బిజెపికి నమ్మకం చాలడం లేదా?

By KTV Telugu On 2 May, 2024
image

 KTV TELUGU :-

కేంద్రంలో మరోసారి  రాబోయేది బిజెపి ప్రభుత్వమే అని నిన్నా మొన్నటి దాకా ఢంకా బజాయించి చెప్పిన బిజెపి నేతలు  ఇపుడు నెమ్మదిగా స్వరాలు మారుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు విజయం పై వారికి ఉన్న ధీమా ఇపుడు కనపడ్డం లేదు. పొరపాటున ఇండియా కూటమి గెలిస్తే..అంటూ  కమలనాథులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. హ్యాట్రిక్ ప్రధాని కావాలని ఆశపడుతోన్న నరేంద్ర మోదీకి ఆ  అదృష్టం ఉందా లేదా? అన్నది జూన్ 4న తేలుతుంది. కానీ ఈలోపే బిజెపి నేతల్లో ఏదో తెలీని ఆందోళన కొట్టొచ్చినట్లు కనపడుతోందంటున్నారు రాజకీయ పండితులు.

2014లో మొదటి సారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ 2019లో  తిరుగులేని విజయం సాధించి రెండో సారి ప్రధాని అయ్యారు. పదేళ్ల పాలన తర్వాత మూడో ఎన్నికకు సిద్దం అవుతున్నారు. ఈ సారి కూడా గెలిచి..పదేళ్లు పాలించి ఆ తర్వాతి ఎన్నికల్లోనూ గెలిచి  వరుసగా మూడో సారి ప్రధాని అయిన గాంధీ కుటుంబేతర నాయకుడిగా చరిత్ర సృష్టించాలని నరేంద్ర మోదీ పంతంగా ఉన్నారు. బిజెపి నేతలు కూడా కేంద్రంలో మూడో సారి కాషాయ ప్రభుత్వం ఏర్పాటు కావలసిందేనన్న పట్టుదలతో  ఉన్నారు.తమ టార్గెట్ ను అందుకోవడం ఏ మాత్రం కష్టం కాదని చాలా చాలా ధీమాగా ఉన్నారు. అయితే ఆ ధీమా ఇపుడు సడలుతోన్నట్లు కనిపిస్తోంది.

2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తన రాజకీయ జీవితంలోనే అత్యంత అధ్వాన్నమైన ఫలితాలను సాధించింది హస్తం పార్టీ. అయిదేళ్ల తర్వాత తిరిగి  అధికారంలోకి వస్తామని భావించింది. అయితే 2019 ఎన్నికల్లో అంతకన్నా ఘోరమైన పరాభవం తప్పలేదు. దీంతో పాటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబేతర నాయకుడైన మల్లికార్జున ఖర్గేకి అప్పగించారు. ఇపుడు 2024 ఎన్నికలకు సమాయత్తమవుతోంది కాంగ్రెస్.

ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోతే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. అందుకే భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలన్నింటితోనూ జట్టు కట్టి ఇండియా కూటమి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి ఏర్పాటు చేసిన తర్వాత  ఆ కూటమిలోని పక్షాల మధ్య విబేధాలు చికాకులు మొదలయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ  బిజెపి నేతృత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని బిజెపి ఆశలు పెట్టుకుంది.

ఈ ఎన్నికల్లో ఏకంగా 400 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంటామని  ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన చాలా ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే  ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఆయనకు కూడా అనుమానాలు పెరుగుతున్నట్లు ఉన్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఆమడ దూరంలో కూడా లేవన్న బిజెపి నేతలు ఇపుడు పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే..అనడంలోనే   ఇంత వరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో బిజెపికి ఎదురుగాలి వీచిందా ? వారు చేయించుకున్న సర్వేల్లో  ఘోరపరాభవం తప్పదని తేలిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీపైనా కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే  వారసత్వపు ఆస్తిలో 55 శాతాన్ని  దోచుకుపోతుందని మోదీ హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలోనూ మోదీ ఈ విధంగా హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం  ఇండియా కూటమి గెలిస్తే  స్టాలిన్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలు ఒకరి తర్వాత ఒకరు ప్రధాని పదవికి పోటీ పడతారని..  అధికారం కోసం వారు వెంపర్లాడతారని అంటున్నారు.  అది తర్వాతి విషయం అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అన్నది పాయింట్.  కాంగ్రెస్ నాయకులు కొంత కాలంగా హుషారుగా కనిపిస్తున్నారు. వారికి ఏమన్నా సంకేతాలు వచ్చాయా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బిజెపి అయితే ఎందుకో కానీ అధికారం రాదేమో అని భయపడుతోందన్నది నిష్ఠు సత్యం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి