్తులో భాగంగా తీసుకుంది. ఈ క్రమంలో 2014లో టీడీపీ తరపున గెలిచిన బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం రాలేదు. ఐదేళ్లుగా అక్కడ పనిచేసుకుంటూ పోతున్న ఆయన కాస్త నొచ్చుకున్నారు. చేసిన శ్రమ వృథా అయ్యిందని ఆయన టెన్షన్ పడిపోయి టీడీపీ అధిష్టానానికి ఎదురుతిరిగారు. ఆయన్ను దారికి తెచ్చే క్రమంలో చంద్రబాబు కొంత అసహనానికి గురైనట్లు చెబుతున్నారు..
పెందుర్తి పరిస్థితులను అర్థం చేసుకుంటే బండారు సత్యనారాయణ ఆందోళనలో తప్పులేదనిపిస్తుంది. ఇంతకాలం తన ప్రత్యర్థిగా భావించిన నాయకుడికి ఇప్పుడు సహకరించడమేంటని ఆయన లోలోన మథనపడుతూ.. బయటకు కూడా అదే మాట చెప్పుకుంటున్నారని అంటున్నారు…
జనసేన తరపున పెందుర్తి నుండి వైసీపీని వీడి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబును ఎమ్మెల్యేగా పోటీకి దింపారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడం ఒకటైతే, అక్కడ తన చిరకాల ప్రత్యర్ధి పంచకర్ల రమేష్ బాబును పోటీకి దింపడం, అతడి గెలుపుకు తనను పనిచేయాలని చెప్పడం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత బండారు సత్యనారాయణకు ఏ మాత్రం రుచించడం లేదు.పొత్తులో భాగంగా ఈ స్థానం పక్కకు పోతుందని ఊహించిన బండారు సత్యనారాయణ ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. అయినా ఈ స్థానం కోసం టీడీపీ పట్టుబట్టలేదు. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీలో ఉన్న గండి బాబ్జి వర్గం బండారుతో సంబంధం లేకుండా జనసేన అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కూడా బండారుకు రుచించడం లేదు.
బండారు దాదాపుగా తిరుగుబాటు బావుటా ఎగరేశారన్నది ఒక టాక్. వేరే పార్టీ వాళ్లకు మద్దతివ్వడమేంటన్నది ఆయన ఆలోచనా విధానం. ఈ క్రమంలో బహిరంగంగా మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను కూడా ఉల్లంఘిస్తున్నారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు పిలిచి మాట్లాడిన తర్వాత బండారు కాస్త మెత్తబడతారనే పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. లేని పక్షంలో ఎన్నికల తర్వాత జరిగేదేమిటో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…