దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి వేసవి వేడిని డామినేట్ చేసేస్తోంది. దాన్ని మించి రాజకీయ పార్టీల నేతల మాటలు మరింత వేడిని పెంచుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ ఫ్రస్ట్రేషన్ లో తీవ్ర పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు. ఎవరినైనా ఎంత మాట అయినా అనేస్తున్నారు. నలుగురు నవ్విపోతారన్న జంకు కూడా లేకుండా తెగించేస్తున్నారు. విమర్శనాస్త్రాలతో పేట్రేగిపోతున్నారు. ప్రధాని స్థాయి నాయకుడు సైతం తగ్గేదే ల్యా అన్నట్లు మాటలు దూస్తోంటే రాజకీయ పరిశీలకులే నివ్వెర పోవలసి వస్తోంది.
విడతల వారీగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన చోట ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. రాహుల్ గాంధీ పై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు విమర్శలే చేస్తున్నారు. సోనియా గాంధీనీ వదలడం లేదు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సోనియా రాయ్ బరేలీ వదిలిపెట్టారంటూ మోదీ దుయ్యబట్టారు. అయితే ఇప్పటిదాకా పోలింగ్ జరిగిన నియోజక వర్గాల్లో బిజెపికి వ్యతిరేక పవనాలు ఉండడం వల్లనే మోదీ ఫ్రస్ట్రేషన్ లోకి జారుకుంటున్నారని కాంగ్రెస్ అంటోంది.
400 స్థానాలకు తగ్గనే కూడదని లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ క్యాంప్ లో ఇపుడు అంత ధీమా లేదంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో బిజెపికి చాలా చోట్ల ఎదురుగాలి తప్పదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అది ఇండియా కూటమికి కలిసొస్తుందని ఆశపడుతోంది. అయితే బొటా బొటీ మెజారిటీతో అయినా హ్యాట్రిక్ ప్రధాని కావాలనుకుంటున్న మోదీ మాత్రం కాస్త అసహనంగానే కనిపిస్తున్నారు. సర్వే ఫలితాలతోనే ఆయన కాస్త నీరుగారారా అన్నది తెలియాల్సి ఉంది.
ఏపీలో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 నినాదంతో ప్రచారంలో దూసుకుపోతోంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన , బిజెపిలతో పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు వైసీపీ నేతలు హద్దులు మీరి ఒకరిపై ఒకరు తిట్లు అందుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పట్టుకుని ఆయన చంద్రముఖి అంటూ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కల్యాణ్ పైనా తీవ్రమైన విమర్శలే చేస్తున్నారు వైసీపీ నేతలు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏమన్నా హుందాగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డిని పట్టుకుని సైకో..బచ్చా..దుర్మార్గుడు పనికిరానివాడు అంటూ చంద్రబాబు నోటికొచ్చిన తిట్లు తిడుతున్నారు. తాను కళ్లెర్ర చేస్తే జగన్ మాడి మసైపోతాడని అంటున్నారు. జగన్ పై రాళ్లు వేయండి..చేతికేది దొరికితే దాంతో కొట్టండి అని పిలుపు నిస్తున్నారు. అంతే కాదు పవన్ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ను ఉద్దేశించి గ్లాసు తీసుకోండి అది పగిలితే మరింత పదునుగా ఉంటుంది అది తీసుకుని వైసీపీ నేతలను పొడిచేయండి అంటున్నారు చంద్రబాబు. పవన్ అయితే జగన్ మోహన్ రెడ్డిని అధః పాతాళానికి తొక్కేస్తానని అంటున్నారు.
తెలంగాణాలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అధికారం కోల్పోయిన బి.ఆర్.ఎస్. అధినేత పై కాంగ్రెస్ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తోంది. ఇటు బి.ఆర్.ఎస్. నేతలు కూడా కాంగ్రెస్ కు సవాళ్లు విసురుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా హుందాగా ఉండలేకపోతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ ఎన్నికలు అందరికీ కీలకం. ఏ ఎన్నిక అయినా ఏ పార్టీకి అయినా కీలకమే. ఎన్నికల్లో జనం కరుణిస్తారా లేదా అన్న టెన్షన్ లో పడిపోవడం వల్లనే నేతలు ప్రత్యర్ధులపై ఇలా నోరుజారుతూ ఉండచ్చు తప్ప అంతకు మించి ఏమీ ఉండదని పొలిటికల్ సైకాలజిస్టులు అంటున్నారు. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరుగుతుంది అప్పటి వరకు ఈ తిట్లు వినక తప్పదు ప్రజలకు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…