ఊరికే వస్తే ఏసేసుకుందామన్నదీ మానవ నైజం. అందులోనూ గాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి కార్యకలాపాలతో సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. అందుకే సంక్రాంతి కోడిపందేలు, ఎన్నికల టైమ్ లో బెట్టింగులు మంచి బిజినెస్ అవుతాయి… 2019 ఏపీ ఎన్నికల్లో బెట్టింగుతో వేల కోట్లు చేతులు మారాయని చెబుతారు. ఈ సారి కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది.
రష్యాలో వర్షం కురిస్తే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పట్టుకుని తిరుగుతారని పూర్వకాలం జోకులు ఉండేవి.ఇప్పుడు ఎన్నికల్లో అదే జరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కాక మొదలైన వెంటనే తెలంగాణలో బెట్టింగు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ ఎన్నికలపై బెట్టింగులు మొదలు పెడుతున్నారు. ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ఒకటైతే. నియోజకవర్గాల వారీగా బెట్టింగు జరుగుతుందన్న మరో అంశం. నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు పెరుగుతుంటే…బెట్టింగు రాయుళ్ల దందా మరింతగా ఊపందుకుంటోంది. చంద్రబాబు, జగన్, పవన్ ఇతర నేతల విజయావకాశాలు మెజార్టీపై బెట్టింగులు వేస్తున్నారు. ఇక నారా లోకేష్ పై బెట్టింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
ఎన్నికల పందెం రేంజ్ వేరుగా ఉంటుందని చెబుతున్నారు. ఒకటికి రెండు, ఒకటికి మూడు, ఒకటికి ఐదు అన్నట్లుగా సాగుతోందీ ప్రస్తుత బెట్టింగ్ ట్రెండ్. పైగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని, జగన్ కూ పులివెందులలో ఇంత మెజార్టీ వస్తుందని బెట్టింగ్ కట్టే వారికి ఎక్కువ స్టేక్స్ ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి…
హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రంగా బెట్టింగ్ భారీగా జరుగుతోంది. పైగా ఆ రెండు ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉండడం బెట్టింగుకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. టీడీపీ గెలుస్తుందని బెట్ కట్టే వారికి ఒకటికి ఒకటి ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారట. అంటే టీడీపీ మీద లక్ష రూపాయలు పందెం కాస్తే లక్ష వస్తుందంతే. అదే వైసీపీ మీద కాస్తే ఒకటికి రెండు నుంచి ఒకటికి మూడు వరకు వెళ్తోంది. అంటే లక్ష కట్టిన వారికి ఎదురు మూడు లక్షల వరకు కూడా రావచ్చు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురంలో గెలుస్తున్నారంటే ఎవరూ విశ్వసించడం లేదట. ఆయన ఫ్లాట్ ఫాం స్పీకరేగానీ గెలిచే నాయకుడు కాదన్న ఫీలింగ్ వచ్చేసిందట. అందుకే పవన్ కల్యాణ్ గెలుస్తారని పందెం కట్టే వారికి ఒకటికి ఐదు ఇచ్చేందుకు కూడా బెట్టింగు రాయుళ్లు రెడీ అవుతున్నారు. అంటే లక్ష కట్టిన తర్వాత జనసేనాని పిఠాపురంలో గెలిస్తే ఐదు లక్షల వరకు వస్తాయన్నమాట.కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఆయన గెలుపుపై జోరుగా పందేలు కడుతున్నారు. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు.. తిరుపతిలోనూ పందేల జోరు సాగుతున్నాయి. వైనాట్ పులివెందుల నినాదంతో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే.. ఆయన గెలుపు కంటే కూడా.. మెజారిటీపైనే ఎక్కువగా పందేలు కడుతున్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా మెజారిటీ వస్తుందని ఒకరు.. రాదని మరొక వర్గం పందేలు కడుతోంది. మంగళగిరిలో మరోసారి పోటీ చేస్తున్న నారా లోకేష్ గెలుపుపై ఎక్కువ మంది పందెం కడితే.. ఓడిపోతారని.. అంతే స్థాయలో మరికొందరు కట్టారు. అందరికంటే ఎక్కువగా గంటా శ్రీనివాసరావు మీద పందేలు కాస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు భీమిలిలో ఈ దఫా ఓటమి ఖాయమని ఎక్కువ మంది పందెం కట్టడం విశేషం. అయితే.. అంతే సంఖ్యలో గెలుస్తారని అనేవారు కూడా ఉన్నారు.కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల చిత్తుగా ఓడిపోతారని.. తెలంగాణలో భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే టీడీపీ ఆమె పక్షం వహించి గెలిపిస్తుందనుకునే వాళ్లు మాత్రం వైఎస్సార్ బిడ్డ విజయం సాధిస్తారని పందెం కడుతున్నారు…
ఎన్నికల వేళ ప్రచారానికి సమాంతరంగా బెట్టింగు క్రీడ జరుగుతోంది. కోట్ల రూపాయలు బెట్టింగులు పెట్టే ముందు కొందరు వ్యక్తులు, సర్వే సంస్థలను సంప్రదిస్తున్నారు. బెట్టింగు పెడితే నష్టమా, కష్టమా,లాభమా అని ఆరా తీస్తున్నారు. వారిచ్చే సలహాను బట్టి కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఏదేమైనా ఈ సారి ఏపీ ఎన్నికల బెట్టింగు పది వేల కోట్లు దాటిపోతే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే పేరాశతో బెట్టింగు పెట్టి డబ్బులు పోగొట్టుకునే వాళ్లూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…