పులివెందుల వేదికగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్, టిడిపిలపైనా ఆ పార్టీల పైనా తన ఇద్దరు చెల్లెమ్మలపైనా నిప్పులు చెరిగారు. దివంగత వై.ఎస్.ఆర్. రాజకీయ వారసులమని చెప్పుకుంటూ వస్తోన్న కొందరు వై.ఎస్.ఆర్. పై కుట్రలు కుతంత్రాలు చేసి అవమానించిన శత్రువులతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. వై.ఎస్. వివేకా హత్య ఘటనపైనా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి డైరెక్షన్ లో తన చెల్లెళ్లు విష ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. కడప లోక్ సభ అభ్యర్ధిగా తాను టికెట్ ఇచ్చిన అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి దిగజారుడు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు జగన్ మోహన్ రెడ్డి.
22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన జగన్ మోహన్ రెడ్డి యాత్ర ముగించిన తర్వాత సొంత నియోజక వర్గం పులివెందుల వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దానికి ముందు సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్, టిడిపిల కుట్ర రాజకీయాలను ఎండగట్టారు. వారి ట్రాప్ లో పడి తన చెల్లెళ్లు కూడా క్షుద్ర రాజకీయాలుచేస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి జీవించి ఉన్నంత కాలం ఆయనపై కుట్రలు చేసిన శత్రువులతో ఎలా చేతులు కలుపుతారంటూ మండి పడ్డారు.
తన సోదరి షర్మిల.. వై.ఎస్.వివేకానంద రెడ్డి తనయ సునీతల పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండా కాంగ్రెస్ టిడిపిల కుట్ర రాజకీయాల్లో చెల్లెమ్మలు కూడా భాగస్వాములు కావడం దారుణం కాదా అని ప్రశ్నించారు. కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సోదరి షర్మిల..ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తోన్న సునీత ఇద్దరూ కూడా తాము వై.ఎస్.ఆర్. వారసులమని ప్రచారంలో చెప్పుకోవడాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. నా తండ్రిపై కుట్రలు చేసి ఆయన పేరును ఆయన మరణానంతరం ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చిన కాంగ్రెస్.. జీవితాంతం తన తండ్రిపై కుట్రలు కుతంత్రాలు పన్నుతూ వచ్చిన చంద్రబాబు నాయుళ్లతో చేతులు కలిపిన వారు వై.ఎస్.ఆర్. వారసులా? అని నిలదీశారు.
వై.ఎస్.ఆర్. ను జీవితాంతం దెబ్బతీయాలని చూసిన టిడిపి..వై.ఎస్.ఆర్. మరణానంతరం ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా వై.ఎస్.కుటుంబాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీలో చేరి.. చంద్రబాబు నాయుడి ఇంటికి పసుపు చీర కట్టుకుని వెళ్లి ఆయన దగ్గర మోకరిల్లిన వారు వై.ఎస్.ఆర్. కు వారసులు అవుతారా? అని నిలదీశారు. దేవుడు తనను ముఖ్యమంత్రిని చేసింది కోట్లు సంపాదించడానికి కాదు..నా బంధు మిత్రులను కోటీశ్వరులను చేయడానికీ కాదు…ప్రజలకు మంచి చేయమనే నన్ను సిఎంని చేశాడు అని సెటైర్ వేశారు. సిఎం అయ్యాక తమని పక్కన పెట్టేశారంటూ కొందరు బంధువులు చేస్తోన్న వాదనలకు ఇదే నా సమాధానం అన్నారు.
తన చిన్నాన్న వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య ఘటనపైనా మాట్లాడారు. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డే అని వివేకా తనయ సునీతతో పాటు షర్మిల కూడా ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. వై.ఎస్.ఆర్. జిల్లా కోర్టు వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడ వద్దని ఆదేశించే వరకు ఆ ఇద్దరూ జగన్ మోహన్ రెడ్డిపైనా తీవ్రమైన విమర్శలు చేశారు. వాటికి జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివేకాను ఎవరు చంపారు? వారి వెనుక ఉన్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి? అన్నవి ప్రతీ ఒక్కరికీ తెలుసునన్నారు. వివేకాకు రెండో పెళ్లి జరిగిన సంగతి రెండో భార్యకు పిల్లలు ఉన్న సంగతి కూడా తెలుసునన్నారు. వివేకాను నేనే హత్య చేసానని చెప్పిన వ్యక్తికి సహకరిస్తూ టిడిపి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారంటూ సునీత , షర్మిలపై నిప్పులు చెరిగారు జగన్ మోహన్ రెడ్డి.
నేను చేసే మంచిని వారు చేయలేరు. సంక్షేమంలో వారు నన్ను కొట్టలేరు. పరిపాలనలోనూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలోనూ నన్ను కొట్టలేరు. పేదల తలరాతను మార్చడంలో నా విధానాలను వారు కొట్టలేరు. రాజకీయంగా నన్ను కొట్టలేరు. అందుకే రక రకాల కుట్రలతో ముందుకు వస్తున్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ప్రత్యక్షంగా బిజెపితో పరోక్షంగా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నా లాభం లేకపోవడంతో తన చెల్లెళ్లను కూడా వారి కుట్రల్లో భాగస్వాములను చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఇలా కుట్రలతో నన్ను నా పేదల సంక్షేమాన్ని కొట్టాలనుకుంటోన్న వారికి మే 13న ఓటుతోనే గుణపాఠం చెప్పాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…