ప్ర‌త్య‌ర్ధుల‌ను ఓడించేందుకు క‌సిగా వ్యూహాలు

By KTV Telugu On 16 May, 2024
image

KTV TELUGU :-

ఈ ఎన్నిక‌లను  కురుక్షేత్ర సంగ్రామంగా  వ‌ర్ణించారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కూట‌మి నేత‌ల‌ను కౌర‌వ సేన‌గా  చెప్పుకొచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కౌర‌వులు ప‌ద్మ‌వ్యూహంలో  చిక్కుకోడానికి తాను అభిమ‌న్యుణ్ని కాన‌ని అర్జునుణ్న‌ని  ప‌దే ప‌దే అన్నారు. తాను అర్జునుణ్న‌యితే ప్ర‌జ‌లే త‌న‌కు దారి చూపించే శ్రీకృష్ణుడ‌న్నారు. నిజంగానే ఈ ఎన్నిక‌లు వైసీపీ-కూట‌మి మ‌ధ్య మ‌హాసంగ్రామంలానే సాగాయ‌ని చెప్పచ్చు. ఈ సంగ్రామంలో ప్ర‌త్య‌ర్ధి శిబిరంలో కొంద‌రిని గుర్తించి వారిని టార్గెట్ గా చేసుకుని ఎన్నిక‌ల ప్రణాళిక‌లు రూపొందించుకున్నాయి  నాయ‌క‌త్వాలు.

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వానికి సంబంధించి కూట‌మి త‌ర‌పున కొంద‌రు కీల‌న నేత‌ల‌ను టార్గెట్ చేసుకున్నారు.  వై నాట్ 175 అన్న నినాదాన్ని అంది పుచ్చుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుప్పంలో చంద్ర‌బాబు నాయుణ్నీ ఓడిస్తామ‌ని  ఏడాదిన్న‌ర క్రిత‌మే స‌వాల్ విసిరారు. అలాగే ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ను మంగ‌ళ‌గిరి నియోజ‌క వ‌ర్గం నుండి ఓడించ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా  పాటు ప‌డ్డారు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు. కుప్పంలో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన  భ‌ర‌త్  గెలుపు ఖాయ‌మ‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. అలాగే మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ పై చేనేత  సామాజిక వ‌ర్గానికి చెందిన మురుగుడు లావ‌ణ్య‌ను బ‌రిలో దింపారు. ఆమెలోకేష్ కు గ‌ట్టి పోటీనే ఇచ్చారు. ఆమె విజ‌యం సాధించే అవ‌కాశాలున్నాయ‌ని వైసీపీ భావిస్తోంది.

ఇక జ‌న‌సేన అధినేత  ప‌వ‌న్ క‌ల్యాణ్  పిఠాపురం నుండి పోటీ చేశారు. ఆయ‌న అక్క‌డి నుండి పోటీ చేస్తార‌న‌గ‌నే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత‌ను పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓడించి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే పార్టీ నాయ‌క‌త్వం ఉంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చివ‌రి స‌భ‌ను పిఠాపురంలో నిర్వ‌హించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వంగా గీత‌ను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ  సిఎంని చేసి పిఠాపురం అభివృద్ధి చేయిస్తాన‌న్నారు. దాన్ని చివ‌రి బాల్ ని సిక్స‌ర్ గా కొట్టార‌ని  సోష‌ల్ మీడియాలో  ప్ర‌చారం జ‌రిగింది. అటు జ‌న‌సేన కూడా వంగా గీత‌ను ఓడించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అసెంబ్లీకి పంపి తీరాల‌న్న క‌సితోనే జ‌న‌సైనికులు ప‌నిచేశారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరా హోరీ పోరేసాగింది. ఎవ‌రు గెలుస్తార‌నేది ఇప్పుడే చెప్ప‌లేం.

చంద్ర‌బాబు నాయుడిపై   నిత్యం విమ‌ర్శ‌లు చేసే వైసీపీ నేత‌లు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మిథున్ రెడ్డి,  విజ‌య‌సాయిరెడ్డి, అంబ‌టి రాంబాబు, పేర్ని నాని, రోజాల‌ను టిడిపి కూడా టార్గెట్ చేసింది.

గుడివాడ‌లో నానిని ఓడించేందుకు ఎన్నారై వెనిగండ్ల రామును రంగంలో దించారు. నెల్లూరులో విజ‌య‌సాయిరెడ్డిపై వేమిరెడ్డి ప్ర‌భాక‌ర రెడ్డిని పోటీలో ఉంచారు. అంబ‌టిపై క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పోటీ చేస్తున్నారు. పేర్ని నాని పోటీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న త‌న‌యుడు పేర్ని కిట్టును ల‌క్ష్యంగా చేసుకున్నారు. కుప్పంలో చంద్ర‌బాబుకు  ప‌క్క‌లో బ‌ల్లెంలా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఓట‌మికీ టిడిపి వ్యూహ‌ర‌చ‌న చేసుకుంది. అలాగే న‌గ‌రిలో రోజాను ఓడించి తీర‌తామ‌ని టిడిపి అంటోంది.

హిందూపురం అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుండి నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేస్తున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో గెలిచిన బాల‌య్య హ్యాట్రిక్ విజ‌యం కోసం త‌హ త‌హ లాడుతున్నారు. అయితే గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న  త‌న ప్ర‌త్య‌ర్ధులైన వైసీపీ అభ్య‌ర్ధుల‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బులిచ్చి వారు సీరియ‌స్ గా పోటీలో ఉండ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని అందుకే గెలిచార‌ని వైసీపీ నాయ‌క‌త్వం భావిస్తోంది. ఈ సారి బాల‌య్య‌పై  కురుబ సామాజిక వ‌ర్గానికి చెందిన దీపిక‌ను బ‌రిలో దింపారు. ఈ ఎన్నిక‌ల్లో బాల‌య్య మొద‌టి సారి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

జ‌న‌సైనికులు కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై  త‌ర‌చుగా విరుచుకు ప‌డే  కొడాలి నాని, పేర్నినాని, అంబ‌టి రాంబాబు ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో  కొడాలి, అంబ‌టిల‌తో పాటు పేర్ని త‌న‌యుణ్ని ఓడిస్తామ‌ని జ‌న‌సేన శ‌ప‌థం చేసింది. అయితే ఇటువంటి వ్య‌హాలు ప‌నిచేస్తాయా అన్న‌ది ప్ర‌శ్న‌. ఓట్ల‌కొనుగోళ్ల కోసం వైసీపీతో పాటు కూట‌మి కూడా పెద్ద మొత్తంలో డ‌బ్బులు వెద‌జ‌ల్లాయి. మ‌రి ఇద్ద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకునే ఓట‌ర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్లాక ఎవ‌రికి ఓటు వేస్తార‌న్న‌ది ఊహించ‌డానికి కూడా క‌ష్ట‌మే అంటున్నారు  ప‌రిశీల‌కులు. మొత్తానికి ఈ ఎన్నిక‌లు పార్టీల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొనింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి