ఆయన వెంట ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ

By KTV Telugu On 30 April, 2024
image

KTV TELUGU :-

మనిషి సంతోషంగా ఉండాలంటే వినోదం  అవసరం. ఎన్నికల వేళ రాజకీయాలు  కూడా వినోదాన్ని  పండిస్తాయి. ముఖ్యంగా దేశంలో ఎన్నికల వేళ సినిమా, టీవీ సార్లు కనిపిస్తూ ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంటారు. అందుకే సభలకు, రోడ్ షోలకు భారీగా  జనం వస్తుంటారు. ఇప్పుడు ఏపీ ఎన్డీయే కూటమిలో  రెండో అతి పెద్ద పార్టీ జనసేన కూడా గ్లామర్ని, వినోదాన్ని నమ్ముకుంది. రోజుకో స్టార్ ను రంగంలోకి దించేస్తోంది. జనం దగ్గరకు  ఆ పార్టీ చేరేందుకు అదే అవకాశం  అని పార్టీ విశ్వసిస్తోంది….

పవన్ కల్యాణ్ స్వతహాగా  నటుడు. భారీ డైలాగులు, మధ్యలో వినోదాన్ని  పంచే ఆయనకు పవర్ స్టార్ అని పేరు కూడా ఉంది.  పవన్ కల్యాణ్ ఇప్పుడు పబ్లిక్ మూడ్ ని పూర్తిగా జనసేన వైపుకు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ.. రోడ్ షోలలో ఆయన ఆవేశంతో  ఊగిపోతున్నారు. వైసీపీ అంతు చూస్తానని, సీఎం జగన్ ను ఇంటికి పంపించి  తీరుతానని హెచ్చరిస్తున్నారు.  జగన్ పట్ల ఆయన చేసే ప్రతీ కామెంటుకు జనం  పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. పవన్ ఊపు చూసి పక్కనున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్  మాట్లాడిన తర్వాత తాను ప్రసంగించడం వేస్ట్ అని ఆయన అనేశారు. అలాంటి పవన్ ఇప్పుడు ప్రచారంలో  మరింత ఊపు కనిపించే  విధంగా సినీ, టీవీ స్టార్లను రంగంలోకి దించారు. అందులో పృధ్వీ రాజ్ ఒకరని చెప్పాలి. ఆయన  ఒకప్పుడు జగన్ కు వీరవిధేయుడు. జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కామ్ గా ఉన్న పృధ్వీ ఇప్పుడు జనసేనలో చేరి క్రియాశీల నేతగా మారారు. పార్టీకి ఆయన స్టార్ క్యాంపైనర్. జగన్ పట్ల కసిగా ఉన్న పృధ్వీ ఇప్పుడు ఫుల్ టైమ్ జనసేన కోసం  కేటాయిస్తున్నారు. దేనికైనా రెఢీ అంటూ వైసీపీని కవ్విస్తున్న పృధ్వీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ ను తిడుతూ, పవన్ ను పొగుడుతూ ఆయన స్కిట్లు, షార్ట్ ఫిలింస్ తయారు చేస్తున్నారు. అందుకోసం పృధ్వీ ఒక ప్రత్యేక బృందాన్ని రెడీ చేసుకున్నరంటే జనసేన పట్ల ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు….

పవన్ కోసం జబర్దస్త్ కమేడియన్స్ రంగంలోకి దిగి కొన్ని రోజులైంది. వారు జనంలోకి వెళ్లిపోతూ జనసేనకు వీర ప్రచారం  చేస్తున్నారు. ఇప్పుడు సినీరంగ యువ  హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేశారు..

జబర్దస్త్ లో ఫేమస్ అయిన హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ మొదటి  నుంచి పవన్ కల్యాణ్ అభిమానులే. వాళ్లను పవన్ తన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో చేర్చారు. హైపర్ ఆది…ఇప్పుడు పవన్ పోటీ చేసే  పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి..పవర్ స్టార్ కోసం అక్కడే ప్రచారం చేస్తున్నారు.  ఆదికి పంచ్   డైలాగులు రాయడమన్నా,  వాటిని జనంలోకి వదలడమన్నా చాలా ఇష్టం. ఆది చెప్పే  డైలాగులు వినేందుకు జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. పవన్ ను ఆది తెగ పొగిడేస్తున్నారు. పైగా పవన్ ను ఏదో అన్నారని మంత్రి రోజాపై  కూడా  ఆది ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే నటుడు వరుణ్  తేజ్ కూడా రంగంలోకి దిగారు.  పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ప్రజలే కుటుంబ సభ్యులని వరుణ్ తేజ్ అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని గుర్తుచేశారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీ, రోడ్డు షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. దుర్గాడలో బహిరంగ సభలో మాట్లాడారు. చిరంజీవి కుటుంబానికి చెందిన పలువురు స్టార్స్ ఇప్పుడు పవన్ కోసం ప్రచారానికి రాబోతున్నారు. మరో పక్క మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా  పవన్ కోసం  ప్రచారం చేస్తున్నారు. వైసీపీలో వాతావరణం నచ్చకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని, పవన్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరానని రాయుడు చెబుతున్నారు. గుంటూరు  జిల్లాలో జనసేన తరపున ఆయన ప్రచారం చేస్తుంటే చూసేందుకు జనం భారీగానే తరలి  వస్తున్నారు….

పవన్ ఒక నటుడే కాదు.. ఆయనకు స్టార్ పవర్ కూడా ఉందని ప్రస్తుత ఎన్నికలు నిరూపిస్తున్నాయి. ఆయన గెలవాలన్న ఆకాంక్షతో ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు రంగంలోకి దిగారు. అదీ పవన్ కు అదనపు ఆకర్షణే అవుతుంది. గత ఎన్నికల్లో  పవన్ ను పొరబాటున ఓడించామని జనం చెప్పుకోవడం కూడా విశేషమే అవుతుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి