ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి-జనసేన-బిజెపి కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ వాడుకుంటోన్న గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. జనసేన అభ్యర్ధులు బరిలో ఉండే నియోజక వర్గాల్లో మాత్రమే అది జనసేన సింబల్ గా ఉంటుంది. మిగతా నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులు గాజు గ్లాసు గుర్తును కోరే అవకాశం ఉంది. దీన్నే ఇపుడు టిడిపి,జనసేన తిరుగుబాటు అభ్యర్ధులు తమకి అనుకూలంగా మలుచుకోనున్నారు. గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గానే ఉంచుతారంటూ టిడిపి అనుకూల మీడియా చేసిన ప్రచారంలో పస లేదని తేలిపోయింది. ఎన్నికల సంఘం నిర్ణయం కూటమి అభ్యర్ధుల విజయావకాశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ఇపుడే చెప్పలేం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఏపీలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీలో టిడిపి బిజెపి కూటమిలో ఉన్న జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాదు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన తమకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకుంది. ఆ మేరకు జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు. అయితే జనసేన ఏపీలో అన్ని స్థానాలకూ పోటీ చేయడం లేదు. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. ఈ నియోజక వర్గాల్లో మాత్రమే జనసేన అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. జనసేన బరిలో లేని నియోజక వర్గాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తారు. ఎందుకంటే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించింది ఎన్నికల సంఘం.
ఎన్నికల పొత్తుల్లో భాగంగా తమ సీట్లు గల్లంతు అయిన టిడిపి, జనసేన తిరుగుబాటు అభ్యర్ధుల్లో కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. అలా పోటీ చేసేవారు కోరుకుంటే వారికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడానికి ఎన్నికల సంఘం సుముఖంగా ఉంది. ఇప్పటికే విజయనగరం నియోజక వర్గం టిడిపి తిరుగుబాటు అభ్యర్ధి మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ. అదే విధంగా జగ్గంపేట నియోజక వర్గంలో జనసేన రెబెల్ గా బరిలో ఉన్న సూర్య చంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఉండి నియోజక వర్గంలో టికెట్ రాక భంగ పడ్డ శివరామ రాజు కూడా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారని అంటున్నారు. అపుడు ఆయనకు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఉండిలో టిడిపి తరపున బరిలో ఉన్న రఘురామ టిడిపి రెబెల్ గా బరిలో ఉండే శివరామ రాజు లు కూటమికి పడే కొద్ది పాటి ఓట్లను పంచుకోవలసి ఉంటుంది. అంతిమంగా అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల మెజారిటీ పెరగడానికి దోహదపడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గాజు గ్లాస్ ముక్కను తీసుకుని జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకునేలా విసరాలన్నారు. ఇపుడు అదే గాజు గ్లాస్ టిడిపి-జనసేన-బిజెపి కూటమి కే గుచ్చుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సెటైర్ వేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు దక్కిన వారు గెలిచేస్తారని కాదు. కాకపోతే కూటమి ఓట్లను కొద్ది మేర చీల్చుకునే అవకాశాలు మాత్రం ఉండచ్చంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల గుర్తు ఓటర్లలో అయోమయాలు సృష్టించినపుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తెలంగాణాలో ఓ ఎన్నికలో బి.ఆర్.ఎస్. పార్టీ గుర్తు అయిన కారును పోలీన ట్రాక్టర్ గుర్తు స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించారు. చాలా చోట్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ట్రాక్టర్ గుర్తుపై ఓటు గుద్దేశారు.
దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కె.పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీకి వైఎస్.ఆర్.కాంగ్రెస్ గుర్తు అయిన ఫ్యాన్ ను పోలిన హెలికాప్టర్ గుర్తు వచ్చేలా లాబీయింగ్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. హెలికాప్టర్ పై ఉన్న ఫ్యాన్ కు కూడా రెక్కలు ఉండడంతో నిరక్షరాస్య ఓటర్లు కొంతమేర అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం వీయడంతో ఇవేవీ ఆయన అఖండ విజయానికి అడ్డు రాలేదని రాజకీయ పండితులు అంటున్నారు.
ఎన్నికల సంఘం తమ చెప్పుచేతల్లో ఉండాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపితో పొత్తు కోసం కాళ్లరిగేలా తిరిగారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇపుడు ఈసీ నిర్ణయంతో ఏపీలో కూటమికి గాజు గ్లాస్ ముక్క గుచ్చుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే అది ఏ మేరకు..ఏ స్థాయిలో నష్టాన్ని తెస్తుందనేది మాత్రం జూన్ 4నే తేలుతుందని వారంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…