తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ పోలింగ్ నమోదయింది. ఐదు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు.. మరోసారి పార్లమెంట్ ఎన్నికలపై అంత ఆసక్తి చూపిస్తారని నిపుణులు అనుకోలేదు. కానీ దేశ సగటుతో పోలిస్తే పది శాతం ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి కారణం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడటమే అనుకోవచ్చు. మరి పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది ? బీజేపీకి మేలు జరిగిందా ?
ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే లోక్సభ ఎన్నికలు మాత్రమే తెలంగాణలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు ఐదు నెలల కిందటే అయిపోయాయి. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆ ప్రభుత్వ మనుగడపైనా ప్రభావం చూపిస్తుందన్న ప్రచారంతో అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు అన్నంత ప్రాధాన్యతగా తీసుకున్నాయి. ప్రచారాన్ని అలాగే చేశాయి. ఓటింగ్ పెరగడానికి ఇదే కారణం అనుకోవచ్చు. అయితే భారీగా నమోదైన ఓటింగ్ కారణంగా ఏ పార్టీ లాభపడుతుందన్నది మాత్రం ప్రత్యేకంగా అంచనా వేయడం కష్టంగా మారింది.
అయితే భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుందన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇది సోషల్ మీడియా ప్రచారమే అయినా.. ప్రజల్లోకి వెళ్లిపోయింది. కొన్ని సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. అయితే ఈ ఎడ్జ్ ఎంత స్థాయిలో ఉంటుందో మాత్రం చెప్పడం కష్టం. బీజేపీకి అభ్యర్థుల బలం కలసి వచ్చిన చోట ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. చేవెళ్ల, కరీంనగర్ , మల్కాజిగిరి, మహబూబ్ నగర్ వంటి చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నారు. పార్టీ బలానికి వీరి వ్యక్తిగత బలం కూడా తోడయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోలా బీజేపీ సంచలనం సృష్టించినా ఆశ్చర్యం లేదు. అయితే మోదీ, అమిత్ షాలు చెప్పినట్లుగా డబుల్ డిజిట్ మార్క్ ను చేరుకోకపోవచ్చునన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా లాభపడే పార్టీ బీజేపీ అనే దాంట్లో మాత్రం ఎవరూ మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేద.
ఐదు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. గెలిచేందుకు ఇచ్చిన భారీ హామీలను ఐదు నెలల్లోనే అమలు చేసి చూపి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ప్రజల్ని ఎంత మేర సంతృప్తి పరిచారన్నది ఓటింగ్ ప్రయారిటీకి కీలకం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కుర్చీ బలంగా ఉండాలంటే కనీసం పది సీట్లను సాధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండటంతో నాలుగైదు సీట్లలో కష్టపడాల్సిన అవసరం లేదు. మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ వంటి చోట్ల కాంగ్రెస్ కు పోటీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు వంటి చోట్ల ఎడ్జ్ ఉంది. మరో నాలుగైదు చోట్ల సర్వశక్తులు ఒడ్డారు. ఎంత మేర ఫలితాలు వస్తాయన్నది స్పష్టత లేదు కానీ.. డబుల్ డిజిట్ సాధించడం అన్నది అంత తేలిక కాదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఫీట్ సాధించలేని పరిస్థితులు లేవు కానీ.. పోలింగ్ సరళి మాత్రం కాంగ్రెస్ పార్టీని కన్ ఫ్యూజ్ చేస్తోంది.
ఇక కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదన్నట్లుగా మిగిలిన బీఆర్ఎస్.. ఏది సాధించినా.. అది భవిష్యత్ కు ఆసరా అవుతుందని గట్టిగానే పోరాడింది. కేసీఆర్ శారీరకంగా కష్టం ఎదుర్కొంటున్నా.. ఆయన రాజకీయంగా వెనుకడుగు వేయలేదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణకు బలం కావాలంటే.. బీఆర్ఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఎంత మేర పరిగణనలోకి తీసుకున్నారన్నది ఇప్పటికీ ఫలితం అంచనా వేయలేని విశ్లేషణాత్మక అంశమే. మెదక్, కరీంనగర్, పెద్దపల్లి వంటి స్థానాలపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. రెండు, మూడు సాధించినా… గొప్ప ఫలితమే అనుకోవచ్చు.
ఏపీలో ద్విముఖ పోటీ జరిగింది. అందుకే కొంత మేర అంచనాలు వేస్తున్నారు. కానీ తెలంగాణలో త్రిమఖపోరు జరిగింది. పైగా జాతీయ అంశాలు ఓటింగ్ ప్రయారిటీ అయ్యాయి. అందుకే పోలింగ్ సరళి బట్టి ఫలితాలు అంచనా వేయడం కష్టమే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…