తెలంగాణలో మినీ ఇండియా లాంటి నియోజకవర్గం మల్కాజిగిరిలో పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు పార్టీలు తమ ఇజ్జత్ కా సవాల్ గా భావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టడం బీజేపీకి ప్లస్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీతో తమదే గెలుపని అనుకుంటోంది. మరి అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ?
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజిగిరి. దాదాపు 37 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు 14 లక్షల వరకు సెటిలర్లు ఉన్నారు. గెలుపోటముల్లో సెటిలర్లే కీలక పాత్ర పోషించనున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించలేదు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు సార్లు కాంగ్రెస్, కూటమిలో భాగంగా ఒక్కసారి టీడీపీ గెలిచింది. ఇక్కడ మొదటి సారి 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో రెండోసారి నాటి ఎన్డీఏ కూటమి మిత్రపక్షమైన టీడీపీ అభ్యర్థిగా నేటి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, 2019లో నాటి కాంగ్రెస్ అభ్యర్థి, నేటి సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2007లో సిద్దిపేట నుంచి విడిపోయి మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సగం హైదరాబాద్ నగరం ఇక్కడే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల ఓటర్లు మల్కాజిగిరి పరిధిలో ఉండటంతో వారు ఎక్కువగా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీని, రెండుసార్లు కాంగ్రెస్‌ను గెలిపించారు. గడిచిన మూడు ఎన్నికల్లో జాతీయ పార్టీలు, జాతీయ పార్టీల మిత్ర పక్షాలకు పట్టం కట్టిన మల్కాజిగిరి ఓటర్లు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయాలు భిన్నంగా ఉండటంతో ఓటర్ల నాడి కోసం అభ్యర్థులు తీవ్ర కృషి చేస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నికలు చావో.. రేవో అన్నట్టుగా మారాయి. ప్రస్తుతం ఈటల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమిపాలు కావడంతో ఈటల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎంపీ ఫలితం కూడా వ్యతిరేకంగా వస్తే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందనే భావనలో ఉన్న ఈటల, గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటమిని చవిచూసిన ఈటల తన రాజకీయ భవిష్యత్‌ను, సామాజిక అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఈటల అనూహ్య పరిస్థితుల్లో బీజేపీలో చేరడంతో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటోన్మెంట్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఏ మాత్రమూ పట్టు లేదు. మోదీ హవా, ఈటల వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగానే గెలవాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. బీజేపీ సైతం రెండుసార్లు బరిలో నిలవగా ఒక్కసారి కూడా గెలుపొందలేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 40 సీట్ల వరకు గెలిచింది. బీఆర్ఎస్ నాలుగోసారి, బీజేపీ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునితా మహేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇవ్వడం వెనుక వేరే రాజకీయం ఉందన్న ప్రచారం జరగడం బీఆర్ఎస్ కు ఇబ్బందికరం. మల్కాజిగిరి గెలుపును రేవంత్ తో పాటు పట్నం మహేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోరాటం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే జరుగుతోందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. మల్కాజిగిరిలో గెలిస్తే… ఓ చిన్న రాష్ట్రంలో గెలిచినట్లే. అంత పెద్ద నియోజకవర్గంలో ఓటర్లను కన్విన్స్ చేయడం అంత తేలిక కాదు. అందుకే పార్టీలకు పెను సవాల్ గా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…