రాజకీయాల్లో పార్టీలు చాలా ఉంటాయి. ఏ పార్టీలో ఉండే నేతుల ఆ పార్టీ వారేనని చెప్పడానికి ఉండదు. తమ రాజకీయ అవసరాల కోసం వేరే పార్టీతోనూ ఉంటారు. అలాంటి రాజకీయాలు తెర వెనుక జరుగుతూ ఉంటాయి. తెలంగాణలో ఇప్పుడు రేవంత రెడ్డి, బండి సంజయ్ ఈ తరహాలో కలసిపోయినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా.. తనకు ఎదురవుతున్న సమస్యలను బండి సంజయ్ ద్వారా రేవంత్ రెడ్డి పరిష్కరించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఎలా బయటపడిందంటే ?
కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అదేదో కరీంనగర్‌లోనే పెట్టవచ్చు. కానీ అక్కడ పెడితే స్థానిక అంశం అనుకుంటారు. తాను రాష్ట్ర స్థాయి విషయాన్ని వెలుగులోకి తెస్తున్నానని చెప్పేందుకు హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కీలక విషయాలని వెల్లడించారు. ఆ కీలక విషయం.. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్. దాన్ని ఆయన మీడియా ముందు పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు. అయితే ఆయన నిలదీసింది సీఎం రేవంత్ రెడ్డిని కాదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ ఆషామాషీ ప్రకటన చేయలేదు. బండి సంజయ్ కన్ఫెషన్ రిపోర్టును ఆయన మీడియా ముందు పెట్టారు. ఆ రిపోర్టు చూస్తే రాధాకిషన్ రావు అప్రూవర్ గా మారిపోయారని అనుకుంటారు. అంత వివరంగా కేసీఆర్ గురించి… కేసీఆర్ కోసం ఏం చేశామో చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ కేసులో తన పాత్రపైనా ఒప్పుకున్నారు. ఈ కన్ఫెషన్ రిపోర్టును బయట పెట్టిన బండి సంజయ్ … ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ట్యాపింగ్ కేసును మూలన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ ఇక్కడ రేవంత్ పై ఆయన ఆరోపణలు చేయడం లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ మంత్రి కేసీఆర్ ఫ్యామిలీని బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కరీంనగర్ నుంచి ఇప్పుడు మంత్రి ఎవరున్నారు.. బండి సంజయ్ కు ఎవరిపై ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది అంటే.. గుర్తొచ్చే పేరు పొన్నం ప్రభాకరే.
రేవంత్ కనుసన్నల్లో ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతూంటే.. కరీంనగర్ మంత్రి ఎలా వీక్ చేస్తారనేది బండి సంజయ్ కె తెలియాలి. పైగా ట్యాపింగ్ బాధితుల్లో మొదట రేవంత్ అయితే.. తర్వాత తానేనని అంటున్నారు. బండి సంజయ్ వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ను ట్యాపింగ్ కేసులో కాపాడేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన మాటల ద్వారా వెల్లడిస్తున్నారు. . ఈ క్రమంలో వారి ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగినట్లుగా అర్థమవుతుంది. ఈ విషయంలో బండి సంజయ్ కు సహకరిస్తోంది ఎవరు ?. నిస్సందేహంగా రేవంత్ రెడ్డి అనే అనుకోవాలి. రేవంత్ వైపు నుంచి కూడా సహకారం అందుతోందని కీలక డాక్యుమెంట్లు బండి సంజయ్ చేతికి వెళ్లడం ద్వారా గట్టిగానే అనుమానించవచ్చు.
బండి సంజయ్ చాలా కాలంగా రేవంత్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో నే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయన బీఆర్ఎస్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తాను తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉండగా… కుట్రలు చేసి తప్పించడానికి కేసీఆర్ కారణమని బండి సంజయ్ గట్టిగా నమ్ముతున్నట్లుగా ఉన్నారు. అందుకే కేసీఆర్ ను మళ్లీ కోలుకోకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ట్యాపింగ్ కేసు నుంచి బయటకు రాకుండా పబ్లిక్ లో పెట్టడం ద్వారా కేసీఆర్ ను తప్పించే ప్రయత్నాలన్నింటినీ చెక్ పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూసినా కేసీఆర్ ప్రాంతీయ పార్టీ నేత కాదు. జాతీయ పార్టీ లో సీఎం. ఆయన సొంత నిర్ణయాలు ముఖ్యంగా కీలక విషయాల్లో తీసుకోలేరు. అనేక ఒత్తిళ్లు వస్తాయి. వాటికి ఇలా చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎలా చూసినా ట్యాపింగ్ కేసులో ఎన్నికల తర్వాత సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో రాజకీయ వ్యూహాలే ముఖ్యం . పార్టీలు కాదు. తమకు అడ్డు రాని రాజకీయ పార్టీల నేతలతో వైరం అవసరం లేదు. ఈ విషయాన్ని రేవంత్, బండి రహస్య ఫ్రెండ్ షిప్ నిరూపిస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…