దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రేవంత్ …

By KTV Telugu On 12 May, 2024
image

KTV TELUGU :-

రేవంత్ ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడు. ఆయన్ను కదిలిస్తే కొరివితో తలగోక్కున్నట్లే. ప్రశంసిస్తే ఫర్వాలేదు గానీ, విమర్శిస్తే మత్రం ఎదురుదాడితో సీన్ సితారమవుతుంది.రేవంత్ రెడ్డి ఇచ్చే షాకులకు దిమ్మ తిరిగిపోతుంది. ఇటీవలి కాలంలో తన ప్రత్యర్థులపై ఆయన మాటలతో క్షిపణిదాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ రెడ్డికి ఆయన ఇచ్చిన కౌంటర్ అటాక్..రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అన్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.జగన్ మాట్లాడే మాటలను సొంత చెల్లి, కన్నతల్లే నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ చిన్నాన్నకు ఏం జరిగిందో వాళ్ల కుటుంబ సభ్యులే బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. కన్న తల్లి, చెల్లి విశ్వసించని జగన్ తన గురించి ఏం మాట్లాడిన, ఎలాంటి ఆరోపణలు చేసిన ఆయన మాటలకు విలువ లేదని ముందు తల్లి, చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని జగన్‌కు సూచించారు. జగన్ ముందు తన కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.  రేవంత్  ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడినైనా వదిలిపెట్టడం లేదు. తన జోలికి వస్తే కర్రుకాల్చి వాతబెడుతున్నారు.ఐనా సరే కొందరు నేతలు, జర్నలిస్టులు ఆయన్ను తక్కువగా అంచనా వేసి చీవాట్లు తింటున్నారు.

తనను ఇరకాటంలో పెట్టాలని ఎవరైనా అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ఉపేక్షించడం లేదు. ఎవడైతే  నాకేంటి మర్యాద ఇచ్చి , పచ్చుకుని మాట్లాడాలని ఆయన సమాధానమిస్తున్నారు. పాలసీలపై ఎలాంటి ప్రశ్నలైనా వేయండి, వ్యక్తిగత విషయాల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరిస్తున్నారు….

ఇటీవల ఒక జర్నలిస్టు … మీరు చంద్రబాబు శిష్యుడు కదా అని అడిగారు. అంతే… సదరు పాత్రికేయుడికి రేవంత్ తలంటారు. ఏం తమాషాగా ఉందా అని నిలదీశారు. ఎవరైనా తనను చంద్రబాబు శిష్యుడు అని అంటే ముడ్డి మీద తంతానని హెచ్చరించారు. తను చంద్రబాబు ఒకప్పుటి సహచరులమని ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నామని రేవంత్ సమాధానమిచ్చారు. అంతకు మించి వేరే సంబంధం లేదని, గురు శిష్య  పరంపర అసలు లేనే లేదని రేవంత్ కుండబద్దలు కొట్టడంతో ఆ జర్నలిస్టు బిత్తర చూపులు చూశారు.కొన్ని ప్రశ్నలకు కేసీఆర్ కుటుంబం అడిగినట్లుగానో, అడిగిచ్చినట్లుగానో ఉంటాయని రేవంత్ రెడ్డి అనుమానం. అలాంటప్పుడు ఆయన బాగా రెచ్చిపోతారు. గట్టిగా సమాధానమిస్తారు…ఇప్పుడు  ఏపీ సీఎం జగన్ మాటలపై కూడా రేవంత్ అదే తరహాలో కౌంటరిచ్చారు.  100 శాతం కాంగ్రెస్ పట్ల తనకు లాయల్టీ ఉంటుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు పట్ల తనకు గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. ఆయనతో ఉన్నా రాజకీయ సంబంధాలను 2017లో తెంచుకుని కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. కచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సహకరిస్తానని స్పష్టం చేశారు. జగన్ తనపై కాకుండా ముందు ఆయన కుటుంబ సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఏదో మాట్లాడేద్దామని జగన్ అనకుంటే మాత్రం రేవంత్ దగ్గర ఆయన పప్పులు ఉడకవు అని గుర్తించాలి….

నిధుల విషయంలో రేవంత్  అసహనానికి లోనవుతున్నారని కొందరి వాదన.  ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు జాప్యమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పినా దానికి కావాల్సిన 33 వేల కోట్లు సమీకరించడానికి నానా తంటాలు పడక తప్పదని రేవంత్ కు తెలుసు. అందుకే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రేవంత్ ఎవరు కదిలించినా ఎగిరెగిరి పడుతున్నారని చెప్పుకుంటున్నారు. అసలు సంగతి తెలియడానికి కొన్ని రోజులు పట్టొచ్చు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి