ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అయిదుగురు మహిళా నాయకురాళ్లు తమ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పురుషులను ఓడించి చట్టసభల్లో అడుగు పెట్టడానికి తహ తహ లాడుతున్నారు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ప్రత్యేకించి అయిదు నియోజక వర్గాల్లో రసవత్తర పోరు ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ అయిదు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నది కూడా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఉండడం విశేషం.
ఏపీ ఎన్నికల బరిలో ఉన్న కీలక మహిళా నాయకురాళ్లలో రెండు జాతీయ పార్టీల అధ్యక్షురాళ్లు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప లోక్ సభ నియోజక వర్గం నుండి …బిజెపి ఏపీ శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుండి పోటీ చేస్తున్నారు. నారా చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తోన్న మంగళగిరి నియోజక వర్గం నుండి మురుగుడు లావణ్య, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ పై వైసీపీ అభ్యర్ధి వంగా గీత, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పై తిప్పెగౌడ దీపిక పోటీ చేస్తున్నారు.
రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచి రెండు సార్లు కేంద్ర మంత్రి పదవులు దక్కించుకుని సమర్ధవంతురాలైన లీడర్ గా పురందేశ్వరి నిరూపించుకున్నారు. కాకపోతే వరుగా రెండు ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. ఈ సారి కచ్చితంగా గెలిచి తిరిగి లోక్ సభ లో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్న పురందేశ్వరి నియోజక వర్గంలో అన్ని వర్గాలను కలుపుకు పోతున్నారు. మంచి వక్త కూడా కావడంతో తన ప్రచారంలో తానే స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ సారి గెలిచి మరోసారి కేంద్ర మంత్రి కావాలన్నది ఆమె లక్ష్యంగా ఉంది.
కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కడప లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్నారు. తన సోదరుడి పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున కడప నుండి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి పోటీ ఇస్తున్నారు షర్మిల. తన చిన్నాన్న వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య వెనుక కీలక సూత్రధారి అయిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని తప్పు బట్టిన షర్మిల హంతకులను కాపాడుకొస్తున్నారంటూ తన సోదరునిపైనా విరుచుకు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి వై.ఎస్.ఆర్. రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని షర్మిల ఆశపడుతున్నారు. దానికి తగ్గట్లే కష్టపడి ప్రచారం చేస్తున్నారు.
ఈ ఇద్దరి తర్వాత కీలక నాయకురాలు వంగా గీత. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, తర్వాత లోక్ సభ ఎంపీగా వ్యవహరించిన వంగా గీత పిఠాపురం నియోజక వర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంటింటా సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఉంది ఆమెకు. రాష్ట్ర విభజన తర్వాత అయిదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో నూ సేవాకార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అవుతూ వచ్చారు.ఈ సారి పిఠాపురం నుండి పోటీచేస్తోన్న వంగా గీత పవన్ కల్యాణ్ కు చుక్కలు చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓడిపోతారని చెప్పలేం కానీ..ఆయన విజయం సాధించాలంటే మాత్రం చెమటలు కక్కాల్సిందే. అంత గట్టి పోటీ ఖాయం. ఆమె గెలిచినా గెలుస్తారని రాజకీయ పండితులు అంటున్నారు. అదే జరిగితే పవన్ కు మరో పరాభవం తప్పకపోవచ్చు.
హిందూపురం నియోజక వర్గం టిడిపికి మొదట్నుంచీ కంచుకోట. ఈ సారి కూడా నందమూరి బాలకృష్ణకి విజయావకాశాలు బాగానే ఉన్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బాలయ్య కష్టపడక తప్పదంటున్నారు రాజకీయ పండితులు. బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపికకు బడుగు వర్గాల మద్దతు ఉంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న హిందూపురంలో టిడిపికి ఆ వర్గం కొమ్ముకాసినంత మాత్రాన విజయం సాధ్యం కాదు. మిగతా వర్గాల ఓట్లూ కీలకమే. ఇక్కడే బాలయ్యకు దీటుగా నిలబడ్డారు దీపిక. ఇక మంగళగిరిలో నారా లోకేష్ చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య నుండి చాలా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అందుకే లోకేష్ మంగళగిరికే పరిమితమై ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఈ అయిదుగురు అమ్మలు గెలిస్తే మహిళా ప్రభంజనం వీచినట్లే అంటున్నారు పరిశీలకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…