ఏపీ కూటమిలో ముస్లిం రిజర్వేషన్ల అంశం పెద్ద తలనొప్పిగానే మారింది. టిడిపి-జనసేనతో కూటమి కట్టిన బిజెపి తాము వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటోంది. ఇది టిడిపి, జనసేనలకు ఇబ్బందికరంగా మారింది. ఇదే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ముస్లింలకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీన్నుంచి బయటపడేందుకు చంద్రబాబు కూడా దీటుగానే స్పందిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం తాము పోరాడతామంటున్నారు.
ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టిడిపి-జనసేన,బిజెపిలు జట్టు కట్టాయి. అంత వరకు బానే ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలో బిజెపి అగ్రనేతలు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తేవడంతో కూటమికి ముస్లిం ఓటర్లు దూరం అవుతారేమోనని ఆందోళనలు మొదలయ్యాయి. దీన్ని అధిగమించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు దీన్నుంచి లబ్ధి పొందేందుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో పావులు కదుపుతోంది.
గత ఎన్నికలకు ముందు ఎన్డీయే నుండి బయటకు వచ్చారు చంద్రబాబు. అయిదేళ్ల తర్వాత ఇపుడు తిరిగి అదే బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. . అయితే ఈ ఎన్నికల ప్రచారంలో బిజెపి ఒక హెచ్చరిక చేస్తోంది. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఏపీలో ముస్లింలకు ఇస్తోన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బిజెపి పదే పదే అంటోంది. తాజాగా తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా భోన్ గిర్ వచ్చిన అమిత్ షా తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామన్నారు.
బిజెపి వస్తోందంటేనే మైనారిటీలు చిగురుటాకుల్లా వణుకుతారు. ముస్లింల ప్రయోజనాలను బిజెపి దెబ్బతీస్తుందని ముస్లింలు భయపడతారు. వారు భయపడినట్లే బిజెపి పేద ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లపై వేటు వేస్తామని అంటోంది.
అటువంటి బిజెపితో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. ముస్లిం రిజర్లేషన్లు రద్దు చేస్తామన్న బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు చెప్పడం లేదని ముస్లిం మేథావులు అంటున్నారు . చంద్రబాబు నాయుడికి నిజంగానే ముస్లిం మైనారిటీలపై ప్రేమ ఉంటే.. ఎన్నికల ప్రచార వేదికపై నుంచే బిజెపి నేతల చేత ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసేది లేదని చెప్పించాలని సవాల్ విసురుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు నూరు అయినా..ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా నాలుగుశాతం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగి తీరతాయన్నారు .
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో ముస్లింలలోని నిరుపేదలకోసం దివంగత వై.ఎస్.ఆర్. ఈ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. ఆయన తనయుడిగా ఆ రిజర్వేషన్లకు తాను కట్టుబడి ఉన్నానంటున్నారు . ముస్లిం రిజర్వేషన్లను మత పరమైన రిజర్వేషన్లని బిజెపి నేతలు అనడంలో అర్ధం లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మతంలో సంపన్న వర్గాలకు ఈ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని మతాల్లోనూ బడుగు వర్గాలు ఉన్నట్లే ముస్లింలోనూ ఉన్నారని ఆయన అంటున్నారు. పేదరికం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. ముస్లిం మతంలో పఠాన్ లు సయ్యద్ లకు రిజర్వేషన్లు వర్తించవని ఆయన గుర్తు చేశారు.
ఒక్క రిజర్వేషన్ల విషయంలోనే కాదు.. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ఎటువంటి బిల్లునైనా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విషయంలో ముస్లింల కు రక్షణగా తాము నిలుస్తామని వారికి మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. తద్వారా ముస్లిం ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకోడానికి ఎన్నికల ప్రచారంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా జనాభాలో దామాషా ప్రకారం ముస్లి మైనారిటీలకు రాజకీయాల్లోనూ 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోన్న ఏకైక రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్సే అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. మొత్తానికి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏపీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే నియోజక వర్గాల్లో కూటమికి నష్టం తెచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…