బాబు బాటలోనే కమలనాథులు

By KTV Telugu On 8 May, 2024
image

KTV TELUGU :-

యూ టర్నులు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడి నుండి మంచి ట్రెయినింగే తీసుకున్నారు బిజెపి అగ్రనేతలు మోదీ షా.  2014లో చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకుని బాబు అవినీతిని ఎండగట్టిన బిజెపి నేతలు ఇపుడు అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని  ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి, టిడిపికి ఏటీఎం మెషీన్ లా తయారైందని సాక్షాత్తూ నాటి ప్రదాని మోదీయే అన్నారు. ఇపుడు బాబు తాము కలిస్తే పోలవరం రెండేళ్లలో అయిపోతుందని అమిత్ షా యూ టర్న్ ఇచ్చుకున్నారు. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారచ్చని బిజెపి నేతలు డిసైడ్ అయిపోయి ఉంటే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదంటున్నారు రాజకీయ పండితులు.

టిడిపి-జనసేనలతో తమ జెండాను జతకట్టిన  బిజెపి ఇపుడు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువడానికి పరిమితం అయ్యింది. చంద్రబాబు  నాయుడు ఏ ఆరోపణ చేయమంటే బిజెపి అది చేసి పారేస్తోంది. ఈక్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా రక రకాల యూ టర్నులు తీసుకున్నారు. ఆయన మాటలు విన్న వారయితే షా కూడా చంద్రబాబు దగ్గరే యూ టర్నులు ఎలా తీసుకోవాలో..నాలిక ఎలా మడత పెట్టాలో నేర్చుకుని ఉంటారని  అంటున్నారు.ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అవినీతి కారణంగానే పోలవరం ఆలస్యం అవుతోందని అమిత్ సా పెద్ద అబద్దం ఆడారు. ఆయనకు షార్ట్ మెమొరీ లాస్ ఉందో..లేక ప్రజలకే ఆ సమస్య ఉంటుందిలే అని ఆయన నమ్ముతున్నారో తెలీదు కానీ..ఆయన మాత్రం అలవోకగా ప్లేటు ఫిరాయించేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎందుకు జాప్యం జరిగిందో అమిత్ షాకి తెలీదా? బిజెపికి అందులో పాత్ర లేదా? రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. చంద్రబాబు తో ఏ సీక్రెట్ డీల్ చేసుకున్నారో తెలీదు కానీ నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు చేతిలో పెట్టారు. చంద్రబాబు ఆ పనులను తీసుకెళ్లి  తనకు అనుకూల కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.. 2013 నాటి ధరల ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉండగా 2015-2016 నాటి ధరల ప్రకారం చెల్లింపులు చేసేశారు చంద్రబాబు. ఆ తర్వాత ప్రాజెక్టు ను పట్టించుకోలేదు. 2018లో ఎన్డీయే నుండి బయటకు వచ్చారు.

ఆ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తానని శపథం చేసిన బాబు కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నారు. అయిదేళ్ల తర్వాత  ఒకరినొకరు తిట్టుకున్న టిడిపి బిజెపిలు మళ్లీ జట్టు కట్టాయి. నాడు ఎందుకు విడిపోయారో చెప్పలేదు. నేడు ఎందుకు కలిశారో చెప్పలేదు. చంద్రబాబు మాత్రం అప్పుడు విడిపోడానికి రాష్ట్ర ప్రయోజనాలే కారణమన్నారు. ఇపుడు అదే బిజెపితో కలవడానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అదే అబద్దాన్ని  వినిపిస్తున్నారు. బాబు యూ టర్నులు తీసుకోవడం కొత్త కాదు..కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా  బాబు అడుగుజాడల్లోనే నడవాలా? అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

పోలవరం ప్రాజెక్టు గురించి ఇపుడు చిలుక పలుకులు పలుకుతోన్న అమిత్ షాకి నిజాలు తెలియవా అంటున్నారు   పాలకపక్షనేతలు.

తిరుమలలో ఇదే అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి చేయించిన ఘన చరిత్ర చంద్రబాబుది. నాడు బాబుపై నిప్పులు చెరిగిన బిజెపి నేతలు  నేడు  బాబు మాయలో పడి మౌనంగా ఎంజాయ్ చేస్తున్నారని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడి ట్రాప్ లో పడ్డ రాజకీయ నాయకులు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదంటున్నారు  వారు రజనీకాంత్ స్టైల్ లో.

అమిత్ షా అలా వెళ్లగానే మోదీ ఇలా ఏపీ వచ్చారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే మళ్లీ పోలవరం కడతామన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం కారణంగానే పోలవరం ఆలస్యం అయ్యిందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్. దాన్ని బిజెపి ప్రభుత్వం ఎందుకు 10 సంవత్సరాల పాటు నిర్మించలేదో మోదీ కదా సమాధానం చెప్పాల్సిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవకాశ వాద రాజకీయాల్లో టిడిపికి బిజెపి తీసిపోవడం లేదని వారు సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి