డేంజర్ జోన్‌లో తెలంగాణ మంత్రులు

By KTV Telugu On 11 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ మంత్రులకు హైకమాండ్ రేస్ పెట్టింది.  బాధ్యతలు ఇచ్చిన చోట గెలిపించి తీసుకు వస్తేనే పదవి ఉంటుందని స్పష్టం చేసింది.   ఈ లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత కీలకం. గెలిచి తీరాల్సి ఉంది. అందుకే ఎలాంటి చిన్న నిర్లక్ష్యాన్ని సహించడం లేదు. తెలంగాణలో ఈ సారి పది నుంచి పధ్నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉండటంతో  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. మంత్రుల్ని ఇంచార్జులుగా నియమించారు. వారి పని తీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు డేంజర్ జోన్ లో పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారు.  కానీ మంత్రులపైనే అధిక బాధ్యత పడింది. వారు ఇంచార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో గెలిపించకపోతే పదవి ఉండదని హైకమాండ్ నుంచి నేరుగా వార్నింగ్‌లు వస్తున్నాయి.  పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చేసిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.  చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడంపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.  కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. దానం నాగేందర్ ను పార్టీలోకి రప్పించి పోటీ చేయించేలా చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అయితే హఠాత్తుగా ఆయన పట్టించుకోవడం మానేశారని హైకమాండ్ భావిస్తోంది.  నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడే పోటీ చేస్తున్నారు.  నల్లగొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తన జోక్యం లేకపోతే… గెలుపులో క్రెడిట్ రాదనుుంటున్నారేమో కానీ వేలు పెట్టేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది.  సికింద్రాబాద్ లో గెలవకపోతే సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అనుకుంటున్నారు. ఆయన సోదరుడు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం  ఎదురు చూస్తున్నారు. భువనగిరి ఎంపీని గెలిపించే  బాధ్యతను తీసుకున్నారు. అక్కడ    గెలిపించి తీసుకు వస్తా మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. అప్పుడు కోమటిరెడ్డిని తొలగించి ఆయన తమ్ముడికి ఇవ్వాల్సి ఉంటుంది.

ఎంపీ స్థానాల్లో గెలుపు  టెన్షన్ ఒక్క కోమటిరెడ్డికి మాత్రమే కాదని.. మంత్రులందరికీ ఉందని అంటున్నారు.  కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఈ సారి అన్ని చోట్లా గట్టి పోటీని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది.   నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధి మల్లు రవిని గెలిపించటంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెమటోడుస్తున్నారు.  ఇక్కడ మల్లురవికి బీజేపీ అభ్యర్ధి  పోతుగంటి భరత్ నుండి గట్టి పోటీ ఎదరవుతోంది.  పెద్దపల్లి అభ్యర్ధి గడ్డం వంశీ కృష్ణ గెలుపుకోసం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కష్టపడుతున్నారు. ఇక్కడ వంశీకి కలిసొచ్చే అంశం ఏమిటంటే తండ్రి వివేక్, బాబాయ్ వినోద్ కూడా ఎంఎల్ఏలుగా ఉన్నారు. అయినా దుద్దిళ్ల శ్రీధర్ బాబు తానే బాధ్యత తీసుకున్నారు.

కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు బాగా చెమటోడుస్తున్నారు. తాను చెప్పిన అభ్యర్థికే టిక్కెట్ ఇప్పించుకున్నారు.  కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేంద్రరావు పోటీచేస్తుంటే బీజేపీ తరపున బండిసంజయ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికి గెలుపు అవకాశాలు బండికే ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది.    బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ పోటీచేస్తున్నారు. ఆయనకూ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది.  వరంగల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి కడియం కావ్య గెలుపుకు మంత్రి కొండా సురేఖ కూడా బాగా కష్టపడుతున్నారు.  మెదక్ లో మంత్రి దామోదరరాజనర్సింహ కూడా పార్టీ అభ్యర్ధి నీలంమధు గెలుపుకు కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పది నుంచి పధ్నాలుగు స్థానాల్లో గెలవడాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో ఎన్ని  స్థానాలు మిస్సయితే తెలంగాణ ప్రభుత్వంలో అంత మంది మంత్రుల వికెట్లు పడిపోయే అవకాశం ఉంది.

అభ్యర్ధులను గెలిపించేబాధ్యతను మంత్రులకు అప్పగించి ఏఐసీసీ వదిలేయలేదు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో రివ్యు చేస్తునే ప్రత్యేక పరిశీలకల నుండి రిపోర్టులు తెప్పించుకుంటోందని చెబుతున్నారు.   వెనకబడిన అభ్యర్ధులు ఎవరు, ఎలా స్పీడందుకోవాలి, గెలుపును ఎలా అందిపుచ్చుకోవాలనే విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా అతీతం కాదు. ఆయన తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు , అలాగే ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి స్థానాన్ని కూడా గెలిపించాల్సిన  బాధ్యత మీద పడింది. వీటిలో గెలిపించకపోతే ఆయన పలుకుబడి తగ్గిపోతుంది.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే తెలంగాణలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలే అత్యంత కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు పెను సవాల్ అనుకోవచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి