ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల మధ్య భీకర పోరు ఖాయం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధాని గానూ కర్నూలును న్యాయ రాజధానిగానూ అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. దీని ద్వారా తాను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మరో వైపు కూటమిలోని మూడు పార్టీలూ జగన్ పాలనలో రాజధాని లేని రాష్టరంగా ఏపీ మిగిలిందంటూనే అమరావతి ఒక్కటే రాజధాని అంటున్నాయి. సో రాజధానుల అంశం ఈ ఎన్నికల్లో రెఫరెండమే అనుకోవాలంటున్నారు రాజకీయ పండితులు.
2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో అభివృద్ధి వికేంద్రీకరణ తమ అజెండా అని స్పష్టం చేశారు. కానీ ఈ సారి మేనిఫెస్టోలో కుండ బద్దలు కొట్టేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి ని రాజధానిగా ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని..మూడు పంటలు పండే పొలాలను ఎండబెట్టి రాజధాని కట్టడంలో అర్ధం లేదని నివేదికలో పేర్కొంది. అయితే చంద్రబాబు ఆ నివేదికను పక్కన పెట్టారు. తన మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ అమరావతిని ఎంపిక చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని తమ పార్టీ నేతలకు ముందుగా లీక్ చేసి వారి చేత పెద్ద ఎత్తును భూములు కొనిపించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది.
చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఏళ్ల తరబడి డిజైన్లు, గ్రాఫిక్స్ తో గడిపేశారు. కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మించారు. మొత్తం మీద అయిదే వేల కోట్లు మాత్రమే అమరావతిపై ఖర్చు చేశారు చంద్రబాబు. రాజధాని నగర నిర్మాణానికి లక్షన్నర కోట్లు కావాలని చంద్రబాబే అన్నారు. ఆ లెక్కన అమరావతి నిర్మాణానికి కనీసం 50 ఏళ్లు కూడా సరిపోదన్నది వైసీపీ అధినేత వాదన. అంతే కాదు రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను మోసం చేసి ఒక్క అమరావతిపై లక్షన్నర కోట్లు ఖర్చు చేయడం నేరమే అన్నది జగన్ మోహన్ రెడ్డి వాదన. హైదరాబాద్ లో చేసిన పొరపాటును మరోసారి చేయకూడదని ఆయన అంటున్నారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ అధికారం కోల్పోయింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ మూడు రాజధానులు ఉండాలని సిఫారసు చేసింది.దాన్ని నిజం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.విశాఖను కార్యనిర్వాహక రాజధానిగాను కర్నూలును న్యాయరాజధానిగానూ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు పిటిషన్లు వేయించారు. దీనిపై సుప్రీంలో విచారణ జరుగుతోంది.
ఏడాది క్రితం నుంచే జగన్ మోహన్ రెడ్డి ప్రతీ కార్యక్రమంలోనూ త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నారు. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినపుడు కూడా ఇదే చెప్పారు. సుప్రీం కోర్టు దీనిపై నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. అయితే జగన్ మోహన్ రెడ్డి వాదన ఏంటంటే తాము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే అదొక్కటే రాజధానిగా ఉండబోదని విశాఖ, కర్నూలు కూడా ఉంటాయని అన్నారు. చంద్రబాబు , పవన్ కల్యాణ్ లు మాత్రం అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు.
చంద్రబాబు నాయుడు అమరావతి ఒక్కటే రాజధాని అనడానికి కారణం అక్కడ తమ బంధుమిత్రులు కొన్న భూముల ధరలు పెంచుకోడానికే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి విధానాల కారణంగా అమరావతి రైతులు నాశనం అయిపోతున్నారన్నది టిడిపి, జనసేనల ఆరోపణ.
ఇక ఈ ఎన్నికల్లో దీన్నే ఎన్నికల అజెండాగా మలుచుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. అందుకే శషబిషలు లేకుండా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కడితే మూడు రాజధానులకు వారు జై కొట్టినట్లే. టిడిపి కూటమిని గెలిపిస్తే అమరావతికి ఓటేసినట్లు. అది జూన్ 4న తేలిపోతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…