టార్గెట్ ఈటల..!

By KTV Telugu On 9 May, 2024
image

KTV TELUGU :-

మల్కాజ్ గిరి నియోజకవర్గం  ఇప్పుడు హాట్ టాపిక్ గా  మారింది. ఆ లోక్ సభా నియోజకవర్గం తాజా మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా  రేవంత్ బిజీగా ఉంటున్నప్పటికీ మల్కాజ్ గిరి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్,  బీజేపీ మధ్యే  పోటీ ఉందని, బీఆర్ఎస్ అసలు రేసులో లేదని  స్వయంగా ప్రకటిస్తున్న రేవంత్  రెడ్డి కమలం పార్టీపై కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు….

మల్కాజ్  గిరి వైవిధ్య భరితమైన నియోజకవర్గం. అన్ని వర్గాల ప్రజలు అక్కడుంటారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన జనం సెటిలైన  నియోజకవర్గం కూడా అదే. అక్కడ గెలిస్తే కిక్కే వేరుగా ఉంటుందని అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తారు. అలాంటి  మల్కాజ్ గిరి ప్రతీ ఎలక్షన్లోను పార్టీలకు ప్రతిష్టాత్మకమవుతుంది. 2018లో ఎమ్మెల్యేగా  ఓడిపోయిన  రేవంత్ రెడ్డి, 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కార్ గిరి నుంచి గెలిచి తన రాజకీయ జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సీఎం అయ్యారు. ఇప్పుడు అదే ఆలోచనతో బీజేపీ అభ్యర్థిగా ఈటల  రాజేందర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల .. తర్వాత బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఓడిపోయినప్పటికీ.. బీజేపీ ఆయనకు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి రేంజ్ కు ఈటల ఎదుగుతారో లేదో చెప్పలేనప్పటికీ… సీఎం  మాత్రం ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని అసలు పట్టించుకోని రేవంత్.. వంద శాతం ఈటలనే టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారు…

రెండు దశాబ్దాల  పాటు కేసీఆర్ తో అంటకాగిన  ఈటల..అప్పుడేం  చేశారన్నది పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ , ఆయన కుటుంబంపైనా  దుమ్మెత్తిపోస్తున్న రాజేందర్ కు అప్పటి  అధికార పార్టీలో ఉన్నన్ని రోజులు తప్పులు తెలియలేదా అన్నది ఒక అంశం . అదే సంగతిని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు…

మల్కాజ్ గిరి నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్ తరపున సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఆమెను ఎంపిక చేసి మల్కాజ్  గిరి బీ ఫార్మ్ ఇచ్చారు. ఇంతలోపే  బీజేపీ తరపున ఈటల పేరు ఖరారు కావడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని డిసైడయ్యారు. ఇప్పుడు ఈటలను స్పెషల్ గా టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఆయనకు దిమ్మతిరిగే ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఆ ప్రశ్నలేమిటో ఓ సారి చూద్దాం.. 2001 నుంచి 2021 వరకు కేసీఆర్.. ఈటల వేర్వేరు కాదు ఒక్కరే అన్నట్లు వ్యవహరించలేదా? – కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేల కోట్లు కేసీఆర్ దోచుకుంటే ఆ బిల్లులపై ఆర్థిక మంత్రిగా సంతకాలు పెట్టింది మీరు కాదా? – ధరణి ముసుగులో అవుటర్ చుట్టూ దొరలు భూములు ఆక్రమించుకుంటుంటే కాపలా కాసింది మీరు కాదా? – కేసీఆర్ ను కలిసేందుకు గద్దర్ వస్తే.. మండుటెండలో నిలబెట్టి పంపించారు. ఎందుకలా చేశారని కేసీఆర్ ను ప్రశ్నించారా? – బీజేపీలో చేరాక ఉప్పల్ ఫ్లైవోర్ పనులు పూర్తి కాలేదెందుకు అని నితిన్ గడ్కరీని అడిగారా? – వేల కోట్లు కేటీఆర్ దోచుకున్నారని ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారా? – జన్వాడలో ఫామ్ హౌస్.. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల గురించి మోదీకి ఎందుకు వివరించలేదు? – కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా? ముదిరాజ్ కులం బీసీ ‘డి’లో ఉంటే ఎందుకు మార్పించలేదు?..ఇలాంటి ప్రశ్నలతో ఈటల ఉక్కిరిబిక్కిరవుతున్నారు.వాటికి సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారని తెలుస్తోంది.

ఈటలను ఇరకాటంలో పెడితే కాంగ్రెస్  అభ్యర్థిని గెలిపించుకోవడం సులభమేనని రేవంత్ రెడ్డికి తెలుసు.  మల్కాజ్ గిరిలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ప్రత్యేకమైన బలం ఉంది. దాన్ని  బ్రేక్ చేస్తేనే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఈటల  పట్ల ప్రజల్లో అనుమానాలకు తావిచ్చే అంశాలనే రేవంత్  రెడ్డి ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో జూన్ 4నే తెలుస్తుంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి