కడపలో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టే దిశగా టీడీపీ పెద్ద స్కెచ్ వేసినట్లేనని తేలిపోయింది. స్వయంగా షర్మిలా రెడ్డి రంగంలోకి దిగే దిశగా పరోక్షంగా ప్రోత్సహించిన తెలుగుదేశం..ఇప్పుడు ఆమెను గెలిపించే బాధ్యత కూడా నెత్తికెత్తుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. షర్మిల ప్రతి మీటింగులోనూ జగన్ రెడ్డిని తిట్టిపోయడం, ఏపీ ప్రజలకు ఆయన ఏం చేశారని ప్రశ్నించడం లాంటి చర్యలను టీడీపీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుందనుకోవాలనుకుంటోంది. ఇంతకాలం తాము చెబుతూ వచ్చిన మాటలనే షర్మిల రిపీట్ చేస్తున్నారని, ఇకనైనా జనం అర్థం చేసుకోవాలని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.
రాయలసీమలో అత్యంత కీలక నియోజకవర్గం కడప అని చెప్పాలి. వైఎస్ కుటుంబానికి, ముఖ్యమంత్రి జగన్ కు కడపలో గెలవడం పరువు సమస్యగా పరిణమించింది. కడప లోక్ సభా స్థానానికి ఎవరు పోటీ చేస్తారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా లాంటి ప్రశ్నలకు సీఎం జగన్ స్వయంగా తెరదించారు. అవినాశ్ కే టికెట్ ఖరారు చేశారు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన షర్మిలా రెడ్డి తమ వ్యూహాలను అమలుకు తీసుకువచ్చారు. కడపలో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు నామినేషన్ కూడా వేసేశారనుకోండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎంట్రీతో కడప పార్లమెంటు స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని కొందరు అంటున్నప్పటికీ .. గత రెండు ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదని కూడా విశ్లేషించుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోదరులకు, సోదరి మధ్య టీడీపీ ఎంట్రీ ఇచ్చింది….
కడపలో అసలు గేమ్ టీడీపీదే అవుతుంది. వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపిన కేసులో కడప జనానికి అనేక అనుమానాలున్నాయి. దానితో సహజంగానే రాష్ట్ర అధికారపార్టీపై తీవ్ర అసంతృప్తి కూడా ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ వైసీపీని ఓడించాలన్నది టీడీపీ వ్యూహంగా చెప్పుకోవాలి. ఆ దిశగా ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి…
ఎన్డీయే పొత్తులో భాగంగా తొలుత కడప టికెట్ ను బీజేపీ కోరుకుంది. ఆ పార్టీ తరపున మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాలనుకున్నారు. అదే జరిగితే ముక్కోణ పోటీలో అవినాశ్ రెడ్డి సునాయాసంగా గట్టెక్కిపోతారని టీడీపీ అంచనాకు వచ్చింది. దానితో వ్యూహం మార్చి.. ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు కడపలో ఇబ్బంది లేకుండా తమ వైపు నుంచి ఒక వీక్ కేండెట్ ను బరిలోకి దించాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలో పార్టీ జమ్మలమడుగు ఇంచార్జ్ భూపేష్ రెడ్డిని కడప లోక్ సభకు ప్రకటించింది. తన అభ్యర్థిత్వంపై భూపేష్ రెడ్డి స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారని కడప జనం చెబుతున్నారు. భూపేష్ రెడ్డి పేరును ప్రకటించిన తర్వాతే అసలు గేమ్ మొదలైంది. జనంలో తక్కువగా కనిపించాలని భూపేష్ కు టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లుగా చెబుతున్నారు. షర్మిల రోజుకు మూడు మీటింగులు పెడుతూ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాు…వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి కూడా షర్మిల వెంట తిరుగుతూ జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నా….టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని కడప పార్లమెంటు పరిధిలో జనం చెప్పుకుంటున్నారు. భూపేష్ రెడ్డి కావాలనే ప్రచారానికి దూరంగా ఉంటున్నారని జనం అనుమానిస్తున్నారు. ఎప్పుడైనా బయటకు వచ్చినా పది నిమిషాలు ఉండి వెళ్లిపోతున్నారు….
ఎన్ని కేసులున్నా కడపలో అవినాశ్ రెడ్డిని ఓడించడం అంత సులభం కాదని టీడీపీ గుర్తించింది. సెంటిమెంటుతోనే దెబ్బకొట్టాలని అర్థం చేసుకుంది. అందుకే షర్మిల బరిలోకి దిగుతున్నారని తెలియడంతో టీడీపీ సంతోషించింది. అవినాశ్ ను ఓడిస్తే జగన్ ను ఓడించినట్లే అవుతుందని గ్రహించి.. షర్మిలకు లోపాయకారి మద్దతిస్తోంది. భూపేష్ రెడ్డి అక్కడ నామ్ కే వాస్తే అభ్యర్థిగా ఉంటారు. పోలింగ్ తేదీ నాటికి షర్మిల గెలిచే అవకాశం పది శాతం ఉన్నా సరే.. గేమ్ ఆడెయ్యాలని టీడీపీ భావిస్తోంది. అదేమిటంటే… టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు ఓటెయ్యడమని చెబుతున్నారు. ఒకటికి ఒకటి కలిస్తే రెండు అన్నట్లుగా షర్మిల విజయం ఖాయమని నమ్ముతున్నారు. కడపేరియన్స్ ను షర్మిల వైపుకు తిప్పే ప్రక్రియ ప్రారంభమై కూడా చాలా రోజులైంది కదా….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…