తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతిస్తోంది. ఇది అంతర్గీనంగా తెలంగాణలో కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట. దీనికోసం కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీని సంప్రదించడం కూడా జరిగిపోయింది. దీనిపై చాపకింద నీరులా పనులు జరిగిపోతున్నాయి. కాకపోతే ఏపీలో బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది కదా అన్నది పెద్ద ప్రశ్న. అందుకే మౌనంగా పనులు జరిగిపోతున్నాయన్నది పాయింట్
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుజాతి మీద ఢిల్లీ వలస పెత్తనాన్ని నిరసిస్తూ అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ. కానీ కాలం మారింది. తరం మారింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల్లో ఏకంగా పొత్తు కుదుర్చుకున్నది. ఏకంగా కాంగ్రెస్ అధినేతలు రాహుల్, సోనియాలతో చంద్రబాబు నాయుడు వేదికలు పంచుకున్నారు. కేసీఆర్ దాన్ని క్యాష్ చేసుకుని, తెలంగాణను ఆగం చేసేందుకు మళ్లీ టీడీపీ వస్తోందని ప్రచారం చేశారు. దానితో ఆయన గెలిచిపోయారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో టీడీపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. 2023 శాసనసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. ఏపీలో బీజేపీతో పొత్తు ప్రస్తావన చేసుకుంటూనే పరోక్షంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మద్దతిచ్చింది. ఇప్పటికే అన్ని వేదికలపై చంద్రబాబుకు రేవంత్ సానుకూల స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ సంబంధాలపై చర్చ మొదలయ్యింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి తో కలిసి టీడీపీ కార్యాలయానికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని, అందుకే ఎన్టీఆర్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ అయిష్టంగానే పొత్తు పెట్టుకున్నదన్నది బహిరంగ రహస్యం. అందుకే ఉమ్మడి మేనిఫెస్టోపై మోదీ ఫోటో వేసేందుకు కూడా వాళ్లు అంగీకరించలేదని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తమ పక్షం వహించలేదన్న కోపం బీజేపీ ఢిల్లీ పెద్దల్లో ఉందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై కూడా వాళ్లు ఒక కన్నేసి ఉంచారన్నది నిజం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుగా జనసేన పోటీ చేసింది. టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంది. . ఇప్పుడు కూడా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు. శక్తియుక్తులన్నీ ఏపీపైనే వినియోగిస్తోంది. తెలంగాణలో పోటీ చేయాలని టీడీపీ కేడర్ భావిస్తున్నప్పటికీ అగ్రనేతలెవ్వరూ అందుకు ఇష్టపడటం లేదు. పొద్దున లేస్తే అంతా హైదరాబాద్ లో తిరుగుతున్నప్పటికీ ఎన్నికల పోటీకి మాత్రం సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీడీపీ కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ పెద్దల అనుమతి తీసుకున్న తర్వాతే వారి కార్యాలయానికి వెళ్లారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి .. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అనుచరుడు కావడంతో సహజంగానే కాంగ్రెస్ కు పరోక్ష మద్దతైనా ఉంటుందని ఎదురుచూస్తున్నారు. పైగా ఏపీలో టీడీపీ, బీజేపీ అవసరార్థం పొత్తు అని చెప్పుకుంటున్నారు. మరి తాజా పరిణామాల తర్వాత టీడీపీ కేడర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రత్యక్షంగానే కాంగ్రెస్ కు మద్దతిస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న..
ఏపీ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు అని కొందరు టీడీపీ శ్రేణులు వాదిస్తున్నారు. తెలంగాణలో నేతలు లేకపోయినా కేడర్ కాస్త బలంగానే ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కేడర్ ను ఉత్తేజ పరచగలిగితే టీడీపీ లేచి నిలబడుతుంది . ఆ సంగతి తెలిసే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…