ఏపీ ఎన్నికలు మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలో చిచ్చు రాజేస్తున్నాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, మెగా కుటుంబీకులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ప్రచారం చేశారు. అదే విధంగా జబర్దస్ కళాకారులు కూడా పిఠాపురం వచ్చి పవన్ కల్యాణ్ ని గెలిపించాలంటూ ప్రచారం చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రచారానికి రాలేదు. ఓ వీడియో షూట్ చేసి దాన్ని విడుదల చేసి చేతులు దులుపుకున్నారంతే.
2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టారు పవన్ కల్యాణ్. మొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.2019 ఎన్నికల్లో బిఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని బరిలో దిగారు. భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పవన్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందారు. ఆయన పార్టీ తరపున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ ఎన్నికల్లో అయినా తాను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు పవన్. తనకు అత్యంత అనువైన నియోజక వర్గంగా పిఠాపురాన్ని ఎంచుకుని బరిలో దిగారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పై వంగా గీతను బరిలో దించారు జగన్ మోహన్ రెడ్డి. పిఠాపురంలో వంగాగీతకు మంచి పేరు ఉంది. వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ఆమెకు అడ్వాంటేజ్ ఏంటంటే వైసీపీకి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు బ్యాంకే. అది పవన్ కల్యాణ్ కు పడదు. అందుకే పవన్ కల్యాణ్ పిఠాపురం నుండి గెలవడానికి చాలా కష్టపడాలంటున్నారు రాజకీయ పండితులు. అందుకే నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు జనసైనికులు, అభిమానులు.
ప్రచారం పర్వం చివరి ఘట్టంలో అన్నయ్య చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారని అన్నారు. అయితే ఎందుకో కానీ అది రద్దయ్యింది. చిరంజీవి కేవలం ఒక వీడియో చిత్రీకరించి తన తమ్ముడు చాలా మంచి వాడని..అతన్ని గెలిపిస్తే ప్రజలకు మంచి చేస్తాడని అన్నారు. చిరంజీవి పిఠాపురం రాకపోవడం పవన్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్,సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ప్రచారం చేశారు. అల్లు అరవింద్, రామ్ చరణ్ లు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రానికి వచ్చి పిఠాపురంలో మీడియాకు తారసపడి పవన్ కు మద్దతు చెప్పి వెళ్లిపోయారు.
పవర్ స్టార్ అభిమానులయితే పుష్ప ఫేం అల్లు అర్జున్ తనంతట తానుగా వచ్చి పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ రాలేదు. రెండు రోజుల ముందు తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ట్వీట్ చేశారు. చిత్రంగా ఆ మర్నాడే అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి ని గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రాజకీయంగా తమ శత్రుపక్షమైన వైసీపీ తరపున ప్రచారం చేసిన అల్లు అర్జున్ చిన మావయ్య కోసం పిఠాపురం రాకపోవడం నాగబాబుకు మంట పుట్టించింది.
అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆయన తాజాగా ట్వీట్ పెట్టారు. మనతో ఉంటూ మన ప్రత్యర్ధుల కోసం పనిచేసే వారు మనవాళ్లు కారు.. మన కోసం పనిచేసేవాళ్లు పరాయి వాళ్లు అయినా వారు మనవాళ్లే అని నాగబాబు ట్వీట్ చేశారు. దీని అర్ధం ఏంటంటే… పవన్ కల్యాణ్ ద్వేషించే వైసీపీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం చేసిన అల్లు అర్జున్ మనోడు కాడని తెగేసి చెప్పారు. పవన్ కోసం ప్రచారం చేసిన జబర్దస్త్ కళాకారులు పరాయి వాళ్లు అయినా మనవాళ్లే అని ఆయన ఉద్దేశం కావచ్చునంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి ఎన్నికలు మెగా కుటుంబంలో స్పర్ధలు రాజేశాయి. ఇవి తొందరగా సమసిపోవాలని ఆశిద్దాం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…