ఎక్కడైనా అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. పోటీదారులు తమ పరువు సమస్యగా భావిస్తారు. ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఒక అభ్యర్థికి మరో నాయకుడికి మధ్య పోటీ జరుగుతోంది. అభ్యర్థిని ఓడించి తీరుతానని ఆ నాయకుడు సవాలు చేస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా తిరుగుతున్నారు. అదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. ఆ నాయకులే సుజనా చౌదరి, కేశినేని నాని…
విజయవాడలోని ఏ నియోజకవర్గమైనా ప్రధానపార్టీలకు పరువు సమస్యగానే ఉంటుంది. అక్కడ గెలిస్తే విజయోత్సాహం, అక్కడ ఓడిపోతే ఏదో తెలియని వెలితిగా వారికి అనిపిస్తుంటుంది. అలాంటి విజయవాడలోని ఒక నియోజకవర్గం విజయవాడ వెస్ట్ ఇప్పుడు పార్టీల ప్రతిష్టను సవాలు చేస్తోంది. టీడీపీ కూటమిలో భాగంగా విజయవాడ వెస్ట్ బీజేపీకి కేటాయించారు. అది కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే కమలానికి ఆ నియోజకవర్గాన్ని వదిలేశారని చెబుతారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ మాజీ సభ్యుడు వై. సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి అక్కడ పోటీ చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న వేళ సుజనా తన నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేనను కలుపుకుని పోతున్నారు. అయితే ఒక సెంటిమెంటు ఆయనకు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1983 తర్వాత టీడీపీ అక్కడ గెలిచిందే లేదు. కాంగ్రెస్, సీపీఎం ఎక్కువ సార్లు గెలిస్తే… 2009లో ప్రజారాజ్యం తరపున వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు. 2014,2019లో వైసీపీ విజయం సాధించింది. 2014లో వైసీపీ తరపున జలీల్ ఖాన్, 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. ఈ సారి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం మార్చివేసి.. షేక్ అసీఫ్ అనే కొత్త నాయకుడిని వైసీపీ పెద్దలు రంగంలోకి దించారు. అందుకే ఇద్దరు కొత్తవాళ్లలో తానే బలమైన నాయకుడినని సుజనా చౌదరి చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కమ్మ సామాజికవర్గం బలంతో తాను సునాయాసంగా నెగ్గుకురాగలనని సుజనా నమ్ముతున్నారనడంలో సందేహం లేదు. పుష్కలంగా ఆర్థిక వనరులు ఉండటం, పార్టీబలం, సామాజిక బలం ఆయనకు కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. పైగా షేక్ అసీఫ్ అంత పేరున్న బలమైన నాయకుడు కూడా కాదని గ్రహించాలి…
నిజానికి షేక్ ఆసీఫ్ అభ్యర్థే అయినా… విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన ప్రచార కార్యక్రమానికి సారధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన కేశినేని నాని… విజయవాడలో అధికారపార్టీని గెలిపించడం తన బాధ్యతగా భావిస్తున్నారు. అందులోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా భావించే సుజనా చౌదరిని ఓడిస్తేనే తన కసి తీరుతుందని కూడా నాని ఆలోచన. అందుకే నానికి, సుజనాకు మధ్య ఇప్పుడు పెద్ద వైరమే నడుస్తోంది…
జనసేన నుంచి పోతిన మహేష్ వెళ్లిపోవడం కూటమికి ఇబ్బందికర పరిణామమైతే…దాని వల్ల వైసీపీకి వచ్చే వోటు ట్రాన్స్ ఫర్ ఎంతన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.వాటన్నింటనీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేశినేని నాని వాదన. వెస్ట్ టీడీపీలో బలమైన నాయకుడిగా ఉన్న జలీల్ ఖాన్ ను ఆయన మేనేజ్ చేశారని, దానితో జలీల్ ఖాన్ రాజకీయాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ ఎక్కువ సమయం విజయవాడ వెస్టుకే కేటాయిస్తున్నారు. అందులోనూ సుజనాపై రోజు వారీ విరుచుకుపడున్నారు. అసలు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనాకు తెలుసా? అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. విమానాల్లో తిరిగే సుజనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది నిజమేనా? అని ఎత్తిపొడుస్తున్నారు. సుజనా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు… అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. విజయవాడ వెస్ట్ లో ముస్లింలు, బీసీల జనాభా ఎక్కువని, అలాంటి చోట సుజనా చౌదరికి సీటు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సుజనా ఇలాంటివేమీ పట్టించుకోకుండా ప్రచారంలో మునిగిపోయారు. తనకు కావాల్సిన వర్గాలను కలుస్తూ వారి మద్దతు కోరుతున్నారు…
విజయవాడ వెస్ట్ ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలో హాట్ టాపిక్ అయిపోయింది. కేశినేని నానిపై కారాలు మిరియాలు నూరుతున్న టీడీపీ వర్గాలు.. అక్కడి లోక్ సభతో పాటు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ గెలిచి.. ఆయనకు బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తోంది. కూటమిలోనూ మూడు పార్టీలను మేనేజ్ చేయగలిగిన సుజనా కూడా విజయంపై ధీమాగానే ఉన్నారు. రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో తాను మంత్రినవుతానని ఆయన ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…