వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లిలో పార్టీ నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను అమలు చేశామని అన్నారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంతటి పవిత్రమైనదన్నది తన భావన అన్నారు. ఆచరణ సాధ్యం కాదు కాబట్టే 2014 ఎన్నికల్లో శ్రేయోభిలాషులు ఒత్తిడి చేసినా రైతు రుణమాఫీ హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. మనం చెప్పింది చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందన్నారు.
రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం పూర్తిచేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రచార పర్వంలో దూకుడు మీద ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కావడంతో శ్రేణుల్లో జోష్ ఉంది. మూడో విడత ప్రచారానికి ఒక రోజు ముందు జగన్ మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. గత అయిదేళ్లుగా అమలు చేస్తోన్న నవరత్న పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి మేనిఫెస్టోకి గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ మనదే అన్నారు జగన్ మోహన్ రెడ్డి.
సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను రెండడుగులు ముందుకు వేస్తానని జగన్ అంటూ ఉంటారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ తన తండ్రిలానే వ్యవహరించారు. దివంగత సిఎం వై.ఎస్.ఆర్. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను అమలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పని రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారు వై.ఎస్.ఆర్.2009 ఎన్నికలు వచ్చే సరికి వై.ఎస్.ఆర్. కొత్త హామీలు ఇవ్వలేదు.2004 లో తాను ఇచ్చిన హామీల్లో అద్భుతాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ , రైతులకు ఉచిత విద్యుత్ హామీలనే కొనసాగిస్తామని ఎన్నికలకు వెళ్లారు.
వై.ఎస్.ఆర్. తరహాలోనే 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను వారి సమస్యలను తెలుసుకుని దాని ఆధారంగానే మేనిఫెస్టో రూపొందించుకున్నారు. ఇపుడు అదే మేనిఫెస్టోని ఇంచుమించు రిపీట్ చేస్తున్నారు. ఒకటి రెండు అంశాలు చేర్చినా పెద్దగా మార్పు లేదు. నవరత్న పథకాలను యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. నవరత్న పథకాలే ఈ ఎన్నికల్లో తనకు తిరుగులేని విజయాన్ని అందిస్తాయన్నది జగన్ మోహన్ రెడ్డి నమ్మకం. నవరత్న పథకాల ధీమాతోనే ఆయన వైనాట్ 175 అంటున్నారు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారన్నది జూన్ 4న తెలుస్తుందంటున్నారు పరిశీలకులు.
మేనిఫెస్టో విడుదల సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వనే కూడదన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 87 వేల కోట్ల రూపాయల మేరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు , శ్రేయోభిలాషులు తన దగ్గరకు వచ్చి మనం కూడా అదే హామీ ఇస్తే మంచిదన్నారని..అయితే అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి దానికి తాను అంగీకరించలేదన్నారు. 2014లో అధికారం రాకపోవచ్చు..కానీ హామీ ఇచ్చి ఉంటే మాట తప్పి ఉండేవారం..అపుడు చరిత్రహీనులుగా మిగిలిపయే వాడిని అన్నారు.
మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మూడో విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. రోజుకి మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రెండో విడత ప్రచారంలో బస్సు యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి మూడో విడత ప్రచారానికి హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు. మే 13 న జరగనున్న ఎన్నికల్లో మే 11 సాయంత్రంతో ప్రచార పర్వం ముగుస్తుంది.జూన్ 4న ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ రోజే ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త సిఎం ఎవరో తేలేది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…