బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. మాటల మాంత్రికుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా పది నిమిషాలు ఆయన స్పీచ్ వింటే ఆ సంగతి గ్రహిస్తారు. ఉద్యమ కాలంలోనూ, బీఆర్ఎస్ పాలన తొలి నాళ్లలోనూ మాటల గారడీ బాగానే పనిచేసింది. 2003 జనానికి మొహమెత్తిందో, నమ్మలేకపోయారో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. అదీ ఘోరంగా ఓడిపోయారు. ఐనా సరే ఆయన ధోరణి మారలేదు. ఇంకా మాటలతో మెస్మరైజ్ చేయగలనని ఆయన అనుకుంటున్నారు…
భావోద్వేగ ప్రసంగాలు, పంచ్ లైన్ డైలాగులకు కేసీఆర్ చాలా కాలంగా ప్రసిద్ధే. ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పాటుపై ఆయన జనంలో పూర్తి విశ్వాసం కలిగించినందునే ఎక్కువ కాలం పోరాడగలిగారు. చిటికెలో ప్రత్యేక రాష్ట్రం వస్తుందని కూడా నమ్మించగలిగారు. తెలంగాణ ఏర్పాటు కావడంతో కేసీఆర్ కు తిరుగులేకుండా పోయింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మాత్రం ఆయన తప్పటడుగులు వేశారు. కుటుంబ పాలనకు తెరతీశారు. కుమారుడు, కుమార్తె ఇతర కుటుంబ సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించారు. రాష్ట్రాన్ని దోచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఈడ్చి బండకేసి కొట్టారని చెప్పాలి, కొంతకాలం మౌనం వహించిన కేసీఆర్.. మళ్లీ తన పాత పోకడలకు పదును పెడుతున్నారు. మాటల గారడీకి తెరతీస్తున్నారు…
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టయిన ఇన్నాళ్లకు కేసీఆర్ స్పందిస్తున్నారు. మరో పక్క కాంగ్రెస్ లో విభేధాలు ఖాయమని తెలంగాణలో ఆ పార్టీ మునిగిపోవడం తధ్యమని ప్రకటిస్తున్నారు. ఇందులో తన గారడీ విద్యతో ఎక్కువ ఎలివేషన్ ఇచ్చేందుకు సైతం ఆయన వెనుకాడటం లేదు…..
కవిత అరెస్టుకు కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారు. ఫామ్ హౌస్ కేసులో తాము బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించినందుకే ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని కేసీఆర్ తాజాగా ఆరోపించారు. అందుకే ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేశారని ఆయన విశ్లేషించారు. ఇక బీఆర్ఎస్కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే సర్కార్ను కూల్చడానికి బీజేపీ యత్నించిందని, ఇప్పుడు 65 మంది ఉన్న కాంగ్రెస్ను వదిలిపెట్టదని తెలిపారు. రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్లకపోవచ్చుకానీ, ఎమ్మెల్యేల్లో చీలికకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.కేసీఆర్ ఇంకో గారడీకి కూడా తెరతీశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో చేరతారని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. వారంతా ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని ఆయన అంటున్నారు. ఇలాంటి మాటలు ఒట్టి గారడీయేనని జనం చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన 39 మందిలో చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ వైపుకు ఎవరు వస్తారు.. అదంతా ఒట్టిమాటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
తన మాటలు నిజం కాదని కేసీఆర్ కు కూడా తెలుసు. వాటిని జనం నమ్మరని ఆయనకు తెలియనిది కూడా కాదు. ఐనా సరే లోక్ సభ ఎన్నికల వేళ ఏదో విధంగా కేడర్ ను ఉత్తేజ పరచాలి. వారిని దారికి తీసుకురావాలి. ప్రచారంలో బీజీగా ఉంచాలంటే ఏదోక నమ్మకం కలిగించాలి. అంతకంటే కేసీఆర్ ఆశిస్తున్నది కూడా ఏమీ లేదనే చెప్పాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…