ఏపీ బిజెపిని పూర్తిగా ముంచారు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి. బిజెపి తరపున టికెట్ కావాలంటే వారు టిడిపి నుంచి వచ్చిన వారైనా అయి ఉండాలి లేదంటే మనోళ్లు అయినా అయి ఉండాలి.ఈ రెండూ కాకపోతే మాత్రం టికెట్ పై ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడి పార్టీకి బిజెపిని బ్రాంచి కార్యాలయంగా మార్చేశారని పురందేశ్వరిపై బిజెపి వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చంద్రబాబు ఆదేశించడమే ఆలస్యం బిజెపి నేతకు కేటాయించిన సీటును కూడా వెనక్కి తీసుకున్నారు పురందేశ్వరి. దీనిపై నిన్నటిదాకా ప్రచారం చేసిన నాయకుని అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు.
ఏపీ బిజెపిలో మొదట్నుంచీ ఉన్న సీనియర్ నాయకులు జివిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారికి టికెట్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు పురందేశ్వరి. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానంలోనూ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఒరిజినల్ బిజెపి నేతకు ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకుని..ఆ సీటును చంద్రబాబు నాయుడి పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టారు. అనపర్తి నియోజక వర్గంలో టిడిపి సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణ కు టికెట్ ఇవ్వకుండా ఆ సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు చంద్రబాబు.
దీనిపై నల్లమిల్లి వర్గం నిప్పులు చెరిగింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేయాల్సిందే అని నల్లమిల్లిని ఆయన అనుచరులు పట్టుబట్టారు. తమకి కేటాయించిన ఈ సీటులో బిజెపి నాయకత్వం మాజీ సైనికుడు బిజెపికి మొదట్నుంచీ విధేయుడు అయిన శివరామ కృష్ణంరాజుకు కేటాయించారు. అప్పట్నుంచీ శివరామకృష్ణం రాజు నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణ వర్గం తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు నాయుడు కంగారు పడ్డారు. నల్లమిల్లిని దూరం చేసుకోవడం ఎందుకనుకున్న చంద్రబాబు బిజెపికి కేటాయించిన అనపర్తి సీటులోనూ తమ అభ్యర్ధినే బరిలో దింపాలని అనుకున్నారు.
అంతే పురందేశ్వరితో మంతనాలు జరిపి అనపర్తి సీటులో టిడిపి నాయకుడైన నల్లమిల్లికి బిజెపి కండువా కప్పి టికెట్ కేటాయించాల్సిందిగా సూచించారు.చంద్రబాబు నాయుడి కోసమే ఏపీ బిజెపి పనిచేయాలని అనుకుంటోన్న పురందేశ్వరి మరో ఆలోచనే చేయకుండా నల్లమిల్లికి టికెట్ ఇవ్వడానికి సై అన్నారు. ప్రచారం చేసుకుంటోన్న బిజెపి నాయకుడు శివరామ కృష్ణం రాజును ఇక ప్రచారం చేయద్దని ఆదేశించారు.
రాజమండ్రి రూరల్ సీటు విషయంలోనూ ఇంతే. నిజానికి అక్కడ బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వాలి. అయితే ఆయన బిజెపి చీఫ్ గా ఉండగా నిత్యం చంద్రబాబును విమర్శించేవారు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వద్దని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఆ సీటును ముందుగా జనసేనకు కేటాయించిన చంద్రబాబు.. జనసేనకు కూడా వెన్నుపోటు పొడిచి ఆ సీటును తమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. హిందూపురం సీటు ఆశించిన^పరిపూర్ణానంద స్వామికి కూడా చివరి నిముషంలో చుక్కెదురైంది. ఆయన్ను పక్కన పెట్టి ఆ సీటును టిడిపికి వదులు కున్నారు పురందేశ్వరి. దీంతో కుత కుతలాడిపోతోన్న పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశించిన జి.వి.ఎల్.నరసింహారావుకు మొండి చెయ్యి చూపించి తమ బంధువు , తన తమ్ముడి అల్లుడు అయిన గీతం భరత్ కు కేటాయించారు పురందేశ్వరి.
రాయలసీమలో విష్ణువర్ధన రెడ్డికి కూడా ఇలానే మోసం చేశారు. సంప్రదాయ బిజెపి నేతలు ఎవరికీ టికెట్లు కేటాయించలేదు పురందేశ్వరి.పురందేశ్వరి వైఖరితో ఏపీ బిజెపి భూస్థాపితం అయ్యేలా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు మండి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ బ్రాంచి కార్యాలయంగా మారిపోయిందని.. చంద్రబాబు నాయుడే ఏపీ బిజెపికి అనధికార సిఇఓగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ బిజెపిలో పురందేశ్వరి వ్యతిరేక వర్గం అంతా పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదులు చేశారు. పురందేశ్వరి వైఖరి ఇలానే కొనసాగితే పార్టీ మునగడం ఖాయమని వారు హెచ్చరించారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…