టీడీపీని నిండా ముంచుతున్న బీజేపీ

By KTV Telugu On 1 May, 2024
image

KTV TELUGU :-

ఓ వైపు ముస్లిం రిజర్వేషన్ల రద్దు , మరో వైపు మోదీ చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రకటనలు ఏపీలో ఎన్డీఏ కూటమికి సమస్యగా మారాయి. ముస్లింలకు సర్ది చెప్పుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రతీ రోజు ప్రత్యేకంగా ఆ వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి ముస్లంలలో టీడీపీకి సపోర్ట్ తక్కువే కానీ… ఇప్పుడిప్పుడే ముస్లిం యువత కూటమి వైపు తిరుగుతోందనుకుంటున్న సమయంలో మోదీ, బీజేపీ ముస్లిం వ్యతిరేక భావన చూపిస్తున్నారు. ఇది దేనికి దారి తీస్తుందోనని కూటమి నేతలు కంగారు పడుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తరభారతంలో చేస్తున్న ముస్లిం బూచి రాజకీయం  దక్షిణాదిలో  భయం భయంగా చేతులు కలిపిన పార్టీలకు పెను సమస్యగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు హిందువుల ఆస్తులు పంచేస్తారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆ మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఏపీలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. బీజేపీపై భయంతో మీడియా, సోషల్ మీడియాల్లో పెద్దగా చర్చించుకోకపోయినా ముస్లిం వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్య కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని షా ప్రకటించారు. అదే ఏపీలోనూ అమలు చేస్తారేమోనన్న కంగారులో కూటమి పడింది. కానీ పురందేశ్వరి దగ్గర నుంచి అందరూ.. ముస్లి రిజర్వేషన్లు కొనసాగుతాయని అంటున్నారు.

ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరేందుకు సంశయించింది. దీనికి కారణం ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే. అయితే గతంలో విన్నింగ్ కాంబినేషన్ కావడం, ముస్లిం వర్గాలు సంప్రదాయంగా వైసీపీకే మద్దతుదారులుగా ఉండటంతో కొత్తగా పోగొట్టుకునేది ఏమీ ఉండదన్న అంచనాలకు వచ్చి పొత్తులు పెట్టుకున్నారు. ఇలా పొత్తులు పెట్టుకున్నప్పటి నుండి పవన్ తో పాటు చంద్రబాబు కూడా ముస్లింలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్లుగా పురందేశ్వరి కామెంట్స్ చేసినట్లుగా జరిగిన ప్రచారాన్ని అందరూ ఖండించారు. రిజర్వేషన్లపై భరోసా ఇచ్చారు. పురందేశ్వరి కూడా తాను అలాంటి మాటలు అనలేదని స్పష్టం చేశారు. ఈ వివాదం నుంచి తేరుకునేలోపే మోదీ మాటలు .. బాంబుల్లా వచ్చి కూటమి మీదపడ్డాయి.

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ముస్లిం వర్గాలు టీడీపీకి ఎప్పుడూ మద్దతుగా లేవు. అవి అప్పట్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్. ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్. అందులో సందేహం లేదు.కానీ ఏ వర్గంలోనూ వంద   శాతం ఒకే పార్టీ వైపు ఉండరు. ఈ లెక్కన చూస్తే.. కనీసం ముఫ్పై శాతం మంది ముస్లింలు టీడీపీకి మద్దతుగా ఉంటారని అనుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ పాలనపై ముస్లిం వర్గాల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం ఉంది.  ఏపీలో ముస్లింలు గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ వైపు మొగ్గుతున్నారని టీడీపీ వర్గాలే గతంలో అంచనా వేసుకున్నాయి.  మరీ ముఖ్యంగా యువత. ఉద్యోగాలు లేకపోవడం, షాదీ ముబారక్ వంటి పథకాలకు అడ్డగోలు నిబంధనలు పెట్టడం , తోఫాలు తీసేయడం లాంటివన్నీ వైసీపీ ప్రభుత్వం చేసింది. అందుకే వాళ్లు కోపంగా ఉన్నారు.

ముస్లిం వర్గాల్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందనుకున్న సమయంలో మోదీ చేసిన ప్రకటనలు ఒక్క సారిగా సీన్ ను మార్చేశాయి. నిజానికి వైసీపీకి ఓటు వేసే ముస్లింలలో ఎంతో మందిని  మార్చాల్సిన అవసరం లేదు. ఒక్క ఐదు శాతం మంది జగన్ పై కోపంతో కూటమికి ఓటు వేస్తే వైసీపీ జరిగే నష్టాన్ని  అంచనా వేయడం కష్టం. ఇలాంటి పరిస్థులు కలిసి వస్తున్న సమయంలో.. మోదీ ప్రకటనలు .. కూటమికి ఇబ్బందికరంగా మారాయి.  మోడీ చేసే డామేజ్ ని చంద్రబాబు తన ఇమేజ్ తో మార్చగలడా లేదా అన్నది ఇప్పుడు కీలకం. చంద్రబాబు పరిపాలనలో ముస్లింలు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలోనూ దేశ వ్యాప్తంగా ఎలాంటి రాజకీయాలు ఉన్నా. ఏపీలో మాత్రం ముస్లింలు ఎలాంటి సమస్యలు ఏర్పడలేదు. ఇదే హామీని చంద్రబాబు ఇస్తున్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ఇస్తామని అంటున్నారు. పవన్ కూడా తాను గ్యారంటీ అంటున్నారు.  కానీ సంప్రదాయకంగా వైసీపీ సపోర్టర్లు అయిన ముస్లింలు .. ఆ పార్టీ పై వ్యతిరేకత ఉన్నా…  మారడం మాత్రం కష్టమే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి