కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల కోసం ఓ ప్రత్యేకమైన మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ తన సెంటిమెంట్ రాజకీయాల్లో ఏడు మండలాల గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటుంది. కానీ ఐదు గ్రామాలేమిటి ?. ఏడు మండలాల గురించి చెబితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది కదా ?. మేనిఫెస్టోలో పెట్టేంత పెద్ద సమస్యనా ఈ ఐదు గ్రామాలది ?
తెలంగాణ రామయ్య క్షేత్రం భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం. ఇవి తెలంగాణ గ్రామాలు కావు. ఏపీవి. కానీ చుట్టూ తెలంగాణనే ఉంటుంది.
2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ పార్లమెంట్ చట్టం చేసింది. ఏడు మండలాల్లో ఒక్క భద్రాచలాన్ని మాత్రం తెలంగాణకు ఇచ్చారు. చట్టం చేసినప్పుడు భద్రాచలం పట్టణ ప్రాంతం అని చెప్పారు. అక్కడే అసలు సమస్య ప్రారంభమయింది. ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగం. గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుంది. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ ఏపీ గ్రామాలు కావడం వల్ల సాధ్యం కావడం లేదు.
కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు… అటు తెలంగాణ, ఇటు తెలంగాణ మధ్య ఆంధ్రాలో ఉన్నాయ్. భద్రాచలం నుంచి చర్ల జాతీయ రహదారి వైపునకు.. పర్ణశాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా… ఏపీ పరిధిలోని ఈ మూడు పంచాయతీలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి…. తెలంగాణ నుంచి ఏపీలో విడదీసిన ఏడు మండలాల పరిధిలోనే ఉంది. ఈ ఐదు గ్రామాలు ముంపు గ్రామాలు కావు. అందుకే ఇచ్చేయమని తెలంగాణ కోరుతోంది. ఈ ఐదు గ్రామాల ప్రజలు సాంకేతికంగా ఏపీలో ఉన్నాయి కానీ వీరి అవసరాలన్నీ తెలంగాణ ప్రభుత్వమే తీరుస్తోంది. ఐదు గ్రామాల విద్య, వైద్యం, ఉపాధి పరంగా జిల్లా కేంద్రానికి దూరమయ్యాయి. నేటికీ ఈ ఐదు గ్రామాల్లోని విద్యార్థులు పదవ తరగతి చదువుకోవాలంటే సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం కావాలంటే మళ్లీ భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రే సేవలు అందిస్తోంది.
అందుకే ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి ఉంది. వీటిని వెనక్కి తీసుకొస్తేనే భద్రాచలం సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వాదన రాజకీయ పక్షాల్లో ఉంది. అయితే ఇది సంక్లిష్టమైన డిమాండ్. ఏపీలో కలిసిన ఈ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణలో కలుస్తాయో లేదో తెలియదు. కానీ.. రాజకీయ పార్టీలకు మాత్రం ఎన్నికల అస్త్రంగా.. అధికారంలో ఉన్న పార్టీలను ఇరుకున పెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ గ్రామాలను ఏపీ ప్రభుత్వం తమ పరిధిలో ఉందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడి ప్రజలు అటు తెలంగాణకు ఇటు ఏపీకి కాకుండా పోతున్నారు. దీంతో అక్కడి గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే భూమి అనేది గజం వదులుకోవడానికి కూడా ప్రభుత్వాలు అంగీకరించవు. అది సెంటిమెంట్ పరమైన అంశం. అందుకే ఇది రాజకీయ అంశంగానే ఉంది. ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా.. ఐదు గ్రామాల అంశం మాత్రం పార్టీలకు ప్రచార వస్తువుగా మారిపోయాయి. ఏపీ, తెలంగాణ చర్చించి.. ఒక అవగాహనకు వస్తేగానీ.. కేంద్రం చర్యలు తీసుకోలేదు. కానీ రాజకీయంగా ఈ ఐదు ఊళ్ల రాజకీయం.. మేనిఫెస్టోలకు ఎక్కేసింది. ఇంకా పెరిగి రాజకీయ దుమారంగా మారే అవకాశాన్ని కాంగ్రెస్ రాజేసిందని అనుకోవచ్చు. రాజకీయాలకు సెంటిమెంట్ కావాలి. ఇలా సరిహద్దుల సమస్యలు.. విలీనాల వ్యవహారాలు అయితే .. తెగని సెంటిమెంట్ ఉంటుంది. కాంగ్రెస్ కూడా దాన్ని అంది పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…