ఖమ్మం – టీడీపీ కీలకం

By KTV Telugu On 11 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణ  పోటీ ఉంది. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోటీకి, ప్రచారానికి దూరంగా ఉన్నా టీడీపీకి డిమాండ్ మాత్రం తక్కువేమీ  లేదు. మద్దతు కోసం ఆ పార్టీ కార్యాలయం చుట్టూ పార్టీల నేతలు రౌండ్లు కొడుతున్నారు. తెరతీయగ రాదా, కనుచూపే కరువాయే, మనం మనం  ఖమ్మం లాంటి డైలాగులు కొడుతున్నారు.  టీడీపీని ప్రసన్నం చేసుకుంటే విజయం  ఖాయమన్న ఫీలింగు వారిలో కనిపిస్తోంది….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు చాపకింద నీరుగా కాంగ్రెస్ పక్షం వహించారు.ఇప్పుడు  లోక్ సభ ఎన్నికల్లో కూడా టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి  దించలేదు.ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దానితో ఇప్పుడు టీడీపీని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం లోక్ సభా స్థానంలో గెలవాలంటే టీడీపీ  మద్దతు ఉండాలని సంగతిని గ్రహించిన మూడు పార్టీలు ఇప్పుడు పచ్చచొక్కాలను ప్రసన్నం చేసుకునే  పనిలో బిజీగా  ఉన్నాయి .గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో కాంగ్రెస్ వెంట నడిచాయి. చంద్రబాబు, రేవంత్ ఫ్యాక్టరీ దీనికి దోహదం చేసింది. దీంతో గెలిచిన తర్వాత మంత్రులు పొంగులేటి, తుమ్మలను టీడీపీ ఆఫీసుకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి రామసహాయం రఘురామిరెడ్డి, బీఆర్ఎస్ నుండి నామా నాగేశ్వర రావు, బీజేపీ నుండి వినోద్ రావులు పోటీకి దిగారు. వీరంతా ఇప్పుడు టీడీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.గత ఎన్నికల మాదిరిగానే మళ్లీ తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు టీడీపీని కోరారు. అయితే కాంగ్రెస్ నుండి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారనుకుంటే మొండి చేయి చూపారని వారు గుర్రుగా ఉన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో ఇక్కడ తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి వినోద్ రావు తిరుగుతున్నారు.

కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఖమ్మంలో  పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అనుమానిస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలి రేణుకా చౌదరి కూడా కమ్మ సామాజికవర్గం లెక్కలు చెబుతూ కొంత టెన్షన్ పెడుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని ఖమ్మంపై ఇతర పార్టీలు గట్టిగా  దృష్టి పెట్టాయని అంటున్నారు. ముగ్గురిలో ఇద్దరు కొత్త అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది…

ఖమ్మం టికెట్ విషయంలో  కాంగ్రెస్ నేతల  మధ్య పెద్ద గొడవే జరిగింది. తన  భార్యకు టికెట్ రాలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్రుగా ఉన్న నేపథ్యంలో రేణుక మాటలు  అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. పైగా మంత్రి  తుమ్మల కుమారుడు యుగంధర్ కు టికెట్ రాకపోవడం కమ్మ సామాజిక వర్గానికి కొంత  వెలితిగా  ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా తెలివిగా తన  వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంతో ఇప్పుడు ఖమ్మంలో కమ్మ వర్సెస్ రెడ్డి స్పర్థ   కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ గెలిచేందుకు టీడీపీ మద్దతు అవసరమై..  నేతలు ఆ పార్టీ జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇక రేణుకా చౌదరి కామెంట్స్ కూడా ఇప్పుడు  కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మల్లు భట్టి విక్రమార్క భార్యకు గానీ, తుమ్మల కుమారుడికి గానీ టికెట్ ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటేశ్వర రావుకి ఇవ్వడానికి నాన్ లోకల్ ప్లాబ్లం రావడంతో పొంగులేటి వియ్యంకుడికి ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. పైగా నిజామాబాద్  టికెట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అవసరంగా ఇచ్చారని,  మండవకు ఇచ్చి ఉండాల్సిందని కూడా ఆమె అన్నారు. మరో  పక్క బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కమ్మ  సామాజికవర్గం నాయకుడు కావడంతో తనకు విజయావకాశాలున్నాయని ఆయన  భావిస్తున్నారు. అయితే రెండు పార్టీల మధ్య పేచీలో తనకు రాజకీయ లబ్ధి జరుగుతుందని బీజేపీ కేండెట్ వినోద  రావు ఎదురుచూస్తున్నారు. అందుకే ఖమ్మం  టీడీపీ కార్యాలయం దగ్గర క్యూ పెరిగింది…

తెలంగాణ ఎన్నికల విషయంలో చంద్రబాబు  నాయుడు ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చన్నది  ఒక టాక్.  అయితే చంద్రబాబుకు, సీఎం రేవంత్ అంటే అభిమానం కావడంతో కాంగ్రెస్ కు మద్దతిస్తూ పరోక్షంగా  సంకేతాలిస్తారని హస్తం పార్టీ వర్గాలు  ఎదురుచూస్తున్నాయి. పోలింగుకు ఒక రోజు ముందు ఆ పని జరిగినా చాలని కోరుకుంటున్నాయి. అయితే ఏపీలో  బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు ఎలా రూటు మార్చుతారన్నదే పెద్ద ప్రశ్న. చూడాలి మరి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి