ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను సిద్ధం చేసే లక్ష్యంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడు వారాల క్రితం ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హెలికాప్టర్ లో మరో దఫా రాష్ట్రం అంతటా సుడిగాలి పర్యటనలు చేసి కొన్ని బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా మంటు టెండల్లోనూ ఏడున్నర పదుల వయసులో మొక్కవోని దీక్షతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు టిడిపికి-వైసీపీకి కూడా చాలా కీలకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
వై.ఎస్.ఆర్. జిల్లా ఇడుపుల పాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళు లర్పించి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్ మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నిప్పులు చెరిగే ఎండల్లోనూ అన్ని ప్రాంతాల్లో జనం పెద్ద సంఖ్యలో వచ్చి నీరాజనాలు పలికారు. యాత్ర విజయవాడలో కొనసాగుతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. అది హత్యాయత్నమే అని పోలీసులు నివేదిక సమర్పించారు. అది జగన్ మోహన్ రెడ్డి తనపై తాను చేయించుకున్న ఉత్తుత్తి దాడి అని టిడిపి ,జనసేనలు విమర్శించాయి. అయితే ఈ దాడి తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జన స్పందన మరింతగా పెరగడం విశేషం.
రాయలసీమ, కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మూడింట్లోనూ జగన్ మోహన్ రెడ్డి జనం బ్రహ్మరథం పట్టారు. వైసీపీకి దీటుగా చంద్రబాబు నాయుడు అంత వయసులోనూ ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు ప్రజాగళం యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఓడించకపోతే రాష్ట్రం మరో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. జనసేన, బిజెపిలతోపొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపుల్లో వచ్చిన అసంతృప్తి..తిరుగుబాట్లను సద్దుబాటు చేయడంలో చాణక్యం ప్రదర్శించారు. మొత్తానికి ఎక్కడా గొడవలు లేకుండా చేసుకోగలిగారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఎక్కువ ప్రాబల్యం ఉన్న గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు కు అశేష జనవాహిని తరలి వచ్చి జనసునామీని సృష్టించింది. తమ నాయకుని ఎమ్మెల్యేగా చూడాలన్న అభిమానులు, ప్రజల ఆకాంక్షకు ఆ జన సంద్రం అద్దం పట్టింది. టిడిపి-జనసేన పార్టీల అంత కాకపోయినా బిజెపి ప్రచారాన్ని ఉన్నంతలో సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు పురందేశ్వరి.
ఈ ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనుగడ చాలా చాలా కష్టం అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడికీ ఆ విషయం తెలుసు. అందుకే తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నింటినీ సమయానుకూలంగా ప్రయోగిస్తున్నారాయన. అయితే వయసులోనూ రాజకీయ అనుభవంలోనూ చిన్నవాడు అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి తక్కువ తినలేదు. రాజకీయ వ్యూహాల్లో తనదైన శైలిలో ఆయన కూడా దూసుకుపోతున్నారు.
ఈ ఎన్నికల్లో అయినా తాను గెలిచి ఎంపీ అవ్వాలన్నది పురందేశ్వరి పంతం. ఎందుకంటే ఆమె చివరి సారిగా 2009 ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల్లో రాజంపేటలోనూ 2019 ఎన్నికల్లో విశాఖలోనూ ఆమె ఓడిపోయారు. అందుకే ఈ సారి టిడిపితో పొత్తు కోసం ఆమె తమ అగ్రనేతలపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగలిగారు. ఇక పవన్ కల్యాణ్ అయితే ఈ సారి అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుండి ఆయన ఓడిపోయారు. ఈ సారి పిఠాపురంలో కనీసం లక్ష మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగో సారి సిఎం అవ్వాలనుకుంటోంటే జగన్ మోహన్ రెడ్డి రెండో సారి జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు. ఏపీ ప్రజలు ఏం నిర్ణయించారన్నది జూన్ 4న తేలుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…