టికెట్ కోసం దరఖాస్తులు.. అధిష్ఠానానికి వేడుకోలు.. టికెట్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు. ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కనిపించే సీన్ ఇది. కానీ, ఇప్పుడు ఇదంతా గతం. ఇప్పుడు టికెట్ ఇచ్చినా మేము పోటీ చేయలేం బాబోయ్ అంటూ ఆ పార్టీ అభ్యర్థులు తిరస్కరిస్తున్నారు.. నామినేషన్‌ను సైతం ఉపసంహరించుకొని పోలింగ్‌కు ముందే చేతులెత్తేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ అందుకు తగ్గ పోరాటస్ఫూర్తి మాత్రం ఆ పార్టీ అభ్యర్థుల్లో నింపలేకపోతుంది. మనం గెలుస్తున్నామనే నమ్మకాన్ని కలిగించలేకపోతుంది. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నడూ చూడని దయనీయ స్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. మరోవైపు కాంగ్రెస్ బలహీనతలనే బీజేపీ బలంగా మార్చుకుంటుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు వల వేసి కాషాయ కండువా కప్పేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తెర లేపింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఆ పార్టీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు.
కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా..మరికొందరి నామినేషన్ల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఈస్ట్ స్థానానికి అభ్యర్థిగా రోహన్ గుప్తాను కాంగ్రెస్ ఖరారు చేయగా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన బీజేపీతో ఒప్పందంలో భాగంగానే నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
తర్వాత ఇండోర్‌లో అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీ నేతలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది.తాజాగా ఒడిశాలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. పార్టీ నిధులు ఇవ్వడం లేదని, టికెట్ వెనక్కి ఇచ్చేశారు పూరి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతీ. సొంతంగా ఖర్చు చేసే స్తోమత తనకు లేదని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టంచేశారు. పార్టీ ఫండింగ్ చేస్తే పోటీచేస్తానంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు సుచరిత మొహంతీ
ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న మాటలు ఆ పార్టీ అభ్యర్థుల్లోనే నమ్మకాన్ని కల్పించలేకపోతున్నాయి. అభ్యర్థుల్లో గెలుపుపై నమ్మకాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ తిరస్కరించే వారికి, నామినేషన్లు ఉపసంహరించుకునే వారికి, బీజేపీతో టచ్‌లో ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నదంటే కాంగ్రెస్ ఎంత దయనీయ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు.
నూటపాతికేళ్ల వయసు దాటిన కాంగ్రెస్ పార్టీకి ఇంతటి దుస్థితి వస్తుందని ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. కొన్నేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం దొమ్మీలకు కూడా సిద్ధం అయ్యేవారు నేతలు. లేదంటే కోట్లకు కోట్లు కుమ్మరించి ఢిల్లీలో చక్రాలు తిప్పి పైరవీలు చేసి టికెట్ సొంతం చేసుకుని పండగ చేసుకునేవారు. అటువంటి పార్టీలో టికెట్ ఇస్తే దాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నారంటే కలికాలం కాక మరేమిటి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది కాంగ్రెస్ నాయకత్వం స్వయం కృతాపరాథమే అంటున్నారు వారు. పార్టీలో ప్రక్షాళన అవసరమని ఎన్నికల తర్వాత ఆత్మపరిశీలన చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…