జేడీని పట్టించుకునే వారేరీ..?

By KTV Telugu On 1 May, 2024
image

KTV TELUGU :-

ఆయన  ఒకప్పుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా చాలా ఫేమస్. ప్రజలకు ఆయన ఒక ఆదర్శ పోలీసు ఆఫీసర్. మహారాష్ట్ర డీజీపీ కావాల్సిన  తరుణంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి బాగానే   ఓట్లు వచ్చినా  తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు తనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన గగ్గోలు పెట్టినా.. అన్ని పార్టీలు ఆయన్ను లైట్ తీసుకున్నాయి. ఆయనే జేడీ లక్ష్మీ నారాయణ …

ఆయన ఇంటి పేరు జేడీ కాదు. అసలు పేరు వీవీ లక్ష్మీ నారాయణ. సీబీఐ జాయింట్ డైరెక్టర్ అంటే జేడీగా చేసినందున ఆయనను జేడీ లక్ష్మీనారాయణ అని పిలవడం ఆనవాయితీ అయిపోయింది. వైఎస్ జగన్ కేసులను  విచారిస్తూ చివరకు ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత జేడీ ఇంకా ఫేమస్ అయిపోయారు. ఆయన అరెస్టు చేసిన వారిలో మైనింగ్ డాన్ అయిన  కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారు. కొంతకాలానికే  జేడీ మహారాష్ట్ర కేడర్ కు మారిపోవడంతో ఆయన గురించిన వార్తలు కూడా  తగ్గాయి. అయితే లక్ష్మీ  నారాయణకు రాజకీయాల్లోకి  రావాలన్న కోరిక పెరగడంతో వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత జనసేనలో చేరిన ఆయన విశాఖ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. 2019లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దాదాపు మూడు లక్షల ఓట్లు రావడం మామూలు విషయం కాదు. విశాఖలో టీడీపీ ఓటమికి జేడీ బరిలో ఉండటమే కారణమని చెబుతారు. 2020లో  ఆయన జనసేన నుంచి  బయటకు వచ్చారు. అప్పటి  నుంచి కొన్ని ఎన్జీవో కార్యక్రమాలు నిర్వహించారు….

జేడీ చాల కాలం టీవీ డిబెట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడాయన కొత్త పార్టీ పెట్టారు. ఐనా జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడాయన కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన  పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు .చోద్యం ఏమిటంటే పార్టీలేవీ ఆయన్ను  పరామర్శించిన పాపాన పోలేదు…

ఒకప్పుడు జేడీ రోల్ మాడల్. లక్ష్మీ నారాయణ సీబీఐలో ఉండబట్టే జగన్ ను అరెస్టు చేశారని అన్ని పార్టీలు తెగ పొగిడేవి. కట్ చేసి చూస్తే ఆయన రాజకీయాల్లోకి  వచ్చిన తర్వాత పట్టించుకున్న వాళ్లే లేరు. ఆయన్ను చేర్చుకున్న జనసేన కూడా 2019 తర్వాత  పెద్దగా పట్టించుకోలేదు. జనసేన  నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా పార్టీలు తనను పిలుస్తున్నాయని జేడీ చెప్పుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ఆయన  టీవీ డిబెట్లలో ఎక్కువ, రాజకీయ పార్టీల్లో తక్కువ అన్నట్లుగా అయిపోయారు. దానితో ఇప్పుడాయన  జై భారత్  నేషనల్ పార్టీ అని ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్ కు రెండు వారాల ముందు ప్రారంభించిన పార్టీకి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే తనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో తాను అరెస్టు చేసిన గాలి జనార్థన్ రెడ్డి , అతని అనుచరులు తన  హత్యకు కూట్ర పన్నుతున్నారని జేడీ ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అయితే వైసీపీ, జనసేన,టీడీపీ,బీజేపీ ఎవ్వరూ దీనిపై మాట్లాడటం లేదు. జేడీ పట్ల సానుభూతి ప్రకటించిన దాఖలాలు లేవు. ఆయనేదో తన బాధ చెప్పుకుంటున్నాడన్నట్లుగా వదిలేశారు. అసలు జేడీపై  హత్యకు కుట్ర జరిగినదీ నిజమేనా అని అనుమానిస్తున్నట్లుగా పార్టీల తీరు ఉంది. దానితో విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను ఎవరైనా పట్టించుకుంటారా లేదా అని జేడీ టెన్షన్ పడిపోతున్నట్లు చెబుతున్నారు.

లక్ష్మీ నారాయణ ఇప్పుడు  టీవీ డిబేట్లలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఆయన  రావడం లేదా..టీవీల  వాళ్లు పిలవడం లేదా అన్నది పెద్ద ప్రశ్న.ఆ సంగతి పక్కన  పెడితే ఇప్పుడు రాజకీయాల్లో జేడీ ఏం చేయబోతున్నారన్నదే పెద్ద ప్రశ్న. ఏదైనా సరే విశాఖ ఉత్తరంలో ఆయన గెలిస్తేనే అడుగు ముందుకు పడుతుంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి