బీజేపీ నోట్లో తల పెట్టిన కేసీఆర్

By KTV Telugu On 8 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాజకీయాలను .. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ పార్టీతో బీజేపీ తలపడుతోందని అర్థమవుతోంది. అంటే ముఖాముఖి పోరు జరుగుతోందని అర్థం. మరి నిన్నామొన్నటిదాకా  తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఏం చేస్తోంది అంటే.. సైలెంట్ గా బీజేపీ గెలుపు కోసం సహకరిస్తోంది. అత్యధిక  సీట్లలో ఆ పార్టీ గెలుపు కోసం తమ వంతు సాయం చేస్తోంది. తమకు ఒకటి రెండు సీట్లు వస్తాయా లేదా అన్న బెంగ పెట్టుకోవడం లేదు.. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు తెప్పించాలన్న తాపత్రయంతో పని చేస్తోంది. ఇలా చేయడం ఎవరికి నష్టం ?.  కాంగ్రెస్ సర్కార్ ను కూల్చడానికి తర్వాత బీజేపీ సహకరిస్తుందా లేకపోతే బీఆర్ఎస్‌ను  పూర్తిగా మింగేస్తుందా ?.  ఈ లాజిక్ ను కేసీఆర్ ఎందుకు గుర్తించాలనుకోవడం లేదు ?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కీలకం. ఐదు నెలల కిందటే ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికలు చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ పది లోక్ సభ సీట్లు సాధిస్తే తిరుగు ఉండదు. మరో నాలుగున్నరేళ్లు రేవంత్ రెడ్డిని కదిలించడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఐదు నెలలకే ప్రజాదరణ కోల్పోయిందన్న భావన కల్పించగలిగితే.. కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వేరే పార్టీ సాధిస్తే రాజకీయం మారిపోతుంది.  ఇక్కడ వేరే పార్టీ అంటే..  బీఆర్ఎస్ లేదా బీజేపీ.   భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహాలను చూస్తే.. గెలుపు కోసం పని చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. ఎలా ఓడిస్తోందంటే..  బీజేపీని గెలిపించడం ద్వారా.

బీఆర్ఎస్ విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తోందని నమ్మే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. కానీ రియాలిటీ వేరు.  బీఆర్ఎస్ ఎందుకు బీజేపీని  గెలిపించేందుకు ప్రయత్నిస్తోందంటే… వీలైనంత త్వరగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి.  తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ కూడా రేసులో ఉన్నట్లయితే.. త్రిముఖ  పోరు జరిగేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక లాభం పొందుతుంది. దీని వల్ల ఏం జరుగుతుంది.. ఆ పార్టీ బలం పుంజుకుంటుంది. ఐదేళ్ల వరకూ ప్రభుత్వానికి ఢోకా ఉండదు. ఇప్పుడు బీజేపీకి మద్దతివ్వడం ద్వారా బీజేపీ పది సీట్లుపైనే సాధించేలా చేస్తే సీన్ మారిపోతుంది. బీజేపీ సాయంతో రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టవచ్చు.   ఎందుకంటే ప్రజాభిప్రాయం మారిపోయిందని.. రేవంత్ సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని ప్రచారం చేయవచ్చు.  బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటాయి కాబట్టి.  బీఆర్ఎస్ ప్లాన్ ఇదే. కానీ బీజేపీ అలా ఎక్కువ సీట్లు వస్తే ముందు ఏం చేస్తుంది ?. నిస్సందేహంగా బీఆర్ఎస్ ను అంతం చేస్తుంది.

బీజేపీకి పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు వస్తే… రేవంత్ సర్కార్ ను హడావుడిగా కూల్చేసి.. బీఆర్ఎస్ చీఫ్ కు సీఎం పదవి ఇచ్చేసి ఏలుకో అని ఆఫర్ ఇవ్వదు. అలాంటి అవసరం బీజేపీకి లేదు. ముందుగా  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది.  ఆ పార్టీని నర్వీర్యం చేస్తుంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తానే అని ప్రజలను గట్టిగా నమ్మిస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే చేసి తన ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుంటుంది. ఈ విషయాన్ని ఊహించడానికి రాజకీయంలో పాండిత్యం అవసరం లేదు. బీజేపీ రాజకీయ పయనం చూస్తే సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ తన పార్టీని కొవ్వొత్తిలా కరగదీసుకుని మరీ బీజేపీకి సాయం చేస్తున్నారు. ఆ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చేందుకు సహకరిస్తున్నారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పుడు అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్నారు. ఐదు నెలల కిందట వరకూ ఆయన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా , బీఎల్ సంతోష్‌లను సైతం అరెస్ట్ చేయించగలనని అనుకున్నారు. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయించడానికి  నేరుగా ప్రత్యేక విమానంలో పోలీసుల్ని కూడా పంపారని చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు తన కుమార్తె ను జైలు నుంచి బయటకు తెప్పించుకునేందుకు అపసోపాలు పడుతున్నారు.  పార్లమెంట్ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ ప్రభుత్వం  ఆయనను బయట ఉంచే అవకాశాలు తక్కువ. ఇతర అవినీతి కేసుల సంగతి మెల్లగా బయటకు తీస్తారు కానీ.. ట్యాపింగ్ కేసులో మాత్రం ముందుగా అరెస్టు చేయడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. జూన్ నాలుగో తేదీ తర్వాత కేసీఆర్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను కాపాడుతుందని ఆయన పులిని నమ్ముకున్నారు. పులి నోట్లో తల పెట్టిన తరహాలో రాజకీయం చేస్తున్నారు. బీజేపీ తన పార్టీని మింగేస్తుందని తెలిసినా సాహసం చేస్తున్నారు.

తనకు అంతకు మించిన మార్గం లేదని కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ ధైర్యంగా రాజకీయం చేస్తే జైలుకెళ్లినా కొంత కాలంలో బ యటకు రావొచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్న రాజీ రాజకీయాలు.. పార్టీని పణంగా పెట్టిన వ్యూహాల వల్ల కేసీఆర్ అన్నీ కోల్పోయే ప్రమాదంలో పడిపోయారు.