భారత ఎన్నికల ఓటింగ్ ప్రక్రియపై ఎండలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ పర్సంటేజీ అసాధారణంగా తగ్గుతోంది. మొదటి విడతలో నాలుగు శాతానికి పైగా తగ్గింది. రెండో విడతలోనూ తగ్గిందన్న లెక్కలు వస్తున్నాయి. ఎండా కాలంలో ఎన్నికలు సుదీర్ఘ ప్రక్రియగా నిర్వహించడం వ్యూహాత్మక తప్పిదంగా మారిందా ?. ఐదారు శాతం ఓటింగ్ పర్సంటేజీ తగ్గితే ఫలితాలు మారిపోవా ?
భారతదేశంలో ఉన్నది మెజార్టీ ప్రజాస్వామ్యం. అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతడే విజేత. అదీ కూడా పోలైన ఓట్లలో. వంద మందిలో అరవై మందే ఓట్లు వేస్తే 31 ఓట్లు వచ్చిన వ్యక్తి విజేత అవుతాడు. కానీ అతనికి ప్రజాభిమానం ఉన్నట్లేనా అంటే కాదని చెప్పుకోవాలి. వంద మందిలో కనీసం 90 మంది అయినా ఓట్లేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్య విజేత ఆవిర్భావిస్తాడు. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఓటింగ్ పర్యంటేజీ పెరగడం లేదు. ఈ సారి ఇంకా తగ్గుతోంది., ఎండల కారణంగా మొదటి రెండు విడతల్లో ఓటింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో ఏకంగా 4.4 శాతం తగ్గింది. రెండో విడతలోనూ తగ్గిందని చెబుతున్నారు.
ఎన్నికలపై ఎండల ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకూ 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ ఎన్నికల ప్రక్రియపై కచ్చితంగా ఈ ఎండల ఎఫెక్ట్ పడేలా ఉంది. ఓటింగ్ శాతంపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉన్నాయి. వేడి గాలులతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రచారంపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.
1952 నుంచి 2019 వరకూ చూస్తే ఎక్కువగా ఏప్రిల్ నుంచి మే నెలల మధ్యలోనే లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. సరిగ్గా ఎండలు తీవ్రంగా ఉండేది ఈ నెలల్లోనే. అయితే వాతావరణ మార్పుల కారణంగా 1950 నాటి పరిస్థితులకు ఇప్పటికి ఉష్ణోగ్రతుల అనూహ్యంగా పెరిగిపోయాయి. సగటున అన్ని చోట్లా ఎన్నికల సమయంలో 35 డిగ్రీలపైనే ఉంటున్నాయి ఉష్ణోగ్రతలు. అంత ఉక్కపోతలో ఓటర్లు పోలింగ్ బూత్ వరకూ రావడం ఓ సమస్య అయితే..పోలింగ్ సిబ్బంది అన్ని గంటల పాటు పని చేయడం మరో సమస్య. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈ ఎండల ధాటిని తట్టుకోవడం పెద్ద సవాలే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.4% పోలింగ్ నమోదైంది . ఈ సారి తగ్గుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధులు, దివ్యాంగులూ ఓటు వేయడం ఇబ్బందికరమే.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశముందని IMD హెచ్చరిస్తోంది. ఈ రాష్ట్రాలపై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి లెక్కలు గమనిస్తే పోటీ పడిన అభ్యర్థుల సంఖ్య మునుపటితో పోల్చి చూస్తే తగ్గిపోయింది. నా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా తాగునీళ్లు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని తేల్చి చెప్పింది. అవసరమైతే తడి టవల్స్ అందుబాటులో ఉంచి ఎవరూ డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సారి ఎండల్లో ఎన్నికలు నిర్వహించడం సవాలుగానే మారింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంతో పాటు అభ్యర్థులూ జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారులకు ఈసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎంత చేసినా ఓటింగ్ తగ్గితే మాత్రం… ఈసీ పరిష్కారాన్ని ఆలోచించాల్సిందే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…