బీజేపీకి దక్షిణాదిపై ఎన్నో ఆశలున్నాయి.అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో పాతుకుపోవాలన్న కోరిక ఉంది. పొత్తులో భాగంగా ఇప్పుడు గెలవకపోతే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ఉండదని కూడా బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, నడ్డా ఓ తీర్మానానికి వచ్చినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ సీట్ల సంగతి ఎలా ఉన్నా..లోక్ సభ స్థానాలే తమకు టార్గెట్ అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ దిశగా గెలవాల్సిన నియోజకవర్గాలను సైతం గుర్తించినట్లుగా చెబుతున్నారు..
ఇష్టపడిపెట్టుకున్నారో..అయిష్టంగా పెట్టుకున్నారో.. టీడీపీతో బీజేపీ నేతలు పొత్తుపెట్టుకున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో అంటీముట్టనట్లుగా ఉన్నారన్న అపవాదులో బీజేపీకి కూటమి ఇష్టం లేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ మాట ఎలా ఉన్నా నాలుగు ఎంపీ సీట్లు గెలవాలన్న ఆకాంక్ష వారిలో కనిపిస్తోంది. వాస్తవానికి పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లను తీసుకుంది. అలాగే పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఈ ఎంపీ సీట్లలో కనీసంగా నాలుగు గెలిచి తీరాలని బీజేపీ పట్టుదలతో ఉంది అని అంటున్నారు. బీజేపీకి కేటాయించిన ఆరు ఎంపీ సీట్లు తీసుకుంటే అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. ఇందులో అరకు ఎస్టీ సీటు అయితే తిరుపతి ఎస్సీ రిజర్వుడు సీటు. ఈ ఆరింటిలో బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది రాజంపేట, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి. ఈ నాలుగింటిలో బిగ్ షాట్స్ నే బీజేపీ బరిలోకి దించింది. టీడీపీ, జనసేనకు కలుపుకుపోతూ ఆ నాలుగు చోట్ల గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలిచ్చింది…
నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు మామూలుగా లేరు. నలుగురు హేమాహేమీలేనని ఒప్పుకోక తప్పదు. ఐనా సరే ఏదో తెలియని భయం, ఏదో తెలియని అనుమానం వారిని వెంటాడుతోంది. వైసీపీ అభ్యర్థులను ఓడించడం అంత సులభం కాదన్న ఫీలింగు వస్తోంది. అందుకే వారంతా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు…
రాజంపేట నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన 2009 తరువాత ఎన్నికల బరిలోకి దిగడం ఇదే ప్రధమం. ఆయన కుటుంబానికి పీలేరులో పట్టుంది. పీలేరులో ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి..టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా దృష్టి పెట్టారంటే బీజేపీకి రాజంపేట ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో లబ్ధి కోసం కిరణ్ కుమార్ రెడ్డి తన బద్ధ శత్రువైన మాజీ సీఎం చంద్రబాబుతో కూడా చేతులు కలపాల్సి వచ్చింది. ఆవేశంగా మాట్లాడే కిరణ్ ఇప్పుడు ఎంతో సంయమనం పాటిస్తున్నారు.. రాజమండ్రి నుంచి ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆమె రెండు సార్లు ఓడిపోయి ఉన్నందున ఈ సారి పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైన ఆమెకు అధిష్టానం నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. రాజమండ్రి గతంలో ఓ సారి బీజేపీ పరం కావడంతో అక్కడ గెలవడం సులభమేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పైగా మోదీ పర్యటన కారణంగా బీజేపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుందని కూడా విశ్వసిస్తున్నారు. నర్సాపురంలో 1999,2014లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2019లో వైసీపీలో గెలిచిన రఘురామ కృష్ణరాజు.. తర్వాత జగన్ తో విభేదించి..ఎన్నికల ముందు బీజేపీలో చేరబోయి…టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ పాతికేళ్లుగా బీజేపీలో ఉన్నారు. స్థానికంగా బాగా బలమున్న నాయకుడు. ఆయన విజయానికి ఢోకా లేదని స్థానిక నేతలు చెబుతున్నారు…ఇక నాలుగోది అనకాపల్లి స్థానం. టీడీపీ నుంచి వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు, పారిశ్రామికవేత్త సీఎం రమేష్ అక్కడ నుంచి బరిలోకి దిగారు. ఆయన అమిత్ షా, నడ్డాకు అత్యంత సన్నిహితుడని చెబుతారు. ఎంతైన ఖర్చుపెట్టగల సీఎం రమేష్..ఇప్పుడు అనకాపల్లిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఉద్దేశంతో తన నియోజకవర్గంలో మోదీ టూర్ కూడా ఏర్పాటు చేశారు.
బీజేపీలో మరో మాట కూడా వినిపిస్తోంది. ఏపీలో నలుగురు గెలిచినా అధిష్టానానికి తలనొప్పేనని చెబుతున్నారు. నలుగురు కేంద్ర మంత్రి పదవులు ఆశిస్తున్నారని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. పైగా నలుగురు రాజకీయంగా, ఆర్థికంగా, పలుకుబడి పరంగా హేమాహేమీలు కావడంతో అధిష్టానం తిరస్కరించడం కూడా కష్టమే. మరి ఎన్నికల్లో, ఎన్నికల తర్వాత ఏమవుతుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…