కేంద్రంలోనే కాదు. వారణాసిలోనూ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు ప్రధాని మోదీ. ఆధ్యాత్మిక నగరం కాశీ నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన మోదీ.. నామినేషన్ దాఖలుచేశారు. నలుగురు సామాన్యులు ఆయన పేరును ప్రతిపాదించారు.
మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు వెళ్లారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలుగా వారు అక్కడికి వెళ్లారు.
కేంద్రంలో NDA కూటమి 400కుపైగా స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ 40 సీట్లు దాటలేదని అభిప్రాయపడ్డారాయన. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఖాతా తెరిచే ప్రసక్తే లేదన్నారు మోదీ. వారణాసిలో నామినేషన్ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని..రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ ఓడిపోతారనే సంకేతాలిచ్చారు. రాయ్ బరేలీలోనూ ఈ సారి కమల వికాసమే అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కంచుకోటను తాము బద్దలు కొడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
వారణాసి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. NDA నేతలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి..
గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో అఫిడవిట్ పత్రాలు సమర్పించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 25మంది NDA మిత్రపక్షాల నేతలు.. మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఏపీ నుండి ఎన్డీయే మిత్ర పక్షాలయిన టిడిపి,జనసేనల తరపున చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
వారణాసి నుంచి మోదీ నామినేషన్‌ను నలుగురు సామాన్యులు బలపరిచారు. ఇందుకోసం భిన్న సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను ఎంచుకున్నారు ప్రధాని. అయోధ్య రామమందిరంలో బాలక్‌రామ్ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి.. నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదిస్తూ పత్రాలపై తొలి సంతకం చేశారు. అలాగే ఇద్దరు ఓబీసీలు, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.తాను సామాన్యుల తరపున నిలబడే నాయకుణ్నని చాటుకోడానికి మోదీ ఇలా చేశారు.ఎన్నికల్లో ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా కలిసొస్తుందని బిజెపి వర్గాల అంచనాగా చెబుతున్నారు.
నామినేషన్ దాఖలుకు ముందు వారణాసిలోని గంగా నది తీరాన ఉన్న దశాశ్వమేఘ ఘాట్లో పూజలు చేశారు మోదీ
వేద మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. అనంతరం పర్యాటక బోటులో గంగా విహారం చేసిన మోదీ.. కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. ఆధ్యాత్మిక నగరి వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రధాని.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మోజార్టీ దక్కింది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా మూడోసారి వారణాసి బరిలోకి దిగారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్ నుంచి యూపీ పీసీసీ చీఫ్ అజయ్‌రాయ్ పోటీచేస్తున్నారు. మోదీపై ఈయన పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. సార్వత్రిక ఎన్నికల తుదిదశలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. 2014,2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండు సార్లు ప్రధాని అయ్యారు మోదీ. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ పిఎంగా సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆయన తహ తహ లాడుతున్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఎన్డీయే నేతలంటున్నారు. మోదీ మూడో సారి ప్రధాని కావడం కేవలం లాంఛనప్రాయమే అని వారు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…