ఎన్నికలంటే ఓట్ల పండుగ అనుకునే రోజు పోయింది. ఇప్పుడు ఎన్నికలంటే డబ్బుల పండుగ అయిపోయింది. ఎవరికెంత డబ్బులు అందాయి. ఎవరికి ఎక్కువ అందాయి. ఎవరికి తక్కువ అందాయి… లాంటి ప్రశ్నలే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంచుడులోనూ ఏదో గోల్ మాల్ జరిగిందన్న చర్చ ఊపందుకుంది. డబ్బులు తక్కువ ఇచ్చారనుకున్నవారిపై ప్రచారాలు తారా స్థాయికి చేరాయి.టికెట్ తీసుకుని డబ్బులు పంచకుండా తమ పార్టీ కొంప ముంచాడని కొందరిపై నోటి మాట ప్రచారం కూడా జరుగుతోంది. దీనితో ఇప్పుడు పోలింగ్ పూర్తయినా సరే అభ్యర్థుల్లో ఏదో తెలియని భయం వెంటాడుతోంది..
ఈ సారి ఎన్నికల తీరు పూర్తిగా మారిపోయింది. డబ్బు పంచడమే పరమావధి అయ్యింది. పంచకపోతే గెలవడం అసాధ్యమని అర్థమైంది. దానితో పోటీ పడి పంచారు. ఫైనల్ గా పోలింగ్ నాటి ఉదయానికి ఎవరు ఎంత పంచారు. పంచుడు ద్వారా ఎవరికెంత విజయావకాశాలు పెరిగాయన్నదే ఇప్పుడు ప్రధానాంశమైంది. అందుకే పంచుడులో జరిగిన పొరబాటుతో ఓటమి అంచున ఉన్నామని పార్టీలు భయపడుతున్నాయి. అదీ అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీల్లోనూ ఉన్న భయమని చెప్పక తప్పదు. నెలరోజులుగా ప్లాన్ చేసినా ఎక్కడో పొరబాటు జరిగిందని, ఓటరుకు కరెన్సీని చేర్చడంలో లొసుగులు తలెత్తాయని పార్టీలు ఆలస్యంగా గుర్తించాయి. నిజానికి పంచుడు ఆటలో తొలి పాట 500 రూపాయల దగ్గర మొదలై రెండు వేల ఐదు వందల దాకా వెళ్లింది. ఒకటి రెండు చోట్ల ఐదు వేలకు కూడా టచ్ అయ్యింది. అదే ఇప్పుడు సమస్య అయ్యింది. తొలుత 500 లేదా వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని తక్కువ ఇచ్చిన వారికి ఓటరు దేవుళ్లు పంగనామం పెట్టేస్తారన్న భయం పార్టీల్లో ఉంది…
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాధారణ విషయమైపోయింది. రాయలసీమలో పంచుతారు. ఉత్తరాంధ్రలో కూడా పంచుతున్నారు. కాకపోతే ఆ రెండు ప్రాంతాల కంటే కోస్తాంధ్రలో పంచేదే ఇప్పుడు హాట్ టాపిక్. మిగతా రెండు ప్రాంతాల కంటే కోస్తాంధ్రలో ముఖ్యంగా గుంటూరు కృష్ణలో ఎక్కువ పంచారన్నది జగమెరిగిన సత్యం. కాకపోతే ఈసారి అక్కడే ఏదో పొరబాటు జరిగిందని పార్టీలు అనుమానిస్తున్నాయి….
పంచడంలో తేడా కొట్టి రెండోసారి పంచాల్సి వచ్చిందని కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఒక పార్టీ యువనేత డబ్బులు పంచే అంశాన్ని ఎంపీ అభ్యర్థులకు వదిలెయ్యాలని ఆదేశించడంతో ఎమ్మెల్యే కేండెట్స్ అంతా క్యాష్ ఇద్దరు ఎంపీ అభ్యర్థుల చేతిలో పెట్టేశారట. అయితే అనుకున్నదానికంటే తక్కువ పంచి ఒక ఎంపీ అభ్యర్థి చేతులు దులుపుకున్నారని చర్చ జరుగుతోంది. మా డబ్బులు మాకివ్వండి … మేము ఎక్కువ పంచుకుంటామని ఎమ్మెల్యే అభ్యర్థులు అడిగితే సమాధానం రావడం లేదని వాపోతున్నారు. డబ్బులు అయిపోయి పంచుడులోనూ తేడా వచ్చి నానా తంటాలు పడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక ఎంపీ అభ్యర్థి ఓటుకు వెయ్యి రూపాయలు పంచేందుకు ఎమ్మెల్యేలకు క్యాష్ పంపించారట. అయితే ఆయన ప్రత్యర్థి మాత్రం తన దగ్గర ఎక్కువ డబ్బులు లేవని ఓటుకు 500 మాత్రమే పంచినట్లుగా చెబుతున్నారు. దానితో వెయ్యి పంచిన పెద్ద మనిషి తనకే విజయమని చెప్పుకుంటున్నారు. విజయంపై విశ్వాసం లేని గుంటూరు, కృష్ణాలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను డబ్బులు దాచేసుకుని గుభనంగా ఉంటున్నారు. కాస్త అవకాశం ఉన్న వాళ్లు మాత్రం తెగ ఖర్చు పెట్టేశారు. ఉమ్మడి ప్రకాశంలో అధికార పార్టీ గ్యాంగ్ డబ్బు వెదజల్లి చెబుతున్నారు. ప్రకాశంలో ఓటు రెండు వేల వరకు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఉమ్మడి నెల్లూరులో ఆయితే వెయ్యి దగ్గర ఆగిందని, ఖచితంగా తమకు ఓటేస్తారనుకునే వారికి మాత్రం రెండు వేల 500 వరకు ఇచ్చారని చెబుతున్నారు…
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో గెలుపును అభ్యర్థులు, పార్టీలు ఎంతో ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, గెలిచి తీరాలన్న పట్టుదలతో పంచారు. ఒక తాజా మాజీ మహిళా మంత్రి అందరికంటే ఎక్కువ పంచారని చర్చ జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి డబ్బులు లేక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని అంటున్నారు. ఏదేమైన రేపు లెక్క చూసుకుని అభ్యర్థులందరూ తల పట్టుకోవడం మాత్రం ఖాయమనిపిస్తోంది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…