ఉట్టికెక్కలేరు. స్వర్గానికి ఎక్కుతామంటారు. సొంత ఇల్లు చక్కబెట్టుకోలేరు. పక్కింటికి శుద్ధులు చెబుతారు. మాకెందుకులే అని సన్నాయి నొక్కుతారు. ఐనా మాట్లాడాల్సిన అన్ని మాటలు మాట్లాడేస్తారు.తెలుగు రాజకీయ నాయకుల తీరు అలాగే ఉంటుంది. అదేమంటే మేము ముందే చెప్పాముగా మాకు సంబంధం లేదని అంటూ మాట దాటవేస్తారు. మాటల మాంత్రికుడు కేసీఆర్ అలాంటి చర్యల్లో నెంబర్ వన్ లీడర్ అని చెప్పుకోక తప్పదు. నాలుగు తిట్లు తిట్టి…తర్వాత నిన్ను కాదు అనుకో అని చెప్పే రకం ఆయన.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పై కూడా అలాంటి కామెంట్సే చేసేసి ఊరుకున్నారూ మన కేసీఆర్ సారూ….
తెలంగాణలో తన పార్టీ పరిస్థితి, తన నేతల పరిస్థితి.. నానాటికీ తీసికట్టుగా మారుతున్నా.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం గురువింద మాటలు మానడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్‌కు అత్యంత కీలకం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోయి.. అధికారం నుంచి దిగిపోయి, నాయకుల వరుస జంపింగులతో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన నేపథ్యంలో పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతూ కేసీఆర్ అందరి విమర్శల పాలవుతున్నారు. అదీ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.తనకు సంబంధం లేదంటూనే ఆయన ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై కేసీఆర్ స్పందించారు. మరోసారి జగనే అధికారంలోకి వచ్చేస్తారని చెప్పారు. అంతేకాదు.. తనకు ఉన్నగట్టి సమాచారంగా ఆయన పేర్కొన్నారు.ఇంతలోనే ఏమనుకున్నారో..ఏమో.. ఎవరు గెలిస్తే.. మాకేంటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. తమకు ఎవరితోనూ సంబంధాలు లేవన్నారు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ కానీ, నాయకులు కానీ, జోక్యం చేసుకోరని తెలిపారు. తాము తటస్థంగా వ్యవహరిస్తా మని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ యధాలాపంగా అన్నారా.. కావాలనే అన్నారా..అన్నది అర్థం చేసుకోవడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలపై రియాక్షన్ రావాలి.అందుకు బీఆర్ఎస్ వర్గాల నుంచి వివరణ కూడా రావాలి. కాకపోతే మొదటి నుంచి కేసీఆర్ జగన్ పక్షం అన్నది మాత్రం తాజా మాటలను బట్టి తేటతెల్లమవుతోంది.
కేసీఆర్ కు దూకుడు ఎక్కువ. ఆయన దురుసుగా మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తుండొచ్చు. ఆయనకంటూ ఓ ఇగో ఉంది.. చంద్రబాబు అంటే గిట్టని తనముంది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని ఆయన చెప్పలేకపోతున్నారు. సర్వేలన్నీ ఎన్డీయే వైపే చూపిస్తున్నా.. నిజం ఒప్పుకోవడానికి ఆయనకు మనసొప్పడం లేదు. పైగా జగన్ ఆయనకు మిత్రుడు. జగన్ గెలుస్తాడని చెబితే కాస్త అయినా ట్రెండ్ మారుతుందని ఆయన నమ్ముతుండొచ్చు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబుపై కసితో ఆయన రిటర్న్ గిఫ్ట్ అన్న వాదనను తెరపైకి తెచ్చారు. అప్పట్లో జగన్ గెలవడంతో కేసీఆర్ మాట నిజమైంది. జగన్ కు కేసీఆర్ ఫండింగ్ చేశారన్న ప్రచారమూ జరిగింది. కాకపోతే ఇప్పుడు సీన్ మారింది. కేసీఆర్ ఓడిపోయారు. జగన్ పరిస్థితేమిటో మే 13న పోలింగ్ లో తెలుస్తుంది.
తాను ఓటమి చెందిన నేతనని కేసీఆర్ మరిచిపోయినట్లున్నారు. ఇంకా సీఎం పదవిలో ఉన్నాను అన్న ఫీలింగుతో ఆయన మాట్లాడుతున్నారు. ఐనా మాకెందుకులే అని చెప్పే ముందే ఏపీ రాజకీయాల్ని మేము పట్టించుకోవడం లేదని ప్రకటిస్తే బావుండేది. పంచ్ డైలాగు వదిలిన తర్వాత ఎంత సవరించుకున్నా ఏం లాభం. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోతే మాత్రం అది కేసీఆర్ కు కూడా ఓటమే అవుతుంది. అది ఆయన స్వయంకృతాపరాథమే….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…