తమ్ముడి కోసం అన్నయ్య వస్తాడా?

By KTV Telugu On 28 April, 2024
image

KTV TELUGU :-

పిఠాపురం నియోజక వర్గం నుండి పోటీ చేస్తోన్న పవన్ కల్యాణ్ కు గడ్డు పరిస్థితులు ఉన్నాయా? టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డ  వర్మ జనసేనానికి సహకరిస్తానని చెప్పినా.. ఆయన త్వరలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వర్మ హ్యాండిస్తే పిఠాపురంలో  పవన్ కల్యాణ్ కు ఎదురీత తప్పదని జనసైనికుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ విషయంపై మెగా కుటుంబంలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి చెందిన పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లోనూ ఓటమి చెందితే తీవ్ర క్షోభకు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తోన్నకొణిదెల కుటుంబ సభ్యులు చిరంజీవిని ప్రచారం చేయాల్సిందిగా సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రానున్న ఎన్నికలను  అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా భావిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని ఆయన పంతంగా ఉన్నారు. అందుకోసమే తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఏరి కోరి ఎంచుకున్నారు. పిఠాపురం సీటును ఆశించిన టిడిపి నేత వర్మను కాదని ఈ  సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు. దాంతో వర్మ వర్గం భగ్గుమంది. అయితే చంద్రబాబు పిలిపించి మాట్లాడ్డంతో పవన్ కు సహకరించడానికి వర్మ అంగీకరించారు. అయితే ఆయన ప్రచారంలో యాక్టివ్ గా ఉండడం లేదంటున్నారు.

వర్మను తమ పార్టీలో చేర్చుకోడానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే కాబట్టి ఏదో ఒక కీలక పదవి ఇస్తామని వర్మకు ఆఫర్ పెట్టారట. పోలింగ్ తేదీ లోపునే ఆయన పాలక పక్షంలో చేరిపోతారని అంటున్నారు. ఈ లోపు నామమాత్రంగానే ఆయన పవన్ తరపున ప్రచారం చేసినట్లు నటిస్తారే తప్ప క్రియాశీలకంగా ఉండరని వదంతులు షికారు చేస్తున్నాయి. మరో పక్క  పాలక పక్ష అభ్యర్ధి వంగా గీత నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహిళ కావడం..పవన్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో  పాటు సామాజిక సేవాకార్యక్రమాలతో ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు.

వర్మ వ్యవహారంపై అనుమానాలు రావడంతోనే జనసైనికులు అప్రమత్తం అవుతున్నారట. పవన్ కల్యాణ్ కూడా  తన అన్న చిరంజీవిని కలిసి తన గెలుపు కోసం ప్రచారం చేయాలని కోరారట. పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చిరంజీవి.

రాజకీయాలపై ఆయన ఏ వేదికమీదా మాట్లాడ్డం లేదు. అయితే నిన్న కాక మొన్ననే కూటమి ఏర్పాటును స్వాగతించారు. కూటమి అభ్యర్ధులు సిఎం రమేష్‌, పంచకర్లను ఆశీర్వదించండి అంటూ కోరారు . తర్వాతి దశలో పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలున్నాయంటున్నారు పవన్  కల్యాణ్.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు  పవన్ కల్యాణ్  అందులో యాక్టివ్ గా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అయితే పవన్ కల్యాణ్‌ 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు చిరంజీవి తమ్ముడి పార్టీ తరపున ఏ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. దీనిపైనే మెగా కుటుంబంలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్ ను ఈ సారి కూడా ఓడించడానికి వైసీపీ ప్రణాళికలు అమలు చేస్తోంటే..కుటుంబ సభ్యులంతా పవన్ కు అండగా ఉండకపోతే ఎలాగ అన్న వాదన వచ్చిందట. చివరకు చిరంజీవి కూడా  ఈ సారి తమ్ముడి విజయం కోసం ప్రచారం చేయడానికి  సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు ఫిల్మ్ నగర్ కోళ్లు  కూస్తున్నాయి.

అయితే మొత్తం జనసేన అభ్యర్ధులందరి తరపున చిరంజీవి ప్రచారం చేయరని అంటున్నారు. కేవలం పిఠాపురం నియోజక వర్గంలోనే తన తమ్ముడి గెలుపు కోసమే ఆయన  కృషి చేస్తారని తెలుస్తోంది. చిరంజీవి ప్రచారం చేస్తే దాని ప్రభావం బలంగా ఉంటుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం చిరంజీవి ప్రచారం చేసినా తమకు నష్టం ఏమీ ఉండదంటున్నారు. చిరంజీవి ఫాంలో ఉన్నప్పుడే 2009 ఎన్నికల్లో గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఓడిపోయారు. ఇపుడు 15ఏళ్ల తర్వాత ఆయన తమ్ముణ్ని ఎలా గెలిపించగలరని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చిరు ఫ్యాక్టర్ తో జనసేనలో ఉత్సాహం అయితే ఉరకలు వేస్తుందంటున్నారు. బహుశా మే 5న చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేయచ్చంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి