సారు – కారు – 12 సీట్లు !

By KTV Telugu On 30 April, 2024
image

KTV TELUGU :-

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తే ఓడించారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పది నుంచి  పన్నెండు సీట్లు ఇవ్వండి కేసీఆర్ ఢిల్లీని దడదడలాడిస్తారని కేసఆర్ ప్రజల్ని అడుగుతున్నారు. ఎందుకు పన్నెండు సీట్లు ఇవ్వాలి అంటే ఆయన హైదరాబాద్ ను యూటీ కాకండా కాపాడుతాం.. రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డం పడతాం.. మోటార్లకు మీటర్లు పెట్టకుండా చూసుకుంటామని చెబుతున్నారు.  కానీ కేటీఆర్ పది, పన్నెండు సీట్ల కోసం ఇంత డెస్పరేట్ గా ఉన్నది  బీజేపీపై కొట్లాటకో..  లేకపోతే అసలు ప్రతిపాదనలో లేని హైదరాబాద్ యూటీని అడ్డుకోవడానికో కాదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమపై దండెత్తనున్న కేసుల దండయాత్రను అడ్డుకోవడానికే.

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా డెస్పరేట్ గా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచార సభల్లో తమకు ఎన్ని సీట్లు ఇవ్వాలో.. ఆ సీట్లతో ఏం చేస్తామో నేరుగా చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. తెలంగాణ మొత్తం  కేసీఆర్ మేనియాలో ఉంది. అలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. మిత్రుడు ఓవైసీకి ఒకటి వదిలేసి.. సారు .. కారు..  పదహారు అనే నినాదాన్ని అందుకున్నారు. చాలా మంది కేసీఆర్ స్వీప్ చేస్తారని అనుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే.. బీఆర్ఎస్ తొమ్మి లో క్ సభ సీట్ల దగ్గర ఆగిపోయింది. అంత పాజిటివ్ వాతావరణం ఉన్న  కాలంలోనే పార్లమెంట్ సీట్లు తొమ్మిది అంటే తొమ్మిద వస్తే అధికారం కోల్పోయి.. నేతలంతా వలస పోతున్న సమయంలో పది నుంచి  పన్నెండు సీట్లు వస్తాయా ?

పది నుంచి పన్నెండు సీట్లు ఇస్తే  చాలు తమ  చేతికి చక్రం వచ్చినట్లేనని కేటీఆర్ చెబుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రాదని పది సీట్ల షార్టేజ్ లో పడుతుందని.. ఆ పది సీట్లు తమవే అయితే.. ఇక చక్రం తిప్పడానికి ఢిల్లీలో  కావాల్సినంత స్పేస్ దొరికినట్లేనని అనుకుంటున్నారు.. కేటీఆర్ దోస్త్ జగన్ మోహన్ రెడ్డిది కూడా ఇదే ఆశ. కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని ప్రభుత్వం రావాలని.. తమపై ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నారు. వీరందరికి ఆదర్శం చంద్రబాబునాయుడు. ఇండియాలో సంకీర్ణ శకం నడిచిప్పుడు చంద్రబాబునాయుడు డిల్లీలో చక్రంతిప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు చేయించుకున్నారు. అయితే యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి  రాలేదు. ఏ పార్టీకి అయినా ప్రజలు పూర్తి మెజార్టీ ఇస్తున్నారు.

కానీ ప్రాంతీయ పార్టీల అధినేతల ఆశలకు హద్దు ఉండదు. గత ఎన్నికల సమయంలో మోదీ సర్కార్ కు చాలా వ్యతిరేకత ఉందని.. పూర్తి మెజార్టీ రాదని మూడో కూటమిగా చక్రం తిప్పాలని ఆశపడి. ఆవేశపడిన చంద్రబాబునాయుడు ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కానీ ఫలితాలు మాత్రం  ఆయనను నిరాశపరిచాయి. అటు కేంద్రంలో కాదు.. రాష్ట్రంలోనూ పరాజయాలు ఎదురయ్యాయి. పోయిన సీఎం పీఠం కోసం ఆయన రియలైజ్ అయి బీజేపీతోనే జట్టు కట్టి తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, జగన్ లకు మరో ఆప్షన్ లేదు. ఖచ్చితంగా  కేంద్రంలో తమపై ఆధారపడే ప్రభుత్వం  రావాలని కోరుకుంటున్నారు.

కానీ కేంద్రంలో హంగ్  వచ్చే అవకాశం ఎంత తక్కువగా ఉన్నాయో.. జగన్ , కేటీఆర్ తాము ఆశిస్తున్న  ఫలితాలు సాధించడం కూడా అంతే తక్కువగా ఉన్నాయని చెప్పుకోక తప్పదు. బీఆర్ఎస్ రెండు, మూడు సీట్లు గెలిస్తే ఆ పార్టీ భవిష్యత్ కు ఢోకా ఉండదని అంటున్నారు. కానీ అవి కూడా గెలుస్తారో లేదో తెలియదు. అందుకే కేటీఆర్ చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని..తాము అడ్డుకుంటామని అంటున్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే పేరుతో చేసే రాజకీయంపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు.  అయినా కేటీఆర్ అందుకున్నారు. జాతీయ పార్టీలు చేసే పనులను తాము ఇట్టే చేస్తామని పది నుంచి పన్నెండు సీట్లు ఇస్తే చాలని ఓటర్లను బతిమాలుకుంటున్నారు.

రాజకీయ పార్టీల నేతలకు ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అలాంటి అత్యాశతోనే కేసీఆర్ .. బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చింది. వాస్తవాల విషయంలో రియలైజ్ కాకండా కేటీఆర్ రాష్ట్రంలో పోతే పోయింది.. ఢిల్లీలో దున్ని పారేస్తామని అనుకుంటున్నారు. కేటీఆర్ కు ఇంతకు మించిన ఆప్షన్ లేదు. పార్టీ క్యాడర్ ను నమ్మించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ కోసం పని చేసుకుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సీట్లు రాకపోతే.. ఎవరూ ఆపలేరు.  కనీసం ఈ ఎన్నికల వరకైనా ఆపాలని కేటీఆర్ ప్రయత్న. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ చేతికి చక్రం ఇస్తారా లేదా అన్నది జూన్ నాలుగో తేదీన తేలుతుంది. ఆ రోజున అనుకున్న సీట్లు వస్తే బీఆర్ఎస్ సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం వచ్చినట్లే అనుకోవచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి